Friday, September 20, 2024

సంపాదకీయం: నిరంకుశ కేసులు

- Advertisement -
- Advertisement -

More cases in Democracy in India

పాములు బుసకొట్టినా, కాటేసినా అర్థం చేసుకోవచ్చు, ఆత్మరక్షణ కోసం చేస్తాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో జనహితం కోసం నెలకొన్న పోలీసు, దర్యాప్తు వ్యవస్థలు పాలకులను ప్రశ్నించే వారి మీద విచక్షణ, వివేకం చూపకుండా కేసులు పెట్టడాన్ని, సోదాలు వంటివి చేయడాన్ని ఏమనాలి? ఈ వ్యవస్థల కంటే పాములే నయమని అనిపించదూ! జాతీయ స్థాయిలో ప్రజల తరపున పని చేస్తున్న ప్రముఖులుగా

పేరొందిన సిపిఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆర్థిక శాస్త్రవేత్త జయతీ ఘోష్, ఢిల్లీ వర్శిటీ ప్రొఫెసర్ అపూర్వానంద్, స్వరాజ్ అభియాన్ నాయకుడు యోగేంద్ర యాదవ్, డాక్యుమెంటరీ చలన చిత్ర నిర్మాత రాహుల్ రాయ్‌లపై ఢిల్లీ పోలీసులు దేశ రాజధానిలో హింసను రెచ్చగొట్టారంటూ కేసు పెట్టినట్టు వచ్చిన సమాచారం దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని, ప్రశ్నించే హక్కు బలపడాలని కోరుకునే వారందరినీ ఆందోళనకు గురి చేస్తుంది. వీరు తీవ్రవాదులో, ఉగ్రవాద శక్తులో కారు, సాయుధ తిరుగుబాటుతోనో, కుట్రతోనో ప్రభుత్వాన్ని కూలగొట్టాలనే ఉద్దేశం ఉన్నవారు అసలే కాదు వివిధ వేదికల ద్వారా ప్రజాస్వామిక చర్చను పెంపొందించి, ప్రజల్లో అవగాహన కలిగించి వారిని చైతన్యపరుస్తున్న నాయకులు, మేధావులు మాత్రమే.

ఏ సమాజంలోనైనా ప్రజలకు మంచి జరగాలంటే ప్రభుత్వాల నిర్ణయాలను విశాల ప్రజాహితమనే గీటురాయి మీద పెట్టి చూడడం, పాలకులను నిలదీయడం విధిగా జరగాలి. ఆ పని చేసే వారు సమాజ క్షేమాన్ని కోరేవారే గాని దానికి హాని చేసేవారు కారు, అటువంటి వారి మీద కేసులు పెట్టి అణచివేయచూడడమంటే ప్రజల గొంతులను నొక్కేసి నిరంకుశ పాలనను ఎదురులేకుండా నిర్విఘ్నంగా జరిపించుకోదలచడమే. ఈ రకమైన దమనకాండ గత కొంత కాలంగా దేశంలో పెరిగి పేట్రేగిపోతున్నదనే అభిప్రాయం అంతటా చోటు చేసుకున్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రెండు రోజుల్లో ప్రారంభం కానున్నాయనగా ఈ ఐదుగురు నాయక, మేధావుల మీద ఈ కేసు పెట్టడంలోని ఉద్దేశమేమిటో దీని వెనుక ఎవరి హస్తం ఉండి ఉంటుందో ప్రజలు ఊహించగలరు. ఢిల్లీ ప్రత్యేక రాష్ట్రమైనప్పటికీ అక్కడి పోలీసు యంత్రాంగం మాత్రం నేరుగా కేంద్ర హోం శాఖ ఆధీనంలో ఉంటుంది. గత ఫిబ్రవరిలో ఢిల్లీలో జాతీయ పౌరసత్వ చట్టం (సిఎఎ), జాతీయ పౌర చిట్టా (ఎన్‌ఆర్‌సి) లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన సందర్భంగా ఈ ఐదుగురు తమ ప్రసంగాల ద్వారా నిరసనకారులను రెచ్చగొట్టారంటూ పోలీసులు ఢిల్లీ అల్లర్ల కేసుకు అదనపు ఛార్జి షీట్‌ను జతపరుస్తూ కేసు పెట్టారని శనివారం నాడు వెలువడిన తొలి వార్తలు వెల్లడించాయి.

