ఏప్రిల్‌లో స్కూళ్లు తెరిస్తే ఓకే!
69 శాతం మంది పేరెంట్స్ అభిప్రాయం
దేశవ్యాప్తంగా జరిపిన సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత ఏప్రిల్ లో పాఠశాలల పునఃప్రారంభానికి 69 శాతం విద్యార్థుల తల్లిదండ్రులు సుముఖంగా ఉన్నారని ఒక సర్వేలో వెల్లడైంది. లోకల్ సర్కిల్స్ అనే ఆన్‌లైన్ సంస్థ దేశవ్యాప్తంగా 19,000 మందికి పైగా తల్లిదండ్రుల నుంచి అభిప్రాయ సేకరణ జరిపి ఈ సర్వే రూపొందించింది. ఏప్రిల్ నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే తమ పిల్లలకు వేయడానికి కేవలం వీరిలో 26 శాతం మంది మాత్రమే అంగీకరించారని సర్వేలో బయటపడింది. కరోనా వైరస్ కారణంగా గత విద్యా సంవత్సరంలో తమ పిల్లలను పాఠశాలలకు పంపడానికి వారి తల్లిదండ్రులు ఇష్టపడలేదు. అయితే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఏప్రిల్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత తమ పిల్లలను స్కూళ్లకు పంపడానికి 69 శాతం మంది పేరెంట్స్ సుముఖత వ్యక్తం చేసినట్లు సర్వే పేర్కొంవది. కాగా, 23 శాతం మంది పేరెంట్స్ జనవరి నుంచే పాఠశాలలు పునఃప్రారంభం అయినా తమకు అభ్యంతరం లేదని అభిప్రాయపడినట్లు సర్వే తెలిపింది. 26 శాతం మంది పేరెంట్స్ మాత్రమే తమ పిల్లలకు ఏప్రిల్‌లోపల కరోనా టీకా వేయించడానికి అంగీకరించారని, 56 శాతం మంది మాత్రం ఒక మూడు నాలుగు నెలలు వేచి చూసి, దాని ఫలితాలు బయటపడిన తర్వాత టీకా వేయిస్తామని తెలిపారని సర్వేలో పేర్కొన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి దేశవ్యాప్తంగా గత ఏడాది మార్చిలో పాఠశాలలను మూసివేశారు. అక్టోబర్ 15న పాక్షికంగా పాఠశాలలు తెరుచుకున్నాయి. అయితే, కొన్ని రాష్ట్రాలలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గకపోవడంతో ఆయా రాష్ట్రాలలో పాఠశాలల మూసివేతను కొనసాగించారు. కాగా.. బీహార్, అస్సాం, కేరళ, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలలో 9 నుంచి 12వ తరగతి విద్యార్థుల కోసం ఈ నెల నుంచే పాఠశాలలు తెరుచుకున్నాయి. అయితే, ఢిల్లీ మాత్రం కరోనా టీకా అందుబాటులోకి వచ్చే వరకు స్కూళ్లను తెరిచేది లేదని ఇప్పటికే ప్రకటించింది. ఇలా ఉండగా&రానున్న ఐసిఎస్‌ఇ బోర్డు పరీక్షలను పురస్కరించుకుని జనవరి 4 నుంచి తమ అనుబంధ పాఠశాలలను పునః ప్రారంభించాలని కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్(సిఐఎస్‌సిఇ) కోరినప్పటికీ దీనిపై ఎటువంటి నిర్ణయం మాత్రం ఇప్పటివరకు తీసుకోలేదు.
Schools reopen in April from new academic year 2021