Thursday, November 21, 2024

దండాలయ్యా ఉండ్రాళ్లయ్యా

- Advertisement -
- Advertisement -

జగన్మాత ముద్దుల కుమారుడు బొజ్జ గణపయ్య. ఆ స్వామిని పూజించనిదే ఏ కార్యమూ ప్రారంభించం. ఆయన ఆశీర్వాదం లేనిదే ఏ పనీ పూర్తికాదు. భారతీయులకున్న ముక్కోటి దేవతలలో వినాయకుడికి ప్రత్యేక స్థానముంది. ప్రతి ఒక్కరికీ ఎవరో ఒకరు ఇష్టదైవంగా ఉండొచ్చు. కానీ విఘ్నేశ్వరుడు అందరికీ కావాల్సినవాడు. అందుకే వినాయక చవితి అంటే ప్రతి ఒక్కరికీ మహాఇష్టం.

21 types of jute bag offering an online aaradhya company

ఏకదంతుడు ఎలా అయ్యాడంటే..వినాయకుడికి మరో నామం ఏకదంతుడు. ఈ పేరు రావడానికి ఓ కథ ఉంది. శివపార్వతులు ఏకాంతంగా ఉన్న సమయంలో పరశురాముడు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అప్పుడు ద్వారం వద్ద ఉన్న వినాయకుడు ఆయన్ను లోపలికి అనుమతించలేదు. అసలే పరశురాముడికి కోపమెక్కువ. అందులోనూ ఆకారంలో చాలా చిన్నగా ఉండే వినాయకుడు తనను అడ్డుకోవడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. తన చేతిలో ఉన్న గొడ్డలిని బాలకుడి మీదకు విసిరేశాడు. ఆ గొడ్డలి సాక్షాత్తు పరశురాముడికి శివుడు ప్రసాదించిందే. తన తండ్రి అనుగ్రహించిన ఆ గొడ్డలికి ఎదురెళ్లడం ఇష్టంలేక గణేశుడు ఆ గొడ్డలికి నమస్కరించాడు. అప్పటికే అది వినాయకుడి ముఖం మీద దాడి చేసి ఓ దంతాన్ని ఖండించింది. దాంతో అప్పటి నుంచీ ఆయనకు ఏకదంతుడనే పేరు వచ్చింది.
* మరో కథ కూడా ప్రచారంలో ఉంది. వ్యాసుడు భారతాన్ని లిఖించడానికి అనువైన వ్యక్తి కోసం అన్వేషిస్తున్నప్పుడు వినాయకుడు ముందుకొచ్చాడట. కానీ వ్యాసుడికి ఓ షరతు పెట్టాడట. వ్యాసుడు ఎక్కడా ఆగకుండా భారతం చెబుతుండాలని కోరాడట. దానికి వ్యాసుడు అంగీకరించాడట. అలా వ్యాసుని వేగానికి తగిన విధంగా మహా భారతాన్ని లిఖించడానికి తన దంతాన్ని ఉపయోగించాడట. అప్పటి నుంచి ఆయన ఏకదంతుడిగా మిగిలిపోయాడని అంటారు. ఇలా వినాయకుడి దంతం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి.
కుబేరుని గర్వం అణిచాడు
కుబేరుడు ఎంత ధనవంతుడో అంత ధన గర్వం కలవాడు. తన దగ్గరున్న ధనాన్ని అందరికీ ప్రదర్శించాలన్న కోరిక ఆయనకు కలిగింది. ఇందుకోసం పెద్ద ఎత్తున విందును ఏర్పాటు చేయదలిచాడు. ముందుగా పరమశివుని వద్దకు వెళ్లి తను ఏర్పాటు చేసిన విందుకు రమ్మని ఆహ్వానించాడు. ఆ ముక్కంటికి కుబేరుని గర్వం, అహంకారం అవగతమైంది. ఎలాగైనా అతనికి గర్వభంగం కలిగించాలని భావించాడు. అందులో భాగంగా, తనకు బదులు తన కుమారుడు విఘ్నేశ్వరుడు విందుకు వస్తాడని చెప్పి కుబేరుడిని పంపించి వేశాడు. విందు రోజు రానే వచ్చింది. వినాయకుడు కుబేరుని నివాసానికి వెళ్లాడు. కుబేరుడు వినాయకుడిని వెంటపెట్టుకుని తన రాజమందిరం చూపిస్తూ తన ప్రాభవాన్ని ప్రదర్శించసాగాడు. భవనం అంతా కలియతిరుగున్న వినాయకుడికి ఆకలి అనిపించింది. అదే మాట కుబేరుడికి చెప్పడంతో ఆయన పరిచారికలను పిలిచి గణేశుడికి అతిథిమర్యాదలు చేయమని పురమాయించాడు. పరిచారికలు వినాయకుడికి ఎంత భోజనం వడ్డించినా, ఆయన ఆకలి తీరలేదు. ఆఖరికి అలకాపురిలో ఆహారం అన్నది లేకుండా పోయింది. అయినా ఆకలి తీరని వినాయకుడు కనిపించిన ప్రతి దానిని ఆరగించడం మొదలుపెట్టాడు. దాంతో భయపడిన కుబేరుడు శివుడిని శరణు వేడాడు. తన తప్పును క్షమించమని వేడుకున్నాడు. అప్పుడా ముక్కంటి చిరునవ్వుతో గుప్పెడు మెతుకులు కుబేరుని చేతిలో ఉంచి వాటిని గణేశుడికి ఇవ్వమని చెప్పాడు. అలకా పురికి చేరుకున్న కుబేరుడు ఆ గుప్పెడు మెతుకులు వినాయకుడికి అందించగానే, వాటిని ఆరగించిన వినాయకుడికి జఠరాగ్ని చల్లారింది. దాంతో పాటు కుబేరుని గర్వమే అణిగింది.

