Sunday, September 29, 2024

దీర్ఘకాలిక రోగాలుంటే అర్ధాయుష్షే!

- Advertisement -
- Advertisement -

Corona- health problems

 

తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి శాపంగా కరోనా
ధూమపానం, మద్యం సేవించేవారిపై తీవ్ర ప్రభావం
55 దాటిన వారికి జాగ్రత్తలు తప్పనిసరి
మృతుల్లో పురుషులే అధికం

మన తెలంగాణ/హైదరాబాద్ : దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కరోనా తోడవుతుందా ? ఇప్పటి వరకు దేశంలో సంభవించిన కొవిడ్ 19 మరణాలు అన్నీ అదే కోవలోకి చెందినయా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎంత వయస్సు వారు అయినప్పటికీ వారికి అప్పటికే ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉండి కరోనా వైరస్ సోకితే ప్రమాదకరంగా మారుతోంది. దేశవ్యాప్తంగా గురువారం (ఏప్రిల్ 3) రాత్రి 9 గంటల వరకు సంభవించిన 50 కరోనా మరణాల వివరాలను విశ్లేషిస్తే ఈ విషయం స్పష్టమౌతోంది.

ఇందులో 8 మంది వ్యక్తులు మరణించిన తరువాత పరీక్షలు చేస్తే కరోనా ఉన్నట్లు తేలింది. వారందరూ కొవిడ్ 19 చికిత్స పొందలేదని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇక 46 మంది కరోనా మృతుల వివరాలు పరిశీలిస్తే వీరిలో 34 మందికి దీర్ఘకాలిక, తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తేలింది. ఆ 46 మందిలో 70 సంవత్సరాలు ఆపైన ఉన్నవారు 10 మంది కాగా, 60 ఏళ్ల నుంచి 70 ఏళ్ల మధ్యలో 18 మంది ఉన్నారు. అంటే దాదాపు 65 శాతం పైన వృద్ధులు ఉన్నారు.

మిగతా 16 మంది 40 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయస్సులో ఉన్నారు. అయితే ఉత్తరప్రదేశ్‌లో 25 ఏళ్ల యువకుడు కూడా మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే అతనికి లివర్ ఫెయిల్యూర్ ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. అలాగే బిహార్‌లో కరోనాతో చనిపోయిన 38 ఏళ్ల వయస్సు వ్యక్తికి కూడా అప్పటికే కిడ్నీ సంబంధిత (రీనల్ ఫెయిల్యూర్) వ్యాధితో బాధపడుతున్నట్లు అక్కడి వైద్యాధికారులు తెలిపారు. అదే సమయంలో కేరళలో ఇద్దరు దంపతులు ఒకరు 93 ఏళ్లు, మరొకరు 88 ఏళ్లు ఉన్నప్పటికి కరోనా నుంచి పూర్తి ఆరోగ్యంగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. వారికి అంతకు ముందు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోవడంతో కొవిడ్ 19 భారీ నుంచి బయటపడ్డారని డాక్టర్లు చెబుతున్నారు. ఇక మృతి చెందిన 46 మందిలో ఆరుగురు మాత్రమే వెంటిలేటర్‌పై చికిత్స పొందగా, మిగతా వాళ్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ మృతిచెందినట్లు తెలిసింది. ఇక 46 మంది కరోనా మృతుల్లో 36 మంది పురుషులే ఉన్నారు. మిగతా 10 మంది స్త్రీలు ఉన్నారు.

కరోనాతో మహిళలకు రిస్క్ తక్కువగా ఉన్నట్లు వరల్డ్ మీటర్ వెబ్‌సైట్ కూడా తన రిపోర్ట్‌లో తెలిపింది. పొగతాగే అలవాటుండటం, మద్యపానం, కాలుష్యానికి అధికంగా ప్రభావితం కావడం తదితర కారణాలతో మగవారిలో శ్వాసకోశ, ఊపిరితిత్తుల సమస్యలు ఏర్పడటం వల్ల కరోనా మరణాల సంఖ్య అధికంగా ఉన్నట్లు తెలిపింది. చైనా నేషనల్ హెల్త్ కమిషన్ (ఎన్‌హెచ్‌సి) అంచనాల ప్రకారం, మరణించిన వారిలో 80 శాతం మంది 60 ఏళ్లు పైబడిన వారు. వారిలో 75 శాతం మందికి గుండె సంబంధిత సమస్యలు, డయాబెటీస్ వంటివి ఉన్నాయని తేలింది.

 

Corona is a curse for those with serious health problems
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News