సెకండ్‌వేవ్‌పై అధ్యయన వివరాల్ని వెల్లడించిన కేంద్రం
న్యూఢిల్లీ: కొవిడ్19 నుంచి కొవిషీల్డ్ వ్యాక్సిన్ 93 శాతం మేర రక్షణ కల్పిస్తున్నదని, మరణాలను 98 శాతంమేర తగ్గిస్తున్నదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సెకండ్‌వేవ్ సమయంలో ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజి(ఎఎఫ్‌ఎంసి) నిర్వహించిన అధ్యయనం వివరాలను నీతి ఆయోగ్ సభ్యుడు(ఆరోగ్య విభాగం) డా॥ వికె పాల్ మంగళవారం వెల్లడించారు. రెండో ఉధృతికి ప్రధాన కారకంగా డెల్టా వేరియంట్‌ను గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అధ్యయనం ప్రాధాన్యత కలిగి ఉన్నది. 15 లక్షలమంది డాక్టర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లపై ఈ అధ్యయనం జరిపినట్టు పాల్ తెలిపారు. కొవిడ్19పై పోరాటంలో వ్యాక్సిన్లు ఉపయోగపడుతున్నట్టు ఈ అధ్యయనం ద్వారా వెల్లడైందని ఆయన తెలిపారు. అయితే, వ్యాక్సిన్ల వల్ల ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయని, నూటికి నూరుపాళ్లు అవి హామీ ఇవ్వలేవని ఆయన అన్నారు. ఏ వ్యాక్సిన్ కూడా అలాంటి హామీ ఇవ్వలేదని ఆయన అన్నారు. అందువల్ల వ్యాక్సిన్లు తీసుకుంటూనే జాగ్రత్తలు కూడా పాటించాలని పాల్ సూచించారు.