Wednesday, January 22, 2025

పోలీసులకు 9500 కోట్లు కేటాయింపు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసు వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ పోలీసులు ట్యాంక్‌బండ్‌పై ఆదివారం కార్ల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని హోంమంత్రి మహమూద్‌అలీ, మంత్రి తలసాని, ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి, డిజిపి అంజనీకుమార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, సైబరాబాద్ సిపి స్టిఫెన్ రవీంద్ర, రాచకొండ సిపి డిఎస్ చౌహాన్, సినీనటుడు నిఖిల్, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. పోలీసులకు భారీగా బడ్జెట్ పెంచారని, ప్రతి ఏడాది రూ.9,500 కోట్లు కేటాయిస్తున్నారని తెలిపారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత 700 వాహనాలను కొనుగోలు చేశారని తెలిపారు. తెలంగాణ పోలీసులు చాలా బాగా పనిచేస్తున్నారని, దేశంలో నంబర్ వన్ స్థానంలో ఉన్నారని తెలిపారు. పోలీసుల విధుల్లో ఎవరూ జోక్యం చేసుకోకుండా చర్యలు తీసుకున్నారని అన్నారు. సైబర్ నేరాలు పెరగడంతో సైబర్ క్రైం అనాలసిస్ వింగ్‌ను ఏర్పాటు చేశారని, నార్కోటిక్ బ్యూరోను నెలకొల్పారని తెలిపారు. సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ కలిసి రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకుని వస్తున్నారని తెలిపారు. చాలా కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడుతు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని, ఐటి కంపెనీలు ఇక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేశాయని తెలిపారు. సినీ నటుడు నిఖిల్ మాట్లాడుతూ అమెరికా కంటే హైదరాబాద్ చాలా సేఫెస్ట్ సిటీ అని అన్నారు. తాను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగానని అన్నారు. పదేళ్లలో రాష్ట్రం చాలా అభివృద్ధి చెందిందని అన్నారు.

కారు ర్యాలీ ట్యాంక్‌బండ్ నుంచి ఓల్డ్ అంబేద్కర్ స్టాట్యూ,లిబర్టీ, అబిడ్స్, ఎంజే మార్కెట్, చార్మినార్ వరకు సాగింది అక్కడి నుంచి మళ్లీ ట్యాంక్‌బండ్‌కు చేరుకుంది. కారు ర్యాలీలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పోలీసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సిపి సివి ఆనంద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఎం కెసిఆర్ పోలీస్ కమిషనర్లతో సమావేశం అయ్యారని తెలిపారు. రాష్ట్రాన్ని అత్యంత భద్రంగా తీర్చిదిద్దేందుకు ఏమి కావాలని అడిగారని, తాము రూ.150కోట్లతో పెట్రోల్ కార్లు, వివిధ సాంకేతిక పరిజ్ఞానం కొనుగోలుకు ప్రతిపాదనలు ఇచ్చామని, కాని ముఖ్యమంత్రి కెసిఆర్ పోలీస్ శాఖకు రూ.300 కోట్లు కేటాయించారని తెలిపారు. ఆ నిధుల వల్లే రాష్ట్రంలోని ప్రతి మూలకు పెట్రోలింగ్ కారును ఏర్పాటు చేశామని తెలిపారు. పోలీసులపై రూ.100 ఖర్చు చేస్తే పదివేల లాభం వస్తుందనేది నిజమని దీని ద్వారా నిజమైందని తెలిపారు. సిఎం తీసుకునే చర్యల వల్ల పోలీసులు చాలా లాభపడ్డారని, తాము చాలా అదృష్టవంతులమని అన్నారు.

