Monday, December 23, 2024

9,168 గ్రూప్-4 పోస్టులు

- Advertisement -
- Advertisement -

భర్తీకి సన్నాహాలు, అధికారులతో సిఎస్ సమీక్ష.. టిఎస్‌పిఎస్‌సికి 29లోగా వివరాలు ఇవ్వాలని ఆదేశాలు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటికే గ్రూప్- 1, పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడగా, తాజాగా గ్రూప్-4 ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై ప్రభుత్వం దృష్టి సారించింది. గ్రూప్ -4 కేటగిరీలో 9,168 పోస్టులను భర్తీ చేస్తామని బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. అందుకు అనుగుణంగా గురువారం బిఆర్‌కెఆర్ భవన్‌లో గ్రూప్ -4 నోటిఫికేషన్‌పై పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి, అధికారులు, సంబంధిత శాఖల కార్యదర్శులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. 2018 నూతన రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయని, మిగిలిన 5 శాతం కూడా స్థానికులకే దక్కుతాయని సిఎస్ తెలిపారు. ఇటీవల గ్రూప్ I కింద 503 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రక్రియను ప్రారంభించిందన్నారు. పోలీసు రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కొనసాగుతుండగా, విద్యాశాఖకు కూడా టెట్ నిర్వహణకు క్లియరెన్స్ ఇచ్చినట్లు సి.ఎస్ పేర్కొన్నారు.

గ్రూప్ -4 ఉద్యోగాలకు సంబంధించి రోస్టర్ పాయింట్లు సహా అవసరమైన వివరాలు, సమాచారాన్ని ఈ నెల 29వ తేదీలోపు టిఎస్‌పిఎస్‌సికి అందించాలని అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు. జూనియర్ అసిస్టెంట్, సమాన స్థాయి పోస్టుల ఖాళీలన్నింటి భర్తీ కోసం నోటిఫికేషన్‌లో చేర్చాలని, పదోన్నతుల ద్వారా వచ్చే ఖాళీలను కూడా భర్తీ చేయాలని చెప్పారు. ప్రక్రియ పూర్తికి ఎక్కువ సమయం తీసుకోకుండా అన్ని శాఖల అధిపతులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సిఎస్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, పశు సంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా, ఎసిబి డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్, సీనియర్ కన్సల్టెంట్ శివశంకర్,టిఎస్‌పిఎస్‌సి కార్యదర్శి అనితా రామచంద్రన్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సిఐజి శేషాద్రి,, ఎస్‌సి అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, అటవీ శాఖ పిసిసిఎఫ్ డోబ్రియల్, ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News