Sunday, September 22, 2024

అగ్రి ఆవిష్కరణలు

- Advertisement -
- Advertisement -

గ్రామీణ వ్యవసాయ ఇన్నోవేషన్లకు ప్రాధాన్యత
స్కూల్ విద్యార్థులను ఆవిష్కరణల్లో ప్రోత్సహించాలి
ద్వితీయ శ్రేణి నగరాలకు టిహబ్ సేవలు : మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్న నేపథ్యంలో వ్యవసాయరంగంలోనూ నూతన ఆవిష్కరణలు మరింతగా పెరగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖమంత్రి, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అధికారులను ఆదేశించారు. వ్యవసాయరంగానికి మద్దతుగా ఇన్నోవేషన్ ఉండాలని ఆయన సూచించారు. మంగళవారం కెటిఆర్ తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, టి హబ్ పైన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో టిహబ్ సిఈఒ, ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్‌రంజన్ పా ల్గొన్నారు. టిహబ్ సిఒ రవి నారాయణ్ టి హబ్, స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఇప్పటివరకు ని ర్వహించిన కార్యక్రమాలను మంత్రి కెటిఆర్‌కు వివరించారు. ప్రస్తుతం కొనసాగుతున్న కార్యక్రమాలతోపాటు భవిష్యత్‌లో చేపట్టబోయే విభిన్న కార్యక్రమాలకు సంబంధించిన అంశాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కెటిఆర్‌కు వివరించారు. ఈసందర్భంగా మం త్రి కెటిఆర్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా భారతదేశ స్టార్ట్ ఆఫ్ ఎకో సిస్టమ్‌లో తనదైన ముద్ర వేయగలిగిందని చెప్పారు.

ప్రస్తుతం టి హబ్ ద్వారా అద్భుతమైన సేవలను ఔత్సాహిక యువకులకు అందిస్తున్నామన్నారు. అయితే ఇలాంటి సేవలనే ద్వితీయశ్రేణి నగరాలకు అందించాల్సిన అవశ్యకత ఉందని అధికారులకు కెటిఆర్ చెప్పారు. ఈ దిశగా కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజమాబాద్ వంటి నగరాల్లో టి హబ్‌కు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభించాల్సిన అవసరం ఉందని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలతో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) వంటి ఆర్గనైజేషన్‌లతో తెలంగాణలో మంచి ఇన్నోవేషన్ ఈకో సిస్టం ఏర్పడిందని ఈ సందర్భంగా కెటిఆర్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో గత కొద్ది కాలంగా గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు, విద్యార్థుల ఆలోచనలకు ప్రోత్సాహం ఇచ్చేవిధంగా కార్యక్రమాలు కొనసాగాయని చెప్పారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో ఇలాంటి అనేక కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు, వారి ఆలోచనలకు అండగా నిలిచే విధంగా కార్యక్రమాలు తీసుకోవాలని సూచించారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు ఆవిష్కరణలకు సంబంధించిన సంస్కృతిని అలవాటు చేయాల్సిన అవసరం ఉందని కెటిఆర్ చెప్పారు.

ఈ దశలో టిహబ్ విద్యాశాఖతో కలిసి పనిచేయాలని సూచించారు. టిహబ్ ద్వారా టెక్ ఇన్నోవేషన్‌తో పాటు రూరల్, సోషల్ ఇన్నోవేషన్‌పైన దృష్టి సారించాలని కెటిఆర్ అధికారులకు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ఇన్నోవేషన్ సెల్, టిహబ్, టివర్క్, విహబ్ వంటి సంస్థల ద్వారా నూతన ఆవిష్కరణలకు సహకారం అందించాలని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్న నేపథ్యంలో వ్యవసాయ రంగంలోనూ ఇన్నోవేషన్ మరింత పెరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. వ్యవసాయరంగానికి నూతన ఆవిష్కరణలు తోడైతే మరింత అద్భతమైన ప్రగతిని ఆవిష్కరించవచ్చని కెటిఆర్ చెప్పారు.

KTR Review on T-Hub and State Innovation Cell

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News