Saturday, September 21, 2024

కారణజన్ముడు

- Advertisement -
- Advertisement -

CM-KCR

 

భారతదేశానికి మొదటి పార్లమెంటరీ ఎన్నికలు జరిగిన రెండేళ్ల తరువాత 1954 ఫిబ్రవరి 17 వ తేదీన మెదక్ జిల్లాలోని చింతమడకలో జన్మించిన కె.సి.ఆర్. 66 ఏండ్ల జీవితాన్ని పూర్తి చేసుకుంటున్నారు. ఈ అరవై ఆరేళ్లలో నలభై ఏండ్లకుపైగా రాజకీయానుభవమున్న కె.సి.ఆర్. రాజకీయ దురంధరుడు, అపర చాణక్యుడు. తెలంగాణ రాజకీయాలను మాత్రమే కాకుండా భారత రాజకీయాలను మలుపు తిప్పగల రాజకీయ చతురుడు. సామాన్య మధ్య తరగతి కుటుంబంలో పుట్టి స్వయం ప్రతిభతో అసామాన్య రాజకీయ వేత్తగా ఎదిగిన ధీశాలి. పువ్వు పుట్టగానే పరిమళించునన్నట్టు విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలను అలవర్చుకుని విద్యార్థి నాయకుడుగా రాజకీయ అరంగేట్రం చేసినవారు. ఉస్మానియా విశ్వ విద్యాలయంలో తెలుగు సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యువేషన్ (ఎం.ఎ.) చేసిన కె.సి.ఆర్. ఆ కాలంలోనే ఉద్యోగం చేయనని ఖరాఖండిగా చెప్పిన దూరదర్శి.

తన చిన్ననాటి రాజకీయ గురువు మదన్ మోహన్ చదువు పూర్తి కాగానే ఉద్యోగం చేయమని అడిగితే, తాను రాజకీయాల్లోకి వస్తానని నిర్మోహమాటంగా చెప్పిన నిక్కచ్చి మనిషి. కె.సి.ఆర్. అప్పుడే రాజకీయాల్లోకి రాకుండా ఉండి ఉంటే తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమయి ఉండేదా అనేది ప్రశ్న మాత్రమే కాదు పచ్చి నిజం.తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే, బంగారు తెలంగాణ స్థాపన కోసమే రాఘవ రామ, వెంకటమ్మ దంపతులకు ముద్దు బిడ్డగా జన్మించిన కారణజన్ముడు కె.సి.ఆర్. తాను పుట్టిన నేల మీద అచంచలమైన ప్రేమతో తెలంగాణను సాధించి పెట్టిన పోరాట యోధుడు.

అంబేడ్కర్ లేకుంటే ఈ దేశ దళిత బహుజనుల పరిస్థితి ఎలా ఉండేదోనని సభల్లో అంబేడ్కర్‌ను గురించి పాటలు పాడుకున్నట్టే కె.సి.ఆర్. లేకుంటే తెలంగాణ శాశ్వతంగా వలసవాదుల పాలనలో మగ్గిపోయేదన్నది వాస్తవం. బ్రిటిష్ పాలన నుండి భారతదేశాన్ని మహాత్మాగాంధీ విముక్తం చేసినట్టే తెలంగాణను విముక్తం చేసిన మహాత్ముడు కె.సి.ఆర్. గాంధీ ఎన్నుకున్న అహింసా మార్గాన్నే, ప్రభుత్వ ఆస్తులకు గాని, ఇతరత్రా కానీ నష్టం కాకుండా పోరాట మార్గాన్నెన్నుకున్నాడు కె.సి.ఆర్. మడమ తిప్పని పోరాటం చేశాడు. తెలంగాణ కోసం మరణం చివరి అంచుల వరకు పోయివచ్చారు, తెలంగాణ సాధించారు. పదమూడేళ్ళ రాజీలేని పోరాట ఫలితంగా ఎంతో మంది అమర వీరుల ప్రాణ త్యాగాల ఫలితంగా వచ్చింది తెలంగాణ. కాంగ్రెస్ పార్టీతో ప్రారంభమైన ఆయన రాజకీయ జీవితం, తెలుగుదేశం పార్టీలో క్రమ వికాసం చెంది, టి.ఆర్.ఎస్. సవంత పార్టీ స్థాపనతో సంపూర్ణత సాధించింది.

