Saturday, September 21, 2024

దుబ్బాక తరలిస్తున్నకరెన్సీ పట్టివేత

- Advertisement -
- Advertisement -
Arrest of BJP leaders moving Rs 40 lakh

 

చెప్పేవి శ్రీరంగనీతులు..
శామీర్‌పేటలో బయటపడిన బడాయి బాబుల బండారం
శామీర్‌పేట దగ్గర దొరికిన రూ.40 లక్షల నగదు నలుగురు నిందితుల
అరెస్టు, కారు స్వాధీనం పటాన్‌చెరు నుంచి దుబ్బాకకు వెళుతుండగా
పట్టుబడిన నగదు ఆ డబ్బు బిజెపి అభ్యర్థి రఘనందన్‌రావుదిగా అనుమానం

దుబ్బాక ఎన్నికలో గెలవడం కోసం నోట్ల ప్రవాహానికి గేట్లు తెరిచారు. అడ్డదారిలో గెలవడం కోసం రూ. 40 లక్షల నగదును తరలిస్తూ శామీర్‌పేట దగ్గర పోలీసులకు దొరికిపోయారు. ఈ 40 లక్షల డబ్బు పటాన్‌చెరు నుంచి దుబ్బాకకు తరలిస్తున్నారని అది అక్కడి బిజెపి అభ్యర్థి రఘునందన్ రావుదిగా అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మనతెలంగాణ/హైదరాబాద్ : నగర శివారులోని శామీర్‌పేట సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు టోల్‌టాక్స్ సమీపంలో రెండు కార్లలో రూ. 40లక్షలు తరలిస్తున్న బిజెపి నాయకులను ఎస్‌ఓటి పోలీసులు సోమవారం సాయంత్రం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈక్రమంలో దుబ్చాక ఉపపోరులో ఓట్లను కొనుగోలు చేసేందుకు బిజెపి నాయకులు శ్రీనివాస్ బాబు, సురేష్ బాబు, ఆంజనేయులతో పాటు మొహమ్మద్ మజీద్‌లు తరలిస్తున్నట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. పఠాన్‌చెరువు నుండి దుబ్బాక కు తరలిస్తుండగా శామీర్ పేట వద్ద ఎస్‌ఒటి పోలీసులు నగదును స్వాధీనం చేసుకుని బిజెపి నాయకులు శ్రీనివాస్ బాబు, సురేష్ బాబు, ఆంజనేయులను పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. రెండు కార్లలో నగదు తరలిస్తూ పట్టుబడ్డారని సమాచారం అందుకున్న ఎసిపి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని విచారణ చేపట్టారు. ముఖ్యంగా రూ. 40 లక్షల నగదును ఎక్కడి నుంచి తీసుకువచ్చారు? ఎక్కడికి తీసుకువెళ్తారనే విషయమై విచారించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. దుబ్బాక ఉప ఎన్నిక కోసమే ఈ డబ్బును తరలిస్తున్నారని, బిజెపి పార్టీకి చెందిన అభ్యర్థికి చెందిన డబ్బు అందించే క్రమంలో నిందితులు పట్టుబడ్డారని పోలీసుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో పోలీసుల తనికీలలో పట్టుబడిన బిజెపి క్యాడర్‌ను పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించారు.

సిద్ధిపేటకు నోట్ల కట్టలుః దుబ్బాక ఉపపోరులో బరిలో నిలిచిన బిజెపి అభ్యర్థి కోసం సిద్ధిపేటకు నగదు తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించినట్లు సమాచారం. కాగా నగదు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఇచ్చారు, ఎవరి ఆదేశాల మేరకు రూ. 40 లక్షలు తరలిస్తున్నారన్న పోలీసుల ప్రశ్నలకు నిందితులు పెదవి విప్పడం లేదు. అయితే తాము బిజెపి పార్టీకి చెందిన వారమేనని, కారులో ఉన్న నగదు సిద్థిపేటకు తరలించాలని చెప్పారని ఓ నిందితుడు పోలీసులకు వివరించాడు. అయితే తాము సిద్ధిపేటకు చేరుకున్న తరువాత తమకు బిజెపి నేతలు ఫోన్ చేసి ఎవరికి ఇవ్వమంటే వారికి అప్పగించాలని ఆదేశాలున్నట్లు నిందితులు విచారణలో వెల్లడించారు.

