రాష్ట్రం మొత్తం ఓటర్లలో 30 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న ఓటర్ల సంఖ్య కోటిన్నరకు పైగా ఉంది. వీరితో పాటు 20 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న వారు ఓటర్ల జాబితాలో మూడొంతులకు పైగా ఉన్నారు. 30 నుంచి 49 ఏళ్లు, 20 నుంచి 49 ఏళ్ల వయస్సు ఓటర్లను కలిపితే సుమారుగా రెండు కోట్ల 24 లక్షల 25 వేల 817గా నమోదయ్యింది. ఇక మొదటి సారి ఓటుహక్కు పొందిన యువఓటర్లు దాదాపు పది లక్షల వరకు ఉన్నారు. ఈ నెల 30వ తేదీన ఓటర్లు తమ తీర్పును ఈవిఎం యంత్రాల్లో నిక్షిప్తం చేయనున్నారు. ఈ మారు ఎన్నికల్లో మూడు కోట్ల 26 లక్షల 2799 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. అందులో పురుషులు కోటి 62 లక్షల 98 వేల 418 మంది కాగా, మహిళలు కోటి 63 లక్షల 1705 మంది ఉన్నారు. ఇతరులు 2,676 మంది ఉన్నారు. మొదటి సారి ఓటుహక్కు వినియోగించుకోనున్న వారి సంఖ్య దాదాపు పది లక్షల వరకు ఉంది. ఓటర్ల జాబితాలో 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న ఓటర్ల సంఖ్య 9,99,667. మొదటి సారి యువ ఓటర్లు ఎక్కువ మంది తమ ఓటుహక్కు నమోదు చేసుకున్నారు. ఇక 20 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసున్న ఓటర్ల సంఖ్య 64 లక్షల 36 వేల 335గా నమోదయ్యింది.
30 నుంచి 39 ఏళ్ల మధ్య వారు 92 లక్షల మంది
రాష్ట్రంలోని ఓటర్లలో 30 నుంచి 39 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. మొత్తం మూడు కోట్ల 26 లక్షలకు పైగా ఓటర్లు ఉండగా అందులో 30 నుంచి 39 ఏళ్ల మధ్య వయసున్న వారే 92 లక్షల 93 వేల 393 మంది ఉన్నారు. 40 నుంచి 49 సంవత్సరాల మధ్య వయసున్న ఓటర్ల సంఖ్య 66 లక్షల 96 వేల 89గా నమోదయ్యింది. ఈ రెండు వయస్సుల వారిని కలిపితే వారి సంఖ్య కోటిన్నర దాటుతుంది. మొత్తం మూడు కోట్ల్ల 26 లక్షలకు పైగా ఓటర్లలో 30 నుంచి 49 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఓటర్ల సంఖ్య కోటి 59 లక్షల 89,482గా ఉంది. అంటే మొత్తం ఓటర్లలో దాదాపు సగం మంది 30 నుంచి 49 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారే ఉన్నారు. వారికి 20 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సు వారిని కూడా కలిపితే ఆ సంఖ్య ఏకంగా రెండు కోట్ల 24 లక్షల 25 వేల 817గా ఉంది. అంటే మూడో వంతు ఓటర్లు 20 నుంచి 49 ఏళ్ల మధ్య వయస్సు వారే ఉన్నారు. ఇక 50 నుంచి 59 ఏళ్ల మధ్య 45 లక్షల 66 వేల 306 మంది, 60 నుంచి 69 ఏళ్ల మధ్య వయస్సు వారు 27 లక్షల 72 వేల 128 మంది ఉన్నారు.
70 నుంచి 79 సంవత్సరాల మధ్య ఓటర్ల సంఖ్య 13 లక్షలు
70 నుంచి 79 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఓటర్ల సంఖ్య 13 లక్షల 98 వేల 511లు కాగా, 80 ఏళ్లు పైబడిన ఓటర్ల సంఖ్య నాలుగు లక్షల 40 వేల 371గా నమోదయ్యింది. రాష్ట్రంలో మొదటిసారి పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. నియోజకవర్గాల వారీగా చూస్తే మొత్తం 119 నియోజకవర్గాలకు గాను ఏకంగా 76 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. 33 జిల్లాలకు గాను 26 జిల్లాల్లో మహిళా ఓటర్లు పురుషుల కంటే ఎక్కువగా ఉన్నారు.
రాష్ట్రంలో ఓటర్లు 3,26,02,799
రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3,26,02,799లు కాగా, అందులో పురుషులు 1,62,98,418 ఓటర్లు, మహిళలు 1,63,01,705, ఇతరులు 2,676గా ఓటర్ జాబితాలో తమపేరును నమోదు చేసుకున్నారు.