సూరత్ : రాజకీయ పార్టీలకు ఎలక్టొరల్ బాండ్స్ ద్వారా వస్తున్న విరాళాల్లో 95 శాతం కేవలం బీజేపీకే వెళ్తున్నాయని రాజస్థాన్ ముఖ్యమంత్రి , కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. దాతలు భయంతో ఇతర పార్టీలకు నిధులను ఇవ్వడం లేదన్నారు. గుజరాత్ శాసనసభ ఎన్నికలు త్వరలో జరగబోతున్న నేపథ్యంలో ఆయన శనివారం సూరత్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్, తదితర పార్టీలకు విరాళాలు ఇవ్వకూడదని కార్పొరేట్లను బీజేపీ బెదిరిస్తోందని దుయ్యబట్టారు. ఇతర పార్టీలకు ఎవరైనా విరాళాలు ఇస్తే వెంటనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయం పన్ను శాఖ అధికారులు ఆ విరాళ దాతల ఇళ్ల తలుపులు తట్టుతున్నారని ఆరోపించారు.
భారీగా పోగుచేసుకున్న విరాళాల సొమ్ముతో బీజేపీ దేశ వ్యాప్తంగా ఫైవ్‌స్టార్ పార్టీ కార్యాలయాలను నిర్మించుకుంటోందని మండిపడ్డారు. అలాగే విరాళాల సొమ్ముతో రాష్ట్ర ప్రభుత్వాలను మార్చుతోందన్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూలగొట్టిన విషయాన్ని గుర్తు చేశారు. విధానాలు, పథకాలు, సిద్ధాంతాల ప్రాతిపదికన కాకుండా మతం ఆధారం గానే గెలుస్తోన్న బీజేపీ ఓ ఫాసిస్ట్ శక్తి అని ధ్వజమెత్తారు. మహాత్మాగాంధీ పుట్టిన గెడ్డ గుజరాత్‌లో హింస, అశాంతి వాతావరణం నెలకొందని, ఈ పరిస్థితి ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని హెచ్చరించారు. బీజేపీ పట్ల అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, ఈ ప్రభుత్వాన్ని మార్చవలసిన సమయం ఆసన్నమైందని, తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. ఆమ్‌ఆద్మీ పార్టీ , ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తమకు వ్యతిరేక వార్తలు రాకుండా డబ్బులు వెదజల్లుతున్నారని , ఆయన చేస్తున్నది కూడా ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.