Sunday, September 22, 2024

కేశవానంద భారతి

- Advertisement -
- Advertisement -

kesavananda bharati passed away ఆదివారం తెల్లవారు జామున మరణించిన కేరళలోని ఎడ్నీర్ మఠాధిపతి కేశవానంద భారతి దేశంలో రాజ్యాంగ న్యాయంతో ముడిపడి చిరస్థాయిని పొందుతారు. 1969, 1971లో కేరళ ప్రభుత్వం రెండు భూసంస్కరణల చట్టాలను తెచ్చి ఆ మఠం భూమిని స్వాధీనం చేసుకున్నప్పుడు దానిని సుప్రీంకోర్టులో సవాలు చేసిన కేశవానంద పేరిట ఆ కేసు తీర్పు చరిత్రకెక్కింది. ఆయన ఆ కేసు గెలవలేకపోయారు. కాని రాజ్యాంగాన్ని సవరించే విషయంలో పార్లమెంటుకు తిరుగులేని అధికారాలు లేవని, దాని మౌలిక స్వరూపాన్ని హరించే హక్కు ఎంత మాత్రం లేదని 13 మంది జడ్జీల అత్యంత విస్తృత ధర్మాసనం ఇచ్చిన మెజారిటీ తీర్పు విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. న్యాయ వ్యవస్థ చేతిలో అమరిన శక్తివంతమైన అస్త్రంగా స్థిరపడింది. ఆ తీర్పు వెలువడడానికి కారణభూతుడుగా కేశవానందకు విశేష కీర్తి లభించింది.

రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడిన వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. పేదలు అత్యధికంగా ఉన్న దేశం మనది, సామాజికంగా ఎంతో వైవిధ్యభరితమైనది. ఇటువంటి చోట సోషలిజం, ఫెడరలిజం, ఎన్నికల స్వచ్ఛత వంటి కొన్ని గొప్ప అభ్యుదయ ఆదర్శాల పాటింపు అవసరం ఎంతైనా ఉంది. అవి రాజ్యాంగ 3వ భాగంలోని ప్రాథమిక హక్కులతో ముడిపడి ఉన్నాయి. స్వేచ్ఛ, సమానత్వం, దోపిడీ నుంచి రక్షణ, మత స్వేచ్ఛ, సాంస్కృతిక, విద్యాపరమైన స్వాతంత్య్రం, రాజ్యాంగ రక్షణను కోరే అవకాశం అనే వాటిని హామీ ఇస్తున్న ప్రాథమిక హక్కులు జాతి నిర్మాణానికి, భవ్య మనుగడకు ప్రాణప్రదమైనవిగా పరిగణన పొందుతున్నాయి(ఆదిలో ప్రాథమిక హక్కుగా ఉన్న ఆస్తి హక్కును దేశ సామాజికావసరాల దృష్టా ఈ జాబితా నుంచి 44 రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు). వీటిని కాపాడే స్థూల దృష్టితోనే కేశవానంద కేసు తీర్పులో రాజ్యాంగ మౌలిక స్వరూప సూత్రీకరణను చేశారు. అయితే మౌలిక స్వరూపం ఇది అని స్పష్టంగా ధర్మాసనం నిర్వచించలేదు. ఆయా వివాదాలలో ఇమిడి ఉండే అంశాలను బట్టి కోర్టు మౌలిక స్వరూపాన్ని నిర్ధారించుకోవచ్చని సూచించింది.

పార్లమెంటులో ఎదురులేని సంఖ్యా బలం కలిగిన పాలకులు ఆర్టికల్ 368 ద్వారా సంక్రమించిన సవరణ అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా మౌలిక స్వరూపం అనే రక్షా కవచాన్ని రాజ్యాంగానికి ఈ తీర్పు తొడిగింది. కేరళ రాష్ట్రానికి చెందిన రెండు భూసంస్కరణల చట్టాలను కోర్టుల సమీక్షకు అతీతంగా చేసే 9వ షెడ్యూల్‌లో చేరుస్తూ తీసుకు వచ్చిన 29వ రాజ్యాంగ సవరణ చెల్లుతుందని చెప్పిన ఈ తీర్పు అభ్యుదయ లక్షణం సుస్పష్టమే. పార్లమెంటులోని సంఖ్యాధిక్యతతో ప్రభుత్వాలు రాజ్యాంగం కీళ్లు, కాళ్లు విరిచి పోగులు పెట్టకుండా అడ్డుకునే అధికారాన్ని సుప్రీంకోర్టుకు కట్టబెట్టడంలో గల తీర్పు విజ్ఞత ప్రశంసనీయమైనది. అవసర సందర్భాల్లో విశాల జన హితం కోసం సమయస్ఫూర్తితో దానిని వినియోగించవలసిన బాధ్యత అత్యున్నత న్యాయస్థానం సారథులపై ఉంది. మౌలిక స్వరూప సూత్రీకరణను చేసిన ఈ తీర్పు కేరళ చట్టాలను ధ్రువపరచడం, సమర్థించడం ద్వారా భూఆస్తి కేంద్రీకరణను వ్యతిరేకించిన విషయాన్ని గమనించాలి. బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దుకు వీలుగా తెచ్చిన రాజ్యాంగ సవరణలను కూడా తీర్పు ధ్రువీకరించింది.

అయితే కేశవానంద కేసును విచారించిన 13 మంది న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు ఇచ్చేటప్పుడు నిట్టనిలువునా చీలిపోయింది. ఒకే ఒక్క న్యాయమూర్తి హెచ్‌ఆర్ ఖన్నా మౌలిక స్వరూప వాదానికి మద్దతుదార్లలో చేరడంతో దానికి ఆధిక్యత లభించి ఆ మేరకు తీర్పు వెలువడింది. ఇది అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి అసంతృప్తి కలిగించడం, ఆ తర్వాత ఈ మెజారిటీ తీర్పు ఇచ్చిన జడ్జీలలో ముగ్గురి సీనియారిటీని కాదని, వారి కంటే జూనియర్‌ను ప్రభుత్వం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేయడం, అనంతరం కొద్ది కాలానికి ఎమెర్జెన్సీ విధింపు పరిణామాలు తెలిసినవే. న్యాయ వ్యవస్థ గట్టి వెన్నెముకను ప్రదర్శించి ప్రజాస్వామిక విలువల వైపు నిలబడితే ఎంత మంచి జరుగుతుందో ఈ తీర్పు చాటింది. అయితే ప్రస్తుతం దేశంలో గల పరిస్థితులను పరిశీలిస్తే అలా జరగడం లేదనే ఆవేదన కలుగుతుంది.

జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని ప్రసాదించిన ఆర్టికల్ 370 రద్దు, జాతీయ పౌరసత్వ చట్టం వంటి ప్రధాని మోడీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను రాజ్యాంగ మౌలిక స్వరూపం గీటురాయి మీద పెట్టి వీలైనంత త్వరగా తీర్పులు చెప్పవలసిన బాధ్యత గల సుప్రీంకోర్టు ఆ కేసులను నిరవధికంగా వాయిదా వేస్తూపోడంలోని ఔచిత్యం బోనెక్కుతున్నది. ఎంతటి గొప్ప ఏర్పాట్లు రాజ్యాంగంలో ఉన్నా అధికారం చెలాయించేవారికి వాటి పట్ల గౌరవం లేకపోతే వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండబోదని అప్పుడు, ఇప్పుడు కూడా ఒకే విధంగా రుజువు అవుతుండడమే విషాదం.

kesavananda bharati passed away

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News