ఇండోర్‌లో కమెడియన్, మరో నలుగురి అరెస్ట్
హిందూ దేవుళ్లను అవమానించారని ఆరోపణ
ఇండోర్: హిందూ దేవుళ్లను అవమానించారన్న ఆరోపణలతో మధ్యప్రదేశ్‌లో ఓ హాస్య నటుడితోపాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన కమెడియన్ గుజరాత్‌కు చెందిన మునావర్ ఫరూఖీ కాగా, మిగతావారు ఇండోర్‌కు చెందిన ఎడ్విన్ ఆంథోనీ, ప్రఖార్వ్యాస్, ప్రియంవ్యాస్, నాలిన్ యాదవ్‌గా గుర్తించామని పోలీసులు తెలిపారు. శుక్రవారం ఇండోర్‌లోని దుకాణ్ ప్రాంతంలోని ఓ కేఫ్‌లో కామెడీ షో సందర్భంగా హిందూ దేవతలు, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కామెడీ షోకు హాజరైన బిజెపి ఎంఎల్ఎ కుమారుడు ఏకలవ్యసింగ్గౌర్(36) ఈ ఫిర్యాదు చేశారు. షో జరుగుతున్నపుడే తాము అభ్యంతరం వ్యక్తం చేశామని ఆయన తెలిపారు. గౌర్ స్థానిక హిందూ రక్షక్ అనే సంఘానికి కన్వీనర్. అయితే, షో నిర్వాహకులు చెబుతున్న ప్రకారం కేఫ్‌లో హిందూ సంస్థ కార్యకర్తలు దాడికి పాల్పడి గొడవ చేశారు. శుక్రవారం రాత్రే కమెడియన్ బృందాన్ని హిందూ సంస్థ కార్యకర్తలు పోలీసులకు అప్పజెప్పారు. గుజరాత్లో 2002లో జరిగిన గోద్రా సంఘటన, ఆ సమయంలో అమిత్‌షా వ్యవహరించిన తీరుపైనా కామెడీ షోలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్టు గౌర్ తెలిపారు.
Mumbai Comedian arrested in Indore