Friday, September 20, 2024

బి ఫారాలపై నేడు కెసిఆర్ కీలక భేటీ

- Advertisement -
- Advertisement -

B Forms

 

హైదరాబాద్: మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసిన అభ్యర్థులకు నేటి నుంచి బి ఫారాలను టిఆర్‌ఎస్ ఇవ్వనుంది. అయితే బిఫారాల పంపిణీపై అనుసరించాల్సిన మార్గదర్శకాలపై నేడు టిఆర్‌ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గాల పార్టీ నాయకులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గం ఇన్‌ఛార్జీలు, శాసనసభ్యులు అత్యవసరంగా హైదరాబాద్‌కు చేరుకోవాలని పార్టీ ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 10 గంటల నుంచి జరిగే ఈ ఆంతరంగింక సమావేశంలో టిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పలు విధాన నిర్ణాయాలు తీసుకోనున్నారని పార్టీ నాయకులు చెప్పారు.

తుదిజాబితాపరిశీలన
పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు అనేక సర్వే నివేదిలను పరిశీలన అనంతరం నియోజకవర్గాల శాసనసభ్యులు, శాసనసభ్యులు లేని నియోజకవర్గాల్లో టిఆర్‌ఎస్ ఇన్‌ఛార్జీలు రూపొందించిన జాబితాను టిఆర్‌ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పరిశీలించి తుదినిర్ణయం తీసుకోనున్నారు. కొన్ని మున్సిపాలిటీల్లో టిఆర్‌ఎస్ నుంచి పోటీ చేసేందుకు నాయకుల మధ్య తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో ఆ నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలతో సిఎం కెసిఆర్ సమావేశం కానున్నారు. పార్టీ నిర్ణయాన్ని ఖచ్చితంగా పాటిస్తూ అందరూ కలిసి అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలని ఇటీవల సిఎం కెసిఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పోటీలో ఉన్న నాయకుల జాబితాను సిఎం కెసిఆర్ పరిశీలించి అభ్యర్థుల ఖరారులో తుది నిర్ణయం నియోజక వర్గాల ఇన్‌ఛార్జీలకు తెలియచేస్తారని టిఆర్‌ఎస్ నాయకులు చెప్పారు.

పోటీ కి అవకాశాలు రానివారికి నామినేటెడ్ పదవులు ఇవ్వనున్నట్లు చేసిన ప్రకటనుకూడా ఈసమావేశంలో చర్చించ నున్నారు. పార్టీ పరంగా ఏర్పడిన నామినేషన్ పదవులపై కూడా సమామేశంలో సమీక్షిస్తారని సమాచారం. పోటీకి సిద్ధమవుతున్న అభ్యర్థుల సంఖ్య వేలల్లో ఉండటంతో అభ్యర్థుల ఎంపిక బి ఫారాల పంపిణీపై స్పష్టమైన ఆదేశాలను సిఎం కెసిఆర్ ఈ సమావేశంలో జారీ చేయనున్నారు.

మంత్రులు బాధ్యతాయుతంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలి
గెలుపు ఒటమి బాధ్యతలను మంత్రులతో పాటు శాసన సభ్యులకు టిఆర్‌ఎస్ పార్టీ అప్పగించింది. శాసన సభ్యులు సూచనల మేరకు మంత్రులు ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంటుంది. ఇప్పటికే మంత్రులకు బాధ్యతలను అప్పగించిన టిఆర్‌ఎస్ అధిష్టానం మరోసారి ఏ మంత్రి ఎక్కడ ప్రచారంలో పాల్గొనాలి జిల్లాల్లో నెలకొన్న తాజారాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చజరగనుంది. అనేక నియోజకవర్గాల్లో ఇతర రాజకీయ పార్టీల నుంచి టిఆర్‌ఎస్‌లోకి చేరిన నాయకులు ఉన్నారు. వారందరిని కలపుకొని ఎన్నికల ప్రచారం చేయాలని పార్టీ నిర్ణయించింది. ఇతర పార్టీల నుంచి టిఆర్‌ఎస్‌లో చేరిన అభ్యర్థులు స్థానికంగా గెలుపుగుర్రాలుగా భావిస్తే కార్పొరేటర్, వార్డు మెంబర్లుగా పోటీలో నిలపాలని టిఆర్‌ఎస్ నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో మున్సిపాలిటీల వారిగా టిఆర్‌ఎస్ అధిష్టానం సమీక్షించి శాసన సభ్యులు ఇచ్చిన నివేదికను పరిశీలించ నుంది. అలాగే రాష్ట్రంలోని అనేక పట్టణాల్లో ఇతర పార్టీల నుంచి టిఆర్‌ఎస్‌లో కి వచ్చేవారిని పార్టీలో చేర్చుకోవాలని టిఆర్‌ఎస్ అధినేత ఆదేశాలమేరకు అనేక పట్టణాల్లో కాంగ్రెస్,బిజెపి నుంచి పట్టణ స్థాయి నాయకులు, మాజీ కార్పోరేటర్లు, మాజీ వార్డు సభ్యులు టిఆర్‌ఎస్ ఖండువా కప్పుకున్నారు. వారందరిని ఎన్నికల ప్రచారంలో పాల్గొనే విధంగా ప్రోత్సహించాలనీ, వారిలో ప్రజాబలం ఉన్న నాయకులను పార్టీ పరంగా భవిష్యత్‌లో అవకాశాలు కల్పించాలనే అంశంపైకూడా ఈ సమావేశంలో చర్చజరగనుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకుల జాబితాను కూడా ఈ సమావేశంలో సిఎం కెసిఆర్ పరిశీలించ నున్నారు.

