Sunday, September 22, 2024

సఫారీతో సిరీస్ టీమిండియాకు పరీక్షే!

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/క్రీడా విభాగం: ఇటీవలే ముగిసిన న్యూజిలాండ్ సిరీస్‌లో పేలవమైన ఆటతో నిరాశ పరిచిన టీమిండియాకు సొంత గడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సమరం సవాలుగా మారింది. ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టును చిత్తుగా ఓడించిన సౌతాఫ్రికాతో భారత్‌తో జరిగే సిరీస్‌కు సమరోత్సాహంతో సిద్ధమవుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దక్షిణాఫ్రికా సమతూకంగా కనిపిస్తోంది. ఇక, ఈ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆతిథ్య భారత్‌కు పరీక్షగా తయారైంది. కివీస్ పర్యటనలో వన్డేల్లో, టెస్టుల్లో టీమింండియా చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. రెండు సిరీస్‌లలో కూడా కోహ్లి సేన క్లీన్‌స్వీప్‌కు గురైంది. మరోవైపు సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ను సౌతాఫ్రికా వైట్‌వాష్ చేసింది. ఆడిన మూడు వన్డేల్లోనూ దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇదే జోరును భారత్ సిరీస్‌లోనూ కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. దీంతో దక్షిణాఫ్రికాతో పోరు టీమిండియాకు అనుకున్నంత తేలిక కాదనే చెప్పాలి. గతంతో పోల్చితే భారత్ కాస్త బలహీనంగా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పెద్దగా ప్రభావం చూపలేక పోతోంది. అందువల్లే కివీస్ గడ్డపై జరిగిన టెస్టు, వన్డే సిరీస్‌లో ఘోర పరాజయాలను మూటగట్టుకొంది. అయితే సొంత గడ్డపై సిరీస్ జరుగుతుండడం ఒక్కటే భారత్‌కు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. కానీ, ఎటువంటి జట్టునైనా ఓడించే సత్తా ఉన్న సౌతాఫ్రికాను తక్కువ అంచనా వేయలేం. డికాక్ కెప్టెన్సీలో సౌతాఫ్రికా వరుస విజయాలు సాధిస్తోంది. భారత్ గడ్డపై కూడా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మకు విశ్రాంతి కల్పించడంతో ఈసారి భారత్ బ్యాటింగ్ కాస్త బలహీనంగా కనిపిస్తోంది. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ జట్టులో చేరినా అతను ఎలా ఆడుతాడో ఇప్పుడే చెప్పలేం. వరుస గాయాలతో ధావన్ సతమతమవుతున్నాడు. దీనికి తోడు పేలవమైన ఫామ్ అతనికి ప్రతికూలంగా తయారైంది. యువ ఆటగాడు పృథ్వీషాకు సెలెక్టర్లు మరో అవకాశం ఇచ్చారు. ఈసారైనా పృథ్వీషా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడా లేదా అనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.
కోహ్లిపైనే భారం
ఇక భారత్ ఆశలన్నీ కెప్టెన్ విరాట్ కోహ్లిపైనే నిలిచాయి. కివీస్ సిరీస్‌లో ఘోరంగా విఫలమైన కోహ్లిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో దక్షిణాఫ్రికాపై మెరుగైన ప్రదర్శన చేయాల్సిన ఒత్తిడి కోహ్లి నెలకొంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన కోహ్లి విజృంభిస్తే భారత్ కష్టాలు చాలా వరకు తీరి పోతాయి. అయితే అతను ఇందులో ఎంత వరకు సఫలమవుతాడో బరిలోకి దిగితే కానీ తెలియదు. మరోవైపు అద్భుత ఫామ్‌లో ఉన్న లోకేశ్ రాహుల్ ఈసారి కూడా మెరుపులు మెరిపించాల్సి ఉంది. అతను చెలరేగితే భారత్‌కు విజయం కష్టమేమి కాదు.
ప్రత్యేక ఆకర్షణగా హార్దిక్
మరోవైపు సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టులో చోటు సంపాదించిన యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు ఈ సిరీస్ కీలకంగా మారింది. గాయంతో టీమిండియాకు దూరంగా ఉన్న హార్దిక్ ఇటీవలే పూర్తి ఫిట్‌నెస్‌ను సాధించాడు. ఇటీవలే జరిగిన ఓ టి20 సిరీస్‌లో విధ్వంసక బ్యాటింగ్‌తో పెను ప్రకంపనలు సృష్టించాడు. హార్దిక్ రాకతో భారత్ మరింత బలోపేతంగా తయారైంది. బ్యాట్‌తో బంతితో చెలరేగే సత్తా ఉన్న హార్దిక్ విజృంభిస్తే భారత్‌ను ఓడించడం సౌతాఫ్రికాకు కష్టమేనని చెప్పాలి.
ఈసారైనా..
కాగా, యువ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్‌లకు సత్తా చాటేందుకు ఇదే మంచి తరుణంగా చెప్పాలి. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఇద్దరూ ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు. దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌లోనైనా వీరు తమ బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఉంది. రానున్న రోజుల్లో జట్టులో స్థానానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే ఇద్దరు సఫారీ జట్టుపై మెరుగ్గా రాణించాల్సిందే. లేకుంటే జట్టులో చోటు కాపాడు కోవడం కష్టమే. మరో యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు కూడా సిరీస్ కీలకంగా తయారైంది. అవకాశం లభిస్తే సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నాడు. మనీష్ పాండే, రవీంద్ర జడేజాలు కూడా తమ స్థాయికి తగ్గ ఆటను కనబరచాల్సి ఉంది. బౌలర్లు కూడా సత్తా చాటక తప్పదు. చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన భువనేశ్వర్ కుమార్ సిరీస్ సవాలుగా తయారైంది. ఇందులో రాణించడం ద్వారా రానున్న సిరీస్‌లకు మరింత ఆత్మవిశ్వాసాన్ని సంపాదించాలని భావిస్తున్నాడు. ప్రధాన అస్త్రం బుమ్రా కూడా మెరుగైన ప్రదర్శన చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. హార్దిక్ రాకతో బౌలింగ్ మరింత బలోపేతంగా తయారైంది. మ్యాచ్ విన్నర్ స్పిన్నర్లు జడేజా, చాహల్, కుల్దీప్‌లు కూడా జట్టుకు అండగా నిలువాలనే లక్షంతో కనిపిస్తున్నారు. ఇలా సమష్టిగా రాణిస్తే సౌతాఫ్రికాను ఓడించడం భారత్‌కు అసాధ్యమేమి కాదు. కాగా, మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు గురువారం తెరలేవనుంది. ధర్మశాల వేదికగా మొదటి వన్డే జరుగనుంది. రెండో వన్డే లక్నోలో, చివరి మ్యాచ్ కోల్‌కతాలో జరుగుతుంది.

IND vs SA ODI Series Starts from March 12

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News