Thursday, September 19, 2024

లాక్‌డౌన్‌లో పేదలు

- Advertisement -
- Advertisement -

 Lockdown

 

కరోనా కంటే మహాతాళ (లాక్‌డౌన్) మే ప్రమాదకరమైనదనే అభిప్రాయం రోజురోజుకీ గట్టిపడుతున్నది. వైరస్ వ్యాప్తి భయంతో విధించుకున్న వీధుల మూసివేత, ఆర్థిక దిగ్బంధం ప్రాణాంతకమైన ఔషధంగా పరిణమిస్తుందనే ఆందోళన బయల్దేరింది. కరోనా వల్ల కలుగ గల ప్రాణ నష్టం కంటే ఎక్కువగా ఆకలి చావులు దాపురించగలవనే హెచ్చరికలు వినవస్తున్నాయి. లాక్‌డౌన్ 2 ముగియ వస్తున్న సమయంలో పాలకుల నిర్ణయాలను ఇవి ప్రభావితం చేయకుండా ఉండవు. కేంద్ర ప్రభుత్వం దేశాన్ని ఇప్పటికే ఎరుపు, నారింజ, ఆకుపచ్చ మండలాలుగా విభజిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఎర్రజోన్‌లలో 130, నారింజలో 284, హరిత మండలాల్లో 319 జిల్లాలను ఉంచింది. లాక్‌డౌన్ 2 అంతమయ్యే ఈ నెల 3 నుంచి వారం రోజుల పాటు ఈ జిల్లాలు ఆయా జోన్‌లలో ఉంటాయి. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్, పుణె, బెంగళూరు, అహ్మదాబాద్ వంటి నగరాలను రెడ్ జోన్‌లో ఉంచారు. ప్రతి వారం రోజులకు ఒకసారి సమీక్షించి వీటి జోన్లలో అవసరమైన సవరణలు చేస్తారు. క్రమక్రమంగా దేశమంతటా మామూలు పరిస్థితికి తెర లేపే ప్రయత్నం ఈ విధంగా మొదలైందనుకోవాలి.

లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ పోయినా వైరస్ పూర్తిగా అంతమైపోతుందనే హామీ బొత్తిగా లేదు గనుక ఎప్పటి మాదిరిగానే పనిపాట్లను పునరుద్ధరించి కరోనాతో కలిసి బతకడమే ఉత్తమమనే స్పృహ పుంజుకుంటున్నది. దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి గురువారం నాడు ఇందుకు సంబంధించి చేసిన ప్రకటన ప్రత్యేకించి గమనించదగినది. లాక్‌డౌన్‌ను ఇంకా కొనసాగిస్తే కరోనా మరణాలకు మించిన స్థాయిలో ఆకలి చావులను భారత దేశం చూడవలసి వస్తుందని ఆయన అన్నారు. కరోనాను మనతో పాటు ఉండే ఒక సరికొత్త అనివార్యమైన సాధారణ అంశంగా అంగీకరించాలని శరీర దారుఢ్యం గలవారిని పనుల్లోకి రప్పించి బలహీనులను కాపాడుకుంటూ పోవాలని ఆయన సూచించారు. లాక్‌డౌన్‌తో కరోనాను శాశ్వతంగా మట్టుపెట్టలేమనే సత్యాన్ని అంగీకరించి ఎవరి పనుల్లో వారు మునిగిపోడం ఉత్తమమని అభిప్రాయపడ్డారు. లేని పక్షంలో ఏపూటకాపూట శ్రమించి కష్టార్జితంతో బతికేవారు ఆకలి మరణాలకు బలి అయిపోతారని ఆయన చెప్పిన దాంట్లో మానవతా దృష్టి తొణికిసలాడుతున్నది.

