Friday, September 20, 2024

రెవెన్యూలో ప్రమోషన్ల పరేషాన్

- Advertisement -
- Advertisement -

Revenue department

 

259 మంది డిఫ్యూటీ తహసీల్దార్‌లు విధుల్లో చేరితే…
సీనియర్ అసిస్టెంట్లకు రివర్షన్!
ప్రమోషన్‌లు తీసుకున్న అధికారులను పట్టుకున్న భయం
రెవెన్యూలో ఖాళీలపై అధికారుల అయోమయం

మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రూపు 2లో ఎంపికైన 259 మంది డిఫ్యూటీ తహసీల్దార్లు (డి.టి)ల శిక్షణ అనంతరం విధుల్లో చేరితే రెవెన్యూ శాఖలో ప్రమోషన్లు పొందిన సుమారు 100 నుంచి 150 మంది సీనియర్ అసిస్టెంట్‌లకు రివర్షన్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లు తీసుకున్న అధికారులకు రివర్షన్ భయం పట్టుకుంది. దీంతో రెవెన్యూ విభాగంలో ఖాళీలపై అధికారులకు కన్ఫూజన్ ఏర్పడింది. రానున్న రోజుల్లో ప్రభు త్వం తీసుకునే నిర్ణయంపై ఇచ్చిన ప్రమోషన్లు ఉంచాలా వద్దా అన్న దానిపై స్పష్టత వస్తుందని రెవెన్యూ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.

సీనియర్ అసిస్టెంట్ నుంచి డిప్యూటీ తహసీల్దార్‌లుగా త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని ఆమోదించుకోవాలని కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం, పరిపాలనకు ఆటంకం కలగకుండా రెవెన్యూలోని ఖాళీలు, క్యాడర్‌స్ట్రెంత్‌కు సంబంధించిన విషయాలపై ఇప్పటికే నివేదిక రూపంలో తెప్పించుకున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే అర్హులకు పదోన్నతులను కల్పించడంతో పాటు ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ కొత్త సమస్య నెలకొందని రెవె న్యూ వర్గాలు పేర్కొంటు న్నాయి.

గతంలో సీనియర్ అసిస్టెంట్ నుంచి డిప్యూటీ తహసీల్దార్‌లుగా ప్రమోషన్ పొందిన వారు తదనంతరం తహసీల్దార్‌లుగా, డిప్యూటీ కలెక్టర్‌గా ప్రమోషన్లు పొందారు. అందులో కొందరు రిటైర్‌కాగా మరి కొందరు ప్రస్తుతం వివిధ జిల్లాల్లో పనిచేస్తున్నారు. అయితే కొత్తగా గ్రూప్2లో ఎంపికైన డిప్యూటీ తహసీల్దార్లకు ఆరునెలల పాటు శిక్షణ ఇచ్చి, వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రమోషన్‌లు పొందిన వారికి ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉందని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి.

రెవెన్యూ ఉద్యోగుల సంఖ్య పరిగణనలోకి
చాలారోజులుగా రెవెన్యూ శాఖలో ఖాళీల సం ఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. పదవీ విరమణ చేసే వారి సంఖ్య పెరుగుతుండడం, అదేస్థాయిలో భర్తీలు లేకపోవడంతో పాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రభు త్వం భావిస్తోంది. అందులో భాగంగానే కొత్త రెవెన్యూ చట్టం ఆమోదముద్ర వేయగానే, రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న రెవెన్యూ ఉద్యోగుల సం ఖ్యను పరిగణలోకి తీసుకొని అవసరమైన ఉద్యోగులను సర్దుబాటు చేయడం, అర్హులకు పదోన్నతులు కల్పించడం తదితర వాటిపై నిర్ణ యం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో 120 డిప్యూటీ కలెక్టర్ల పోస్టులను, (తహసీల్దార్లతో భర్తీ చేయాలని) 165 తహసీల్దార్ ఖాళీలను (డిప్యూటీ తహసీల్దార్లతో భర్తీ చేయాలని) ట్రెసా నాయకులు సైతం వారం రోజుల క్రితం సిఎస్‌కు వినతిపత్రం ఇచ్చిన విషయం తెలిసిందే.

పనిఒత్తిడిని అధిగమించడానికి శిక్షణ కాలం తగ్గింపు
డిప్యూటీ తహసీల్దార్లకు గతంలో సంవత్సరం కాలంపాటు ప్రభుత్వం వివిధ విభాగాల్లో శిక్షణ ఇచ్చేది. ప్రస్తుత పరిస్థితుల్లో రెవెన్యూ విభాగంలో ఏర్పడుతున్న ఖాళీలు, పనిఒత్తిడిని అధిగమించడానికి ప్రభుత్వం శిక్షణ కాలాన్ని ఆరునెలలకు కుదించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కొత్తగా ఎంపికైన 259 మంది డిఫ్యూటీ తహసీల్దార్లకు ఆరునెలల పాటు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించి నట్టుగా తెలిసింది. ఈ ఆరునెలల కాలంలో డిప్యూటీ తహసీల్దార్లకు ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, భూ చట్టాలు, సర్వీస్‌కు సంబంధించిన అంశాలతో పాటు మోరల్ ఎథిక్స్, కోర్టు కేసులు, ఐటి వినియోగం తదితర వాటిపై శిక్షణ ఇస్తున్నారు. ఈ అంశాలన్నింటినై ఆరునెలల కాలంలో శిక్షణ ముగించి అనంతరం వెంటనే వారికి పోస్టింగ్‌లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రభుత్వ అనుమతితో రెవెన్యూ పోస్టు నియామకం
భూ సంబంధింత విషయాలతో పాటు అడ్మినిస్ట్రేటివ్ కార్యకలాపాలను నిర్వహించడానికి రెవెన్యూ పోస్టును ఆయా డిపార్ట్‌మెంట్‌లు ప్రభుత్వ అనుమతితో తాత్కాలికంగా నియమించుకుంటున్నాయి. తహసీల్దార్ నుంచి పై క్యాడర్ ఉద్యోగులు వివిధ విభాగాల్లో పనిచేయడానికి వెళుతున్నారు. మరికొందరు ఉద్యోగులు మంత్రుల దగ్గర పనిచేస్తుండడంతో రెవెన్యూ విభాగంలో ఖాళీలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన స్థానంలో కిందిస్థాయి ఉద్యోగికి పదోన్నతి కల్పించాలని రెవెన్యూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

వివిధ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే వారు ఎక్కువగా ఉండడంతో రెవెన్యూ విభాగంలో ఖాళీలు ఏర్పడుతున్నాయని రెవెన్యూ సంఘాల ఉద్యోగులు పేర్కొంటున్నారు. ప్రతి క్యాడర్‌లో అడ్‌హక్ ప్రమోషన్ కింద చాలామంది ఉద్యోగులు పదోన్నతులు పొందారు. ప్రమోషన్ పొందిన వారు రెవెన్యూ శాఖలో కాకుండా వేరే డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తుండడం ఆ తరువాత సీనియార్టీ జాబితాలో ఉన్న ఉద్యోగులకు పదోన్నతులు లభించకపోవడంతో చాలామంది ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలిసింది.

Authorities confusion over vacancies in Revenue
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News