సమయోచిత నిర్ణయాలు, సందర్భోచిత ఉపన్యాసాలు కె.సి.ఆర్.కు వెన్నతో పెట్టిన విద్యలాంటివి. స్వాతంత్య్రానంతరం మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్‌ను ఏలిన కాంగ్రెస్ పార్టీ క్రియారాహిత్యం, దక్షిణాదిని నిర్లక్ష్యం చేయడం లాంటి పనులు తెలుగుదేశం పార్టీ రావడానికి కారణమైంది.తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఆవిర్భవించిన తెలుగుదేశం ఎన్‌టిఆర్ అభిమానియైన కె.సి.ఆర్.ను ఆకర్షించింది. తన రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటూ అందులో చేరారు. మొదటిసారి ఎన్నికల్లో తన రాజకీయ గురువు మదన్ మోహన్ చేతిలో స్వల్ప మెజారిటీతో ఓడిపోయినా రెండేళ్ల తరువాత జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు.

1985 నుంచి కె.సి.ఆర్.కు తిరుగులేదు.ప్రతి ఎన్నికల్లోనూ గెలుపే.1985 నుండి 2004 వరకు నాలుగు సార్లు ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎన్నికల వ్యూహాలు పన్నడంలోనూ, ప్రజల అభిమానం పొందడంలోనూ కె.సి.ఆర్.ను మించిన వ్యూహకర్త లేరు. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ విజయం సాధించాల్సిందే. తెలుగు దేశంలో కీలక నాయకుడిగా ఉంటూ తెలంగాణలో ఎన్‌టిఆర్, చంద్రబాబు విజయాలకు దోహదం చేసిన చాణక్య రాజకీయుడు కె.సి.ఆర్.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సహాయమంత్రిగానూ, పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ అధ్యక్షుడుగాను, కేబినెట్ మంత్రిగానూ, ఉప సభాపతి గాను కె.సి.ఆర్. రాజకీయ ప్రస్థానం కొనసాగింది.ఇవేవీ కె.సి.ఆర్.కు సంతృప్తికరంగా లేవు. అతని దృష్టి ఎప్పుడూ తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న వివక్షపైనే. తెలంగాణ భాష, సంస్కృతి, నీళ్లు నిధుల దోపిడీ, తెలంగాణ వారిని ఉద్యోగులుగా చేర్చుకోవడంలో వివక్ష కె.సి.ఆర్. ను నిలువ నీయలేదు, నిద్రపోనీయలేదు. తపన… తపన… తపన… వలస పాలనలో కనుమరుగవుతున్న తెలంగాణ తనాన్ని రక్షించాలన్న తపన. తాను విద్యార్థి దశలో ఉన్నప్పుడు జరిగిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటాన్ని మననం చేసుకున్నారు. తెలంగాణ కోసం తపిస్తున్న ప్రజల ఆకాంక్షలను గమనించారు. తెలంగాణపై అన్ని రంగాల్లో జరుగుతున్న వివక్షను కళ్ళ ముందు నిలుపుకున్నాడు.

అప్పటి వరకు తెలంగాణ కోసం జరుగుతున్న మేధో మధనాన్ని పరిశీలించారు. మొదటి విడత తెలంగాణ పోరాటం ఎందుకు విజయవంతం కాలేదో అవగాహన చేసుకున్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరు మీద తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌లో కలుపడంలోని పరాధీనతను అర్థం చేసుకున్నారు. తెలంగాణ విముక్తి కొరకు ఏం చేయాలో నిర్ణయించుకున్నారు. రాజకీయ పార్టీ లేనిదే తెలంగాణ విముక్తి సాధ్యం కాదనుకున్నారు. ఇదో యజ్ఞం లాంటిదే, అయినా సరే యజ్ఞం చేయడానికే సిద్ధమయ్యారు కె.సి.ఆర్.

