జనవరి 26న ఢిల్లీ వైపు ట్రాక్టర్ల ర్యాలీ
గణతంత్ర పరేడ్ తర్వాత కిసాన్ పరేడ్- రైతు సంఘాల ప్రకటన
న్యూఢిల్లీ: కేంద్రం ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివార్లలో ఆందోళన సాగిస్తున్న రైతులు ప్రభుత్వంతో తదుపరి విడత చర్చలకు ముందు తమ వైఖరిని మరింత కఠినం చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఈ నెల 26న దేశమంతా గణతంత్ర దినోత్సవం జరుపుకునే వేళ దేశ రాజధాని వైపు ట్రాక్టర్ల ర్యాలీని చేపడతామని రైతు సంఘాలు శనివారం ప్రకటించాయి. ఈ ఏడాది ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవంలో ముఖ్య అతిథిగా బ్రిటిష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ పాల్గొంటున్న విషయం తెలిసిందే.
రైతు నాయకుడు దర్శన్ పాల్ సింగ్ శనివారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాము చేపట్టనున్న పరేడ్‌ను కిసాన్ పరేడ్‌గా పిలుస్తామని, గణతంత్ర దినోత్సవ పరేడ్ తర్వాత తమ ట్రాక్టర్ల ర్యాలీ జరుగుతుందని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వంతో రైతుల తదుపరి విడత చర్చలు ఈ నెల 4న జరగనున్నాయి. ప్రభుత్వానికి, ఆందోళన చేస్తున్న రైతులకు మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన ఈ సమావేశంలో తొలగకపోతే తాము కఠినమైన చర్యలు తీసుకోకతప్పదని రైతు సంఘాల నాయకులు శుక్రవారం ప్రకటించారు. రైతుల డిమాండ్లలో 50 శాతాన్ని ప్రభుత్వం ఆమోదించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని పూర్తి అవాస్తవంగా స్వరాజ్ ఇండయా నాయకుడు యోగేంద్ర యాదవ్ స్పష్టం చేశారు. తమకు లిఖితపూర్వకంగా ఎటువంటి హామీలు రాలేదని ఆయన చెప్పారు.
బుధవారం జరిగిన ఆరవ విడత చర్చలలో విద్యుత్ చార్జీల హెచ్చింపు, పంట వ్యర్థాల దగ్ధంపై జరిమానాలకు సంబంధించి రైతులు వ్యక్తం చేసిన ఆందోళనలపై ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య కొంతమేరకు ఏకాభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. అయితే, రైతులు ప్రధానంగా డిమాండు చేస్తున్న వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాల రద్దు, కనీస మద్దతు ధర(ఎంసిపి)పై చట్టబద్ధమైన హామీపై మాత్రం ప్రతిష్టంభన వీడలేదు.
23 పంటలను ఎంసిపిపై ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా అని తాము గత సమావేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించామని దానికి వారి నుంచి లేదు అన్న సమాధానం వచ్చిందని రైతు నాయకుడు గుర్నామ్ సింగ్ చోదుని తెలిపారు. మరి ఎందుకు దేశ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటివరకు 50 మంది రైతులు తమ ఆందోళన సందర్భంగా అమరులయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Farmers to hold Tractor Parade towards Delhi on Jan 26