ఈ రెండు చట్టాలు ముస్లింలకు వ్యతిరేకమైనవని వీరు పేర్కొన్నారని, వాటిపై ఎంతటి తీవ్రమైన ప్రతిఘటనకైనా వెనుకాడొద్దని నిరసనకారులకు ఉద్బోధించారన్నది అభియోగం. అందుచేత ఈ కేసులో వీరిని సహ కుట్రదారులుగా చూపించారని ఆ వార్తలు తెలియజేశాయి. ఈశాన్య ఢిల్లీలో ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు సంభవించిన అల్లర్లలో 53 మంది చనిపోయారు, వందలాది మంది గాయపడ్డారు. జఫ్రాబాద్‌లోని సిఎఎ వ్యతిరేక ఆందోళనకారులను బలవంతంగా అక్కడి నుంచి తరిమేయాలంటూ బిజెపి నాయకుడు కపిల్ మిశ్రా పిలుపు ఇవ్వడంతో ఈ అల్లర్లు మొదలయ్యాయని, ఈశాన్య ఢిల్లీ ప్రాంతమంతటా ఒక వర్గాన్ని లక్షంగా చేసుకొని మూకలు రెచ్చిపోయారని సుప్రీంకోర్టు న్యాయవాది ఎంఆర్ షంషద్ సారథ్యంలోని నిజ నిర్ధారణ కమిటీ నిగ్గు తేల్చింది. విచిత్రంగా కపిల్ మిశ్రాపై పోలీసులు ఎటువంటి చర్యా తీసుకోలేదు. శనివారం నాడు ఈ ఐదుగురిపై కేసు వార్త వెలువడి వివిధ రాజకీయ పక్షాలు, మేధావులు నిరసన ప్రకటనలు చేయడంతో ఢిల్లీ పోలీసులు ఆదివారం నాడు వివరణ ఇచ్చారు. అల్లర్ల కేసు అదనపు ఛార్జి షీట్‌లో వీరిని సహ కుట్రదారులుగా పేర్కొనలేదని, నిర్బంధంలోని జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులు ముగ్గురిచ్చిన వాంగ్మూలాన్ని జత చేశామని అందులో వీరి పేర్లున్నాయని తెలియజేశారు.

నిందితుల వాంగ్మూలం ఆధారంగా కేసులు పెట్టడం జరగదని వివరించారు. అదేమైనప్పటికీ రాజకీయ ప్రత్యర్థుల మీద కేసులు, దాడులు, సోదాలు వంటి కక్ష సాధింపు ధోరణికి అలవాటుపడిపోయారనిపించుకుంటున్న పాలకుల ఏలుబడిలో ఇటువంటివి ఆశ్చర్యపోవలసినవి కావు. ఇటీవలే డాక్టర్ కఫీల్ ఖాన్‌పై, విద్యార్థులను రెచ్చగొడుతూ మాట్లాడారనే అభియోగం మీద జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అలహాబాద్ హైకోర్టు చేత మొట్టికాయలు తిన్న ఉదంతం తెలిసిందే. గతంలో కూడా కన్హయ్యకుమార్ వంటి వారి మీద తీవ్రమైన కేసులు పెట్టిన సందర్భాలున్నాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో భాగస్వాములు కావడానికి, పాలకుల వైఖరిని , ప్రభుత్వాల నిర్ణయాలను, చట్టాలను తప్పుపడుతూ ఎలుగెత్తి మాట్లాడడానికి మధ్య గల విభజన రేఖను చెరిపి వేయడం ప్రశ్నించేవారిని భయోత్పాతానికి గురి చేయడమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News