తెలుగుదేశం పార్టీలో ముఖ్య స్థానంలో ఉండి కూడా పార్టీకి, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. ఇదెంతో సాహసోపేతమైన చర్య, తెలంగాణ సాధన యజ్ఞంలో తనను తాను అర్పణ చేసుకోవడానికి కంకణం కట్టుకున్నారు. అప్పటికి కొద్దీ మంది మేధావుల, ఆలోచనాపరుల మద్దతు మాత్రమే ఉండి డబ్బు లేదు. అయినా సరే మొక్కవోని ధైర్య సాహసాలతో తెలంగాణ కోసం బరి గీశారు. 2001 ఏప్రిల్ 27 వ తేదీన కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్. కళాశాల మైదానంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన చేశారు. అదొక చరిత్రాత్మక దినం. తెలంగాణ అన్ని జిల్లాల నుండి ఆ సభకు తరలివచ్చిన లక్షలాది మంది జనంతో కళాశాల మైదానం నూతన కాంతులీనింది. ఎవరి నోట విన్నా తెలంగాణ జయ జయ ధ్వానాలే.

తెలంగాణ పేరు ఎత్తితేనే నేరంగా భావింపబడే రాజకీయ పార్టీ, నాయకుడున్నా సమయంలో రాష్ట్ర సాధన కోసం ఓ రాజకీయ పార్టీయే ఏర్పడటం అద్భుతమైన చర్యే. ఆ పార్టీ ఏర్పడటం చూసి వలస పాలకులు తేలికగా తీసుకొని నవ్వుకున్నా తెలంగాణ ప్రజలంతా సంతోషాతిరేకంతో గంతులేశారు. కె.సి.ఆర్.లో తెలంగాణ సాధకుని చూశారు. ఓ చిక్కిన శరీరధారి కొండను ఢీ కొనడం సాధ్యమా అని అనుకున్న వాళ్ళూ ఉన్నారు. కె.సి.ఆర్.పై అచంచల విశ్వాసాన్ని ప్రకటించిన వాళ్ళూ ఉన్నారు. ఆ రోజు నుంచి వెనుదిరిగి చూడలేదు కె.సి.ఆర్. ఏ రోజూ కంటి నిండుగా నిద్రపోయింది లేదు. తెలంగాణ… తెలంగాణ… తెలంగాణ.. ఇదే కలవరింత… పలువరింత. తెలంగాణ కోసం వ్యూహాలు, రాజకీయ ఎత్తుగడలు, తెలంగాణను వ్యతిరేకించే పార్టీలతోనూ పొత్తులు, అలాగనైనా ఆ నాయకులు తెలంగాణ ఏర్పాటును సమర్థించేట్టు చేసే ప్రయత్నాలు.

2004 పార్లమెంట్ ఎన్నికల్లో లోకసభ సభ్యునిగా ఎన్నికై, కేంద్ర కార్మిక, ఉపాధి శాఖామంత్రిగా పని చేసి లోకసభలో తెలంగాణ వాణిని బలంగా వినిపించారు. అధికార కాంగ్రెస్ తెలంగాణకు వ్యతిరేకంగా ఉందని తెలిసిం తరువాత లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం ఉప ఎన్నికలో తిరిగి గెలవడం. పార్టీ శాసన సభ్యుల చేత రాజీనామా చేయించి మళ్ళీ గెలిపించుకోవడం, సకల జనుల సమీకరణ, మిలియన్ మార్చ్‌లాంటి అనేక శాంతియుత నిరసనల ద్వారా 14 ఏళ్ల తెలంగాణ పోరాటాన్ని నడిపించారు కె.సి.ఆర్. తెలంగాణ సమస్యకు అంతర్జాతీయ మద్దతును సంపాదించారు. ఆమరణ దీక్ష చేసి తెలంగాణ కోసం మరణం అంచులకు వెళ్ళివచ్చారు. కె.సి.ఆర్. చచ్చుడో, తెలంగాణ తెచ్చుడో నినాదమిచ్చి కోట్లాది మందిని తెలంగాణకు అనుకూలంగా మార్చారు. రాజీలేని, మడమ తిప్పని పోరాటం చేసి తెలంగాణ సాధించారు. జాతీయ పార్టీలను ఒప్పించి, మెప్పించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన, ఏర్పాటు చేయించడం ఒక్క కె.సి.ఆర్.కే సాధ్యమైంది.

Karanajanmudu KCR
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News