Friday, September 20, 2024

జమిలి ఎన్నికలు దేశానికి ఎంతో అవసరం

- Advertisement -
- Advertisement -

PM Modi Says India needs One Nation One Election

కేవడియా: దేశంలో జమిలి ఎన్నికలు (ఒకే దేశం, ఒకే ఎన్నికలు) నిర్వహణపై చర్చ జరుగుతున్న సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీ గురువారం దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది చర్చించే విషయం మాత్రమే కాదని, భారత్‌కు ఎంతో అవసరమని అన్నారు. కొన్ని నెలల వ్యవధిలో పదేపదే ఎన్నికలు నిర్వహించడం అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందని ప్రధాని పునరుద్ఘాటించారు. అందుకే ఎన్నికలను ఒకే సారి నిర్వహించడంపై దృషి ్టసారించాలని సూచించారు. రాజ్యాంగ వార్షికోత్సవం సందర్భంగా గుజరాత్‌లోని కేవడియాలో రెండు రోజులపాటు జరుగుతున్న అఖిల భారత ప్రిసైండింగ్ అధికారుల మహాసభ ముగింపు సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ‘ వేర్వేరు ప్రాంతాల్లో కొన్ని నెలలకోసారి ఎన్నికలు జరుగుతుండడం అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తాయనేది అందరికీ తెలిసిందే. ఈ సమస్యపై లోతైన అధ్యయనంతో పాటు చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇటువంటి చర్చలను నిర్వహించడంలో ప్రిసైడింగ్ అధికారులు ముందుండాలి’ అని ప్రధాని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ప్రస్తుతం వివిధ ఎన్నికలకు వేర్వేరు ఓటర్ల జాబితాలు ఉంటున్నాయి. వీటికోసం ధనం, సమయం ఎందుకు వృథా చేసుకోవాలి. ప్రస్తుత కాలంలో వేర్వేరు ఓటర్ల జాబితాలు అవసరం లేదని అభిప్రాయపడ్డారు. అందుకే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు మొదలుకొని పంచాయతీ ఎన్నికల వరకు ఒకే ఓటరు జాబితా ఉండాలని ప్రధాని ప్రిసైడింగ్ అధికారులకు సూచించారు. సామాన్యులకు అర్థమయ్యే విధంగా చట్టాలు ఉండాలని, అవసరం లేని చట్టాల తొలగింపును కొనసాగించే పద్ధతిని తీసుకు రావాలని మోడీ సూచించారు. రాజకీయ లక్షాలు మన ప్రాధాన్యతలో ఉండకూడదని, కేవలం దేశాభివృద్ధి, ప్రజాశ్రేయస్సే మన ప్రాధాన్యతగా ఉండాలని ఆయన సూచించారు. ఇందుకోసం చట్టసభలు, (లెజిస్లేచర్) పాలనా యంత్రాంగం (ఎగ్జిక్యూటివ్), న్యాయవ్యవస ్థ (జ్యుడీషియరీ) మరింత మెరుగైన సమన్వయంతో కలిసి పని చేయాలని ఆయన సూచించారు. కాగా దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న సందర్భంలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించడాన్ని ప్రధాని కొనియాడారు.

26/11 గాయాలను దేశం ఎన్నటికీ మరిచిపోదు

కాగా ముంబయి పేలుళ్లు జరిగి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు ప్రధాని నివాళులర్పించారు. ముంబయి పేలుళ్ల గాయాలను యావత్ భారత దేశం ఎన్నటికీ మరిచిపోదని ఆయన అన్నారు. సరికొత్త పంథాలో ఉగ్రవాదంపై భారత్ పోరాటం సాగిస్తుందన్నారు. ‘ దేశంలోనే అతిపెద్ద ఉగ్రవాద ఘటన జరిగిన రోజు ఇది. 2008లో పాకిస్థాన్‌నుంచి వచ్చిన ఉగ్రవాదులు ముంబయిపై దాడి చేశారు. ఈ ఘటనలో ఎంతో మంది భారతీయులతో పాటు విదేశీయులు సైతం ప్రాణాలు కోల్పోయారు.

ఆ దాడిలో మరణించిన వారందరికీ నివాళులర్పిస్తున్నాను. ముఖ్యంగా ముంబయి వంటి దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, ఉగ్రవాదాన్ని తిప్పికొడుతున్న మన భద్రతా సిబ్బందికి నమస్కరిస్తున్నా’ అని ప్రధాని అన్నారు. దేశ వాణిజ్య రాజధాని ముంబయిపై ఉగ్రదాడి జరిగి నేటికి 12 ఏళ్లయింది. పాకిస్థాన్‌నుంచి వచ్చిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు నగరంలో 12 చోట్ల నరమేథం సృష్టించిన విషయం తెలిసిందే. దాదాపు 60 గంటలపాటు సాగిన ఆ మారణకాండలో పలువురు పోలీసు ఉన్నతాధికారులతో పాటుగా 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయాల పాలయ్యారు. పేలుళ్లకు పాల్పడిన ముష్కరుల్లో తొమ్మిది మందిని భద్రతా దళాలు అక్కడికక్కడే మట్టుబెట్టగా మిగిలిన ఒక ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను 2012లో ఉరితీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News