లాక్‌డౌన్ సమయంలో ఈ వర్గాలను ఆదుకోడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు దాతలు ఎంతో చేస్తున్నారు. కాని వారి శక్తిసామర్థాలకు కూడా హద్దు ఉంటుంది. ఆర్థిక వ్యవస్థకు వేసిన తాళాన్ని తీసి గృహ నిర్మాణం, వస్త్తూత్పత్తి మున్నగు అనేక రంగాలను తగు జాగ్రత్తలతో తెరిస్తే పేదలు తమ శ్రమతో పొట్ట పోషించుకోగలుగుతారు. మండు వేసవిలో కొనసాగుతున్న ఈ లాక్‌డౌన్‌లో తలదాచుకోడానికి తగిన వసతి కూడా లేక ఇరుకిరుకు గదుల్లో, రేకుల షెడ్లలో లెక్కకు మించినంత మంది కిక్కిరిసి బతుకుతున్న దృశ్యాలను చూస్తూనే ఉన్నాం. అటువంటి స్థితి వైరస్ వ్యాప్తికే దోహదం చేస్తుందిగాని దానిని అరికట్టజాలదు. దేశ జనాభాలో సగానికిపైగా పేదలే ఉన్నారు. వీరంతా కనీస వసతులు కరవైన మురికివాడల్లాంటి ఆవాసాల్లోనే ఉంటారు. గ్రామీణ ప్రాంతా ల్లో గాలి, వెలుతురు లభించినా కూలీనాలీ కరువైనందువల్ల ఆకలితో అలమటించక తప్పని దుస్థితి. ఇప్పటికే స్వస్థలాలకు బయల్దేరిన కోట్లాది వలస కార్మికులు లాక్‌డౌన్‌ను ఇంకా పొడిగిస్తే చేతిలో పైసా లేక పనీ కరువై మరింత దుర్భర స్థితిని ఎదుర్కొంటారు.

ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి హెచ్చరించిన సమయంలోనే రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సలహాలు కూడా వెలువడ్డాయి. ఆయన ఆర్థికవేత్త కావడం వల్ల ఇటు లాక్‌డౌన్ రద్దు విషయంలోనూ అటు పేదలను ఆదుకునే పరంగానూ ఆచరణీయమైన సూచనలు చేశారు. భారత దేశం, కరోనా పూర్తిగా తొలగిపోయే వరకు లాక్‌డౌన్‌లో కొనసాగడం మంచిది కాదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అయితే ఆర్థిక వ్యవస్థను తెరిచేటప్పుడు తెలివిగా వ్యవహరించాలని క్రమక్రమంగా అమలు పర్చాలని అన్నారు. అలాగే వలస కార్మికుల వంటి నిస్సహాయ స్థితిలోని వర్గాలను ఆదుకోడానికి రూ. 65 వేల కోట్లు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఇండియా స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) రూ. 2 లక్షల కోట్లని అందులో 65 వేల కోట్లు స్వల్ప భాగమేనని అన్నారు.

పేదలను కాపాడడానికి ఆపాటి సాయం చేసి తీరాలన్నారు. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తిగాని, రఘురామ్ రాజన్‌గాని పేదల గురించి ఇంతగా చెప్పారంటే వారి విషయంలో కేంద్ర పాలకులు ఇంత వరకు తగినంతగా స్పందించలేదని పరోక్షంగా స్పష్టం చేయడమే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత నెలలో ప్రకటించిన లక్షా 70 వేల కోట్ల ప్యాకేజీ చెప్పుకోదగినది కాదు. ఆర్‌బిఐ ఇచ్చిన రాయితీలు వాణిజ్య, పారిశ్రామిక వర్గాలకు పరిమితమైనవే. లాక్‌డౌన్ విషయంలో పాశ్చాత్య దేశాలతో ఇండియా పోల్చుకోకూడదని కూడా రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. అందుచేత నారాయణమూర్తి, రాజన్ సరైన సమయంలో సమ్యక్ దృష్టితో చేసిన సూచనలను పాటించవలసిన బాధ్యత కేంద్ర పాలకులపై ఉన్నది.

 

Poor People on Lockdown
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News