Saturday, December 21, 2024

భారత రాకెట్లలో 95 శాతం విడిభాగాలు స్వదేశీవే : ఇస్రో ఛైర్మన్ సోమనాథ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధనల కోసం ప్రయోగించే రాకెట్లలో 95 శాతం విడిభాగాలు దేశీయంగా అభివృద్ధి చేసినవేనని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ వెల్లడించారు. ఢిల్లీలో మంగళవారం సీఎస్‌ఐఆర్ 82 వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశం లోని జాతీయ పరిశోధన సంస్థలు, డిఫెన్స్ లేబొరేటరీలు, సీఎస్‌ఐఆర్ వంటి వాటితో కలిసి వీటిని రూపొందిస్తున్నట్టు తెలిపారు. కేవలం ఐదు శాతం విడిభాగాలను మాత్రమే విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్టు వివరించారు.

రాకెట్ డిజైన్, తయారీతోపాటు, వాటిలో ఉపయోగించే ముఖ్య విడిభాగాలైన ప్రాసెసర్,కంప్యూటర్ చిప్స్ వంటి వాటిని కూడా దేశీయంగా తయారు చేస్తున్నట్టు తెలిపారు. “ అంతరిక్ష పరిశోధనల కోసం అవసరమయ్యే సాంకేతికత, రాకెట్ , ఉపగ్రహాల తయారీ, స్పేస్ అప్లికేషన్స్ వంటి వాటిని దేశం లోని వివిధ జాతీయ పరిశోధన సంస్థలతో కలిసి ఇస్రో రూపొందిస్తుంది. వాటితోపాటు ఎలక్ట్రోమెకానికల్ యాక్యుయేటర్స్, డీసీ పవర్ సప్లయ్ సిస్టమ్స్, బ్యాటరీ సిస్టమ్స్, సోలార్ సెల్స్‌ను కూడా జాతీయ పరిశోధన సంస్థలతో కలిసి ఇస్రో అభివృద్ధి చేసింది ” అని సోమనాథ్ తెలిపారు.

సిఎస్‌ఐఆర్ ( కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి ) సంస్థాపక దినోత్సవంలో భాగంగా శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డులను 12 మంది యువశాస్త్రవేత్తలకు ప్రదానం చేశారు. ఇమ్యునాలజిస్ట్ దివ్యమాన్ గంగూలీ (సిఎస్‌ఐఆర్ కోల్‌కతా), మైక్రోబయోలజిస్ట్ అశ్వనీకుమార్ (సిఎస్‌ఐఆర్‌ఛండీగఢ్), బయోలజిస్ట్ మడ్డిక సుబ్బారెడ్డి ( సెంటర్ ఫర్ డిఎన్‌ఎహైదరాబాద్) అక్కట్టు టి బిజ్జు (ఐఐఎస్‌సి బెంగళూరు) , దేవబ్రత మైతీ (ఐఐటిబొంబై) తదితరులు అవార్డులు అందుకున్నారు. మెడికల్ సైన్సెస్‌లో గంగూలీ, బయోలాజికల్ సైన్సెస్‌లో కుమార్, రెడ్డి బయోలాజికల్ సైన్సెస్‌లో అవార్డులు అందుకున్నారు.

ప్రధాన సైంటిఫిక్ అడ్వైజర్ అజయ్ సూద్ మాట్లాడుతూ వచ్చే సంవత్సరం నుంచి విజ్ఞాన్ యువ శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డులు ప్రదాని చేస్తారని చెప్పారు. ఇప్పటిలా ఏడు కాకుండా 25 వరకు అవార్డుల సంఖ్య పెరుగుతుందని, యువశాస్త్రవేత్తలకు, సాంకేతిక నిపుణులకు , 12 రంగాల్లో నూతన ఆవిష్కర్తలకు ఈ అవార్డుల ప్రదానం ఉంటుందని తెలిపారు. ఇవి కాక వేరే ఏ రంగానికి చెందిన వారికైనా మరో అవార్డు ఉంటుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News