ఫోన్ నంబర్ల ఆధారంగా విచారణ ః శామీర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డు టోల్‌టాక్స్ సమీపంలో రెండు కార్లలో రూ. 40లక్షలు తరలిస్తున్న బిజెపి నాయకుల సెల్‌ఫోన్‌లోని నంబర్ల ఆధారంగా విచారణ సాగిస్తున్నట్లు పోలీసు అధికారులు వివరిస్తున్నారు. ముఖ్యంగా ఈ కేసులో నిందితుల ఫోన్ నంబర్లపై పూర్తిస్థాయిలో విచారణ సాగిస్తున్నామన్నారు. కాగా బిజెపి నాయకులు శ్రీనివాస్ బాబు, సురేష్ బాబు, ఆంజనేయుల సెల్ ఫోన్లలో బిజెపికి చెందిన కీలక నేతల పేర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అదేవిధంగా నిందితుల నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు సోమవారం ఉదయం నుంచి వారి ఫోన్ లొకేషన్లపై విచారణ చేపడుతున్నారు.

నిన్న రాసలీలలు..నేడు కరెన్సీ తరలింపు ః

కరీంనగర్‌లో బిజెపి జిల్లా అధ్యక్షుడు రాసలీలల ఘటన మరువక ముందే కమలనాథులు దుబ్బాక ఉప పోరులో ఓట్లను కొనుగోలు చేసేందుకు కరెన్సీ కట్టల తరలిస్తూ పట్టుబడటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. స్వంత పార్టీలోని మహిళా కార్యకర్తతో రాసలీలలు సాగించడంతో పాటు ఆమెతోనే చేసుకున్న డబ్బుల సెటిల్‌మెంట్లు, సోషల్‌మీడియాలో హల్‌చల్ చేసిన విషయం విదితమే. తాజాగా అర్థబలంతో ప్రజాబలం పొందాలన్న కుట్రకు తెరతీసిన బిజెపి గుట్టుగా నోట్ల కట్టలు తరలిస్తూ పట్టుబడటం గమనార్హం. రాసలీలల కారణంగా కరీంనగర్‌కు చెందిన నేతలను పార్టీ నుంచి వెలివేశారని, మరి కరెన్సీ తరలిస్తూ పట్టుబడిన నేతను ఏంచేస్తారన్న కోణంలో బిజెపి వర్గాల్లో చర్చ మొదలైంది.

తెరపైకి నామినేటెడ్ పోస్టుల దందా ః

బిజెపి పార్టీలో నామినేటెడ్ పోస్టుల దందా హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇటీవల కాలంలో బిజెపిలో నామినేటెడ్ పోస్టుల దందా బెడిసికొట్టడంతో చివరకు అవి పోలీసుస్టేషన్లకు చేరుతున్న విషయం విదితమే. నామినేటెడ్ పోస్టుల దందాలో స్వయంగా పార్టీ జాతీయ నాయకుడిపైనే ఫిర్యాదులందటం విచారకరం. కేంద్రంలో నామినేటెడ్ పోస్టులు ఇప్పిస్తామని, పలువురు మహిళా నేతల నుంచి లక్షలు వసూలు చేస్తున్న ప్రబుద్ధులపై అటు పోలీసు వర్గాలు, ఇటు బిజెపి అధిష్టానం ఆరా తీస్తున్నాయి. బిజెపిలో జాతీయ స్థాయికి ఎదిగిన ఓ తెలుగు నేతపై లెక్కలేనన్న ఆరోపణలు రావడంతో అధిష్టానం సీరియస్ కావడంతో పాటు పార్టీ నేతలతో రహస్యంగా విచారణ సాగిస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News