Wednesday, January 22, 2025

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో 96శాతం ఓటింగ్

- Advertisement -
- Advertisement -

96 percent voting in Congress presidential election

ఢిల్లీలో ఓటేసిన సోనియా, ప్రియాంక, బళ్లారిలో రాహుల్
రేపే ఫలితం వెల్లడి, అంతర్గత ప్రజాస్వామ్యానికి నిదర్శనం : మిస్త్రీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దేశ వ్యాప్తంగా సోమవారంనాడు నిర్వహించిన ఈ ప్రక్రియలో 96 శాతం పోలింగ్ నమోదైంది. 9915 ఓట్లలో 9500 ఓట్లు పోలయ్యాయని కాంగ్రెస్ ఎన్నికల నిర్వహణాధికారి మదుసూధన్ మిస్త్రీ వెల్లడించారు. సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే, తిరువనంతపురం ఎంపి శశి థరూర్ కాంగ్రెస్ అధ్యక్ష బరిలో ఉన్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పకడ్బందీగా పోలింగ్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు బుధవారం (ఈనెల 19) ఉంటుంది. అదేరోజు ఫలితం ప్రకటిస్తారు. పిసిసి కార్యాలయాల నుంచి ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి బ్యాలెట్ బాక్సులు చేరుతాయని, వీటిని లెక్కకట్టి లెక్కింపునకు రంగం సిద్ధం చేస్తున్నట్లు మిస్త్రీ తెలిపారు. ఎన్నికల ప్రక్రియ అంతా సజావుగా సాగిందని సంతృప్తి వ్యక్తం చేశారు. కూతురు ప్రియాంక వాద్రాతో కలిసి ఎఐసిసి చీఫ్ సోనియా గాంధీ ఇక్కడి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం సోనియా మాట్లాడుతూ.. ‘ఈ రోజు కోసమే ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తూ ఉన్నా..ఇప్పటికి సమయం వచ్చింది’ అన్నారు.

ఎఐసిసి కార్యాలయం, పిసిసి కార్యాలయాలు, భారత్ జోడో యాత్ర సాగుతోన్న బళ్లారిల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడే రాహుల్ ప్రత్యేక కంటెయినర్‌లో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఓటేశారు. ఆయనతో పాటు డికె శివకుమార్, మాజీ సిఎం సిద్ధరామయ్య ఓటేసిన ప్రముఖుల్లో ఉన్నారు. ఇంకా భారత్ జోడో యాత్రలో రాహుల్ వెంట ఉన్న కాంగ్రెస్ ప్రతినిధులు కూడా తమ హక్కును వినియోగించుకున్నారు. ఉదయం పది నుంచి మధ్యాహ్నం నాలుగు వరకూ పోలింగ్ జరిగింది. పోలింగ్ ప్రక్రియ అంతా సంతృప్తికరంగా సాగిందని పార్టీ ఎన్నికల నిర్వహణాధికారి మదుసూధన్ మిస్త్రీ విలేకరులకు తెలిపారు. పెద్దగా ఎక్కడా ఎటువంటి ఫిర్యాదులు అందలేదని, అంతా సజావుగా ఉందని వివరించారు. ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇతర నేతలు ఓటేశారు. కర్నాటకలో ఖర్గే ఓటేశారు. థరూర్ తిరువనంతపురంలో పోలింగ్‌లో పాల్గొన్నారు. తనకు థరూర్ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారని ఖర్గే విలేకరులకు తెలిపారు. తమది స్నేహపూరిత పోటీ అని, దేశానికి ఉజ్వల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పటిష్టతకు పాటుపడే రీతిలోనే ఈ పోటీ ఉందని ఖర్గే వివరించారు.

ఇదిలావుండగా ఎటువంటి అపశృతి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. మొత్తం పోలింగ్ ప్రక్రియను కెమెరాలలో రికార్డు చేశామని, సీక్రెట్ బ్యాలెట్ ప్రక్రియ కావడంతో ఎవరు ఎవరికి ఓటేశారనేది తెలియదని, పూర్తిగా ఎవరికి ఆధిక్యత అనేది స్పష్టం అవుతుందని మిస్త్రీ తెలిపారు. నూతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల ఎంపికకు కూడా ఓటింగ్ ఉంటుందా? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ దీనిని కొత్త అధ్యక్షులు పార్టీ ప్లీనరీలో ఖరారు చేస్తారని తాము చెప్పలేమని వివరించారు. ఈ ఎన్నికలతో తనకు బాగా అనుభవం వచ్చిందని, ఇది తనకైతే ఓ ఉత్సవంగా అన్పించిందని, పైగా ఓ ప్రజాస్వామ్య ప్రక్రియకు నాయకత్వం వహించాననే అనుభూతి కల్గిందని తాను సవినయంగా తెలియచేస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీ , చండీగఢ్ పార్టీ కార్యాలయాలలో నూటికి నూరుశాతం ఓట్లు పడ్డాయి.

గాంధీ కుటుంబం సలహాలపై సిగ్గెందుకు ః ఖర్గే

పార్టీకి నేతగా ఎన్నికైతే తాను ఇంతకు ముందటి లాగానే గాంధీ కుటుంబం నుంచి సలహాలు తీసుకుంటానని, ఇందుకు సిగ్గుపడే ప్రసక్తే లేదని మల్లిఖార్జున ఖర్గే బెంగళూరులో స్పందించారు. పార్టీ నిర్మాణానికి సవాళ్లను ఎదుర్కోవడానికి వారి సలహాలు తీసుకుంటే తప్పేముంది? అని ప్రశ్నించారు. ముందు ఫలితం వెలువడితే తరువాత అన్ని విషయాలు కాలక్రమంలో మీకె తెలుస్తాయని చమత్కరించారు.

గెలుపు నమ్మకం ః థరూర్

ఆది నుంచి తాను గెలుపుపై పూర్తి నమ్మకంతోనే సాగానని, అయితే రానురానూ ప్రతిబంధకాలు ఎదురయ్యాయని తిరువనంతపురంలో ఓటేసిన తరువాత శశి థరూర్ తెలిపారు. నేతలు , నెలకొని ఉన్న ప్రక్రియ,పార్టీ వ్యవస్థతో ప్రతిబంధకాలు ఏర్పడ్డాయని వాపోయారు. ప్రముఖ నేతలు అంతా వేరే అభ్యర్థి వైపు నిలిచారని నిస్సహాయత వ్యక్తం చేశారు. తాను తన రాజకీయ భవిష్యత్తు కోసం ఈ పోటీకి దిగలేదని, దేశం పటిష్ట కాంగ్రెస్‌ను కోరుకుంటోంది. ఈ క్రమంలోనే పార్టీలో మార్పు కోసం బరిలోకి దిగానని చెప్పారు. వ్యక్తుల విజయం గురించి కాకుండా కాంగ్రెస్‌కు మంచి కోసం ఇద్దరం ఏకాభిప్రాయంతో ఉన్నామని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పునరుద్ధరణ ప్రక్రియ సాగుతోందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News