జయశంకర్ భూపాలపల్లి: ఆ అమాయకురాలి అందాన్ని ఓర్వని శాడిస్టు భర్త అనుమానాగ్ని వేధింపు జాలలకు మనస్తాపంతో రగిలి ఓ ఇల్లాలు దగ్ధమయ్యింది. ఆమె బలవన్మరణంతో కడుపున పుట్టిన చిన్నారులు ఇద్దరు అనాధలయిన దయనీయ సంఘటన మండలంలో మనసులను ద్రవింపజేసింది. గణపురం మండలం చిల్పూర్‌లో గురువారం తెల్లవారుజామున భర్త ఒత్తిళ్ల కారణంగా ఒంటిపై డీజిల్ పోసుకుని మంటల్లో మాడి నీరటి రోజా(28) అరుపులు, కేకలతో చూస్తుండగానే ప్రాణాలు కోల్పోవడం గడిచిన సంవత్సరపు ఆఖరి రోజున విషాదాన్ని నింపింది. అనుమానపు భర్త వేసే నిందకు బెదిరి కడుపార కన్న పిల్లలను తప్పని స్థితిలో వదిలి ఆ తల్లి దయమాలి కానరాని లోకాలకు వెళ్ళిన సంఘటన పుట్టెడు దుఖానికి గురిచేసింది. మంటల వేడికి తాళలేక కాపాడండి..కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేస్తూ పసివారిని దీనంగా చూస్తూ అసువులు బాసింది. వారికి ఆ వయస్సులో అమ్మ ఆ విధంగా చిత్రహింసలు అనుభవిస్తూ విలవిల కొట్టుకొని నల్లగా మాడిపోవడం ఎరుగని వారిని చూసి పరిసరాల వారు కంటతడి పెట్టారు.
అక్రమ సంబంధమని నిందలు
జెసిబి నడుపుకుంటు జీవించే మృతురాలి భర్త రాజ్‌కుమార్ ఆమెకు అక్రమ సంబంధాన్ని అంటగడుతూ నింద వేసి సూటిపోటి మాటలతో తిడుతూ, రోజు వేధిస్తూ ఆ రోజు రాత్రి కొట్టాడని పరిసరాల వారు తెలిపారు. ఆమె మృతికి అందమే కారణమని, దానితో తాను లేని సమయంలో ఎవ్వరితోనే గడుపుతున్నావని అనుమానించి క్షోభ పెట్టేవాడని చెప్పారు. అకారణంగా భర్త అక్రమ సంబంధాన్ని అంటగట్టడాన్ని ఆమె జీర్ణించుకోక మానసిక వేదనకు గురై కుమిలి పోయేదని అన్నారు. ఆ సందర్భంగా విడాకులు తీసుకుందామని అతడు నిత్యం ఆమెపై ఒత్తిళ్లు తెచ్చేరని ఆరోపించారు. అంతేకాక అదనపు కట్నం తెమ్మని కూడా కొట్టేవాడన్నారు. అయితే విషయం ఆమె తల్లిదండ్రులకు చెబుతామని అనేకసార్లు ప్రయత్నం చేసిన భర్త నిరాకరించేవారని అక్కడి వారు చెప్పారు.
మనసును కదిలించిన లేఖ
ఆమె ఆ తెల్లవారుజామున జరిగే బలవన్మరణానికి ముందు తల్లికి రాసిన సూసైడ్ నోట్ కదిలించింది. అనుమానంతో అక్రమ సంబంధాన్ని భర్త అంటకట్టడాన్ని భరించలేకపోతున్నానని కుమిలిపోయిన ఆ ఉత్తమరాలు అందులో పేర్కొంది. మీతో ఫోన్ మాట్లాడనివ్వకుండా కుటుంబాన్ని దూరం చేసిన భరించానని, అయిన అక్రమ సంబంధం నిందను భరించలేక తనువు చాలిస్తున్నానని ఆమె అందులో స్పష్టం చేసింది. నా పిల్లలు జాగ్రత్త, అమ్మా నీతో మాట్లాడకుండా పోతున్నందుకు మన్నించు అని భారమైన మనసుతో వేడుకోలు చేసింది. సంఘటన స్థలిలో తల్లి లేనిది తెలియక చిన్నారుల అమాయకపు ఏడ్పులు అక్కడి వారిని కంటతడి పెట్టించాయి. ఆ విధంగా అవగాహన లేక, అర్థం చేసుకోక, అనుమానంతో భార్యల ఆత్మహత్యలకు కారణాలైన ఇలాంటి భర్తల వలన ఇంకెందరు భార్యలు, చిన్నారులు అనాధలు కానున్నారోనని సంఘటన స్థలికి వచ్చిన వారు మాట్లాడుకోవడం పలువురిని బాధించింది.