సైబరాబాద్‌లో డ్రోన్ షో…
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సైబరాబాద్ పోలీసులు ఎఎంబి మాలో స్పెషల్ టీంతో సైలెంట్ ఆర్మ్ డ్రిల్ నిర్వహించారు. 50మంది పోలీస్ సిబ్బందితో నిర్వహించిన ఈ డ్రిల్ ఆసక్తిగా సాగింది. డ్రిల్‌లో స్పెషల్ పోలీస్ టీం చేసిన ఆర్మ్ డ్రిల్ ప్రజలను ఆకట్టుకుంది. కార్యక్రమంలో సిఎస్‌డబ్లూ ఎడిసిపి వెంకట్‌రెడ్డి, స్పెషల్ టీం ఇన్‌చార్జ్ ఇన్స్‌స్పెక్టర్ సిద్ధార్థనాయక్, గచ్చిబౌలి ఎస్సై సురేందర్‌రెడ్డి, ఆర్‌ఐ అరుణ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. దుర్గం చెరువు వద్ద సైబరాబాద్ పోలీసులు నిర్వహించిన డ్రోన్ షో అందరినీ ఆకట్టుకుంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి దీనిలో ప్రదర్శించారు.

రాచకొండలో…
రాష్ట్ర అభివృద్ధిలో శాంతిభద్రతలకు కీలక ప్రాధాన్యత ఇస్తున్నామని, పోలీసు శాఖకు అన్ని విధాలుగా అండగా ఉంటామని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఎల్‌బి నగర్‌లో నిర్వహించిన సురక్ష దినోత్సవంలో ముఖ్యఅతిథిగా మంత్రి సబితా, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. గాలిలో బెలూన్లు ఎగురవేసి పోలీస్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలతో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నాట్లు తెలిపారు. అందరూ పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని అన్నారు. 2014కు ముందు తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబడిందని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సారధ్యంలో అన్ని రంగాల్లో తెలంగాణ ముందుకు దూసుకుపోతోందని తెలిపారు.

తెలంగాణ పోలీసులు దేశంలో నంబర్ వన్ స్థానంలో ఉన్నారని తెలిపారు. సిసిటివిల ఏర్పాటుతో నేరాల విచారణ వేగవంతం అయిందని తెలిపారు. నేరాలు కూడా తగ్గుముఖం పట్టాయని, మహిళా భధ్రత కోసం షీటీమ్స్ ఏర్పాటు చేశారని అన్నారు. శాంతిభధ్రతలు బాగుంటేనే అభివృద్ధి సాధ్యమని,రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగాఉండడం వల్లే పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో కొత్త పోలీస్ స్టేషన్లు, ఎసిపి, డిసిపి జోన్లను ఏర్పాటు చేసి పోలీసుల సేవలు ప్రజలకు మరింత అందే విధంగా చేశారని తెలిపారు. ప్రజలతో మమేకం అయ్యేందుకే ఫ్రెండ్లీ పోలీసింగ్ తీసుకుని వచ్చారని తెలిపారు. హోంగార్డు నుంచి అధికారుల వరకు ర్యాలీలో పాల్గొన్నారని తెలిపారు.

రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ మాట్లాడుతూ తాళం వేయనిది ఒక్క పోలీస్ స్టేషన్ మాత్రమేనని అన్నారు. పోలీసులు రాత్రింబవళ్లు ప్రజల కోసం పనిచేస్తూ అందరూ ప్రశాంతంగా నిద్రపోయేలా పోలీసులు చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పోలీస్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకుని వచ్చారని, నూతన ఉద్యోగాలతోపాటు ఆధునిక వాహనాలను సమకూర్చారని అన్నారు. ప్రజల భద్రత కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఉప్పల్ డిఎస్‌ఎల్ మాల్‌లో జరిగిన కార్యక్రమంలో కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రత పరిరక్షణ కోసం తీసుకుంటున్న చర్యల గురించి రూపొందిన వీడియోలు ప్రదర్శించారు. కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, మూసి రివర్ బోర్డు చైర్మన్ సుధీర్‌రెడిడ, ఎమ్మెల్సీ దయానంద్,ఎసిపిలు, డిసిపిలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News