Ganesha
గరికంటే ఎంతో ప్రీతి…
వినాయకుడికి గరిక అంటే ఎంతో ఇష్టం. దీని వెనుకా ఒక కథ ఉంది. పూర్వం యమధర్మరాజుకి అనలాసురుడు అనే పుత్రుడు జన్మించాడు. ఆ బాలుడు పుట్టుకతోనే అగ్నితత్వాన్ని కలిగి ఉండటంతో ఎదురుగా ఉన్న దాన్ని భస్మం చేసేవాడు. దాంతో ముల్లోకాలు అల్లకల్లోల మవసాగాయి. ఆ సమయంలో వినాయకుడు అనలాసురుడి అంతం చూసేందుకు సిద్ధపడ్డాడు. తన తండ్రి మాదిరిగానే ఆ రాక్షసుడిని వినాయకుడు గుటుక్కున మింగేశాడు. వినాయకుని ఉదర భాగానికి చేరుకున్న అనలాసురుడు అక్కడ విపరీతమైన తాపాన్ని కలిగించసాగాడు. వినాయకుడి ఉదరంలో తాపం తగ్గించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. చివరికి గరికతోనే తనకు ఉపశమనం కలుగుతుందని గణేశుడు భావించి, తనను గరికతో కప్పమని దేవతలను కోరాడు. దేవతలందరూ 21 గరికలను తీసుకొచ్చి వినాయకుడి శరీరాన్ని కప్పారు. గరికలోని ఔషధ గుణాల కారణంగా వినాయకుడి తాపం తగ్గింది. అప్పటి నుంచి వినాయకుడికి గరిక అత్యంత ప్రీతిపాత్రమైంది. ఆయనకిష్టమైన గరితో చవితి రోజు పూజించడం మొదలైంది. ఇప్పటికీ గరికలేనిదే వినాయక చవితి పూజ సంపూర్ణం కాదు.

పూజకు కావాల్సిన వస్తువులు

* వినాయక మట్టిప్రతిమ
* గంధం
* పసుపు
* అక్షింతలు
* ఒత్తులు
* కుంకుమ
* బియ్యం
* అగ్గిపెట్టె
* రెండు దీపపు కుందులు
* వినాయక వ్రతకల్ప పుస్తకం
* జేగంట, 12 అగరు
బత్తీలు, ఆవునెయ్యి లేదా కొబ్బరినూనె (దీపారాధనకు)
* ఆచమన పాత్రలు (గ్లాసులు)
* మూడు ఉద్ధరిణులు (స్పూన్లు)
* చేతులు కడుక్కోవడానికి, ఆచమనాదుల కోసం చిన్న పళ్లెం
* నైవేద్యానికి, పూలు, పత్రి పెట్టుకోవడానికి మూడు పళ్లాలు
* హారతి పళ్లెం
* కర్పూరం
* రెండు కొబ్బరికాయలు
* తీర్థం పట్టడానికి గ్లాసు
* అరటిపళ్లు, వెలగపళ్లతో పాటు నైవేద్యానికి ఇతర పళ్లు
* వివిధ రకాల పుష్పాలు
* 21 రకాల పత్రి
* తమలపాకులు, 24 వక్కలు
* రెండు యజ్ఞోపవీతాలు

(పత్తిని సన్నని దారంగా చేసి మధ్యమధ్యలో పసుపు కుంకుమలను అద్దితే యజ్ఞోపవీతాలు సిద్ధం)
* రెండు రవిక ముక్కలు లేదా కండువాలు ( రూపాయి బిళ్లంతటి పరిమాణంలో దూదిని తీసుకుని తడిపి దానికి కుంకుమ అద్దితే అవి కూడా వస్త్రాలతో సమానం)
* మధుపర్కం (చిన్న గిన్నెలో తేనె, పెరుగు, నెయ్యి, చెరకు రసం కలిపిన మిశ్రమం)
* రెండు జతల తాంబూలాలు (5 తమలపాకుల్లో రెండు వక్కలు, 2 అరటి పళ్లు, రూపాయి దక్షిణ చొప్పున)
* పంచామృతం (ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవునెయ్యి, చెరుకు రసం కలిపిన మిశ్రమం).

పాలవెల్లి

* పాలవెల్లికి అలంకరించేందుకు కాడలున్న కాయలు, పళ్లు కావాలి. (కనీసం 9)
* నైవేద్యం (బెల్లం ముక్కలు, 21 ఉండ్రాళ్లు లేదా కుడుములు లేదా మోదకాలు, ఇవేగాక అప్పాలు, అటుకులు, లడ్డూలు, పరమాన్నం, పానకం, ఇంకా మీ యథాశక్తిగా నైవేద్యం సిద్ధం చేసుకోవచ్చు.)
పాలవెల్లి అలంకరణ

ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి దేవుడి గదిలో లేదా ఇంటిలోని ఈశాన్యమూల స్థలాన్ని శుద్ధిచేసి గోమయంతో కానీ, పసుపుతో కానీ అలకాలి. బియ్యపుపిండితో లేదా రంగులతో ముగ్గులు వేయాలి. ఆసనం కోసం ఒకపీట లేదా మంటపం ఏర్పాటు చేయాలి. పీట పైభాగాన పళ్లూ కాయలూ కట్టిన పాలవెల్లిని పందిరిగా అలంకరించాలి. పీటను అలంకరించి దానిపై బియ్యం పోసి మట్టివినాయక ప్రతిమను ఉంచాలి.

Vinayaka Chavithi Story Telugu

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News