జాబితాకు తుది మెరుగులు
టిఆర్‌ఎస్ ఆంతరంగికంగా చేసిన సర్వే నివేదికలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు, శాసన సభ్యులు రూపొందించిన జాబితాను మరోసారి పరిశీలించి మున్సిపాలిటీల వారిగా పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సమావేశంలో ఆమోద ముద్ర వేయనున్నారు. వార్డు మెంబర్ల నుంచి మున్సిపాలిటీ ఛైర్మన్, కార్పోటర్ల నుంచి కార్పోరేషన్ ఛైర్మనన్లు ఎన్నుకోనున్న నేపథ్యంలో ఈ రెండు పదవులకు అర్హతగల అభ్యర్థుల వివరాలపై శాసన సభ్యులతో సిఎం కెసిఆర్ ఆంతరంగికంగా సమావేశం కానున్నారని తెలిసింది. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు ఛైర్మన్ పదవి ఎవరిని వరించనుందో ప్రకటించవద్దని టిఆర్‌ఎస్ నిర్ణయం తీసుకున్నట్లు నాయకులు చెప్పారు. అయితే ఈపదవులకు అర్హతగల వారి జాబితా కూడా పార్టీ అధిష్టానం దగ్గర సిద్ధంగా ఉందని, శాసన సభ్యుల అభిప్రాయాలను తీసుకుని ఎన్నికల ఫలితాల అనంతరం వెల్లడి చేయనున్నట్లు తెలిసింది.

బిఫారాలు సిద్ధం
టిఆర్‌ఎస్ పార్టీ అధిష్ఠానం బిఫారాలను సిద్ధం చేసింది. పార్టీ అధిష్టానం ఆదేశాలమేరకు పోటీలో నిలిచే అభ్యర్థులతో ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహించి శాసనసభ్యులు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు బిఫారాలు ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. మూడవ వ్యక్తి ద్వారా బిఫారాలు అందివ్వకూడదని స్పష్టంగా పార్టీ నిర్ణయించింది. బిఫారాలు పోటీచేసే అభ్యర్థులకు నేరుగా ఇవ్వడంతో వారిలో ఉత్సాహం పెరగడంతో పాటు దుర్వినియోగం అయ్యే అవకాశాలుండవని పార్టీ భావిస్తుంది. ఈ మేరకు బిఫారాల మార్గదర్శకాలను సిఎం కెసిఆర్ రూపొందించి శాసన సభ్యులకు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలకు గురువారం జరిగే సమావేశంలో ఇవ్వనున్నారు. శాసనసభ్యులు బిఫారాలను నేరుగా మున్సిపాలిటీలు, కార్పోరేషన్‌ల నుంచి పోటీ చేసే అభ్యర్థులకు ఇవ్వడంతో పాటు వారితో నామినేషన్స్ దాఖలు చేయించే బాధ్యతలను కూడా టిఆర్‌ఎస్ అధిష్ఠానం నేటి సమావేశంలో అప్పగించనుంది.

బిఫారాలతో పాటు ఎ ఫారాలు
పార్టీ నుంచి ఈ అభ్యర్థి పోటీలో ఉంటారనీ, పార్టీ ఎన్నికల గుర్తు కారును ఈ అభ్యర్థుకే కేటాయించాలని ఇచ్చే బి ఫారాలతో పాటు ఎ ఫారాలు ఇచ్చే సంప్రదాయానికి టిఆర్‌ఎస్ తెరతీసింది. ఎ ఫారంతోనే నామినేషన్ వేయాలి. ఎన్నికల నామినేషన్ సందర్భంగా అభ్యర్థులు పూర్తి వివరాలతో నింపే దరఖాస్తు ఎ ఫారం. ఈ ఎ ఫారాన్ని కూడా టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి పేరుతో నింపి బిఫారంతో జతచేసి నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థికి శాసనసభ్యులు ఇవ్వనున్నారు. ఈ రెండు ఫారాల ప్రాముఖ్యత, అభ్యర్థులకు ఏ విధంగా అందించాలనే అంశాలను ఈ సమావేశంలో సిఎం కెసిఆర్ వివరించనున్నారు. ఎ ఫారాలు ఇచ్చే సంప్రదాయం మొదటిసారిగా టిఆర్‌ఎస్ ప్రవేశపెడుతుందని నాయకులు చెప్పారు.

శుక్రవారం భారీగా నామినేషన్లు
అభ్యర్థుల ఖరారు,బిఫారాలు, ఎ ఫారాల పంపిణీ వ్యవహారం గురువారం నుంచి ప్రారంభ అయినప్పటికీ శుక్రవారం నుంచి మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించి నామినేషన్లు దాఖలు చేయాలని టిఆర్‌ఎస్ అధిష్టానం యోచిస్తుంది. అయితే 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్ల సమావేశాలు ఒకేరోజు నిర్వహించడం బదులు నామినేషన్ గడువులోగా నిర్వహించి నామినేషన్లు దాఖలు చేయాలని టిఆర్‌ఎస్ యోచిస్తుంది.

ఈ నేపథ్యంలో నామినేషన్ వేసే తేదీలు, సన్నాహక సమావేశాలకు ఆహ్వానితులు, శాసనసభ్యుల బాధ్యతలు, జిల్లామంత్రుల బాధ్యతలపై ఈ సమావేశంలో మరోసారి విస్తృతంగా చర్చించినిర్ణాయాలు తీసుకోనున్నారు. ఈ సమావేశం పూర్తి స్థాయిలో సిఎం కెసిఆర్ ఆంతరంగికంగా నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు సమావేశం జరిగే అవకాశాలుండటంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారిగా శుక్రవారం పోటీ చేసే అభ్యర్థులకు బి, ఎ ఫారాలు ఇచ్చి నామినేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది.

KCR key meeting on B Forms today
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News