Thursday, November 21, 2024

మందేసి వాహనం నడిపితే చిక్కులు తప్పవు

- Advertisement -
- Advertisement -

Drunk And Drive Checks in Hyderabad

హైదరాబాద్: మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మొపుతున్నారు. గత కొంత కాలం నుంచి కరోనా వైరస్ వల్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఆపివేసిన పోలీసులు మళ్లీ ప్రారంభించారు. ముందుగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు ప్రా రంభించారు. మద్యం తాగివాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతుండడంతో తనిఖీలు చేపట్టారు. చాలామంది మద్యం తాగి వాహనాలు నడుపుతు పట్టుబడుతున్నారు. ఇందులో ఎక్కువగా 20 నుంచి 45 ఏళ్ల వారు ఎక్కువగా ఉంటున్నారు. గత ఏడాది సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో 3,387 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసులు నమోదు చేసి, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2019లో 21,000 కేసులు నమోదు కాగా, 2020లో 3,387 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2019 29,756 కేసులు నమోదు కాగా, 2020లో 5,590 కేసులు ట్రాఫిక్ పోలీసులు నమోదు చేశారు.

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2020లో 3,203 కేసులు నమోదు చేశారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు భారీగా జరిమానా విధిస్తున్నారు. ఎవరినీ వదలకుండా తనిఖీలు చేయడంతో భారీగా కేసులు నమోదవుతున్నాయి. మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో డిసెంబర్ 31న, 1,814 కేసులు నమోదు చేశారు. నూతన సంవత్సరం వేడుకల్లో మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ హెచ్చరించారు. అంతేకాకుండా స్వయంగా రెండు రోజుల ముందే ట్రాఫిక్ డిసిపి ఎస్‌ఎం విజయ్‌కుమార్‌తో కలిసి తనిఖీలు చేశారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకుని కేసులు నమోదు చేశారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారు ఎంతటి వారైనా కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారు. కోకాపేట కార్పొరేటర్ మద్యం తాగి వాహనాలు నడపడంతో కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.

కరోనాతో తగ్గిన కేసులు…

కరోనా లాక్‌డౌన్ వల్ల నిషేధాలు ఉండడంతో చాలా మంది ఇళ్లల్లోనే ఉండడంతో చాలా వరకు మద్యం కేసులు తగ్గాయి. అంతేకాకుండా వైన్‌షాపులు, బార్లు రెస్టారెంట్లు, పబ్బులు, స్టార్ హోటళ్లను మూసివేయడంతో ఎక్కడికక్కడ మద్యం సరఫరా బంద్ అయింది. దీంతో మద్యం తాగి వాహనాలు నడిపేవారి సంఖ్య తగ్గింది. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత కరోనా వ్యాపిస్తుండడంతో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టలేదు. తనిఖీలు చేస్తలేరని మందుబాబులు మద్యం తాగి వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతుండడంతో ముందుగా సైబరాబాద్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. దీంతో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఎక్కువగా డిడి కేసులు నమోదయ్యాయి.

ఎంతటి వారైనా వదిలేది లేదు : విసి సజ్జనార్

మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారు ఎంత వారైనా వదిలే ప్రసక్తే లేదని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ హెచ్చరించారు. మద్యంతాగి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, అమాయకులు ప్రాణాలు కో ల్పోతున్నారని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారికి పదేళ్ల జైలు శిక్ష పడే విధంగా కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. ఇటీవల విప్రో జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వారు వెళ్లాల్సిన వైపు రెడ్ సిగ్నల్ ఉన్నా కూడా ఐదుగురు యువకులు మద్యం మత్తులో ఉండడంతో సిగ్నల్ జంప్ చేసి ముందుకు పోవడంతో లారీ ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయారని, దీంతో వారి కుటుంబ సభ్యులు తీరలేని నష్టం జరిగింది. మద్యం తాగి రోడ్ల మీదికి వచ్చి అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు.

Drunk And Drive Checks in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News