హైదరాబాద్: జిల్లా స్థాయిలో వివిధ శాఖల్లో, వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియను జనవరి 31వ తేదీలోగా పూర్తి చేయడంతో పాటు, ఎటువంటి జాప్యం లేకుండా కారుణ్య నియామకాలను పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం బిఆర్‌ఆర్‌కె భవన్ నుంచి జిల్లా కలెక్టర్లతో అన్ని కేటగిరిల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రమోషన్లు, డిపిసిల నిర్వహణ, కారుణ్య నియామకాలు, రెవెన్యూ సంబంధిత అంశాలు, రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్స్, డ్రైయింగ్ ఫ్లాట్ ఫాం, గ్రామ నర్సరీలు, ఉపాధి హామీ పనులు తదితర అంశాలపై సిఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ సోమేష్‌కుమార్ మాట్లాడుతూ ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియకు ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేయాలని సిఎం కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారని ఆ దిశగా కలెక్టర్లు చర్యలు చేపట్టాలని సిఎస్ సూచించారు.
జిల్లా కలెక్టర్లు ఈ అంశంపై వెంటనే జిల్లా స్థాయిలో సమావేశం నిర్వహించి ప్రమోషన్ల ద్వారా నింపే ఉద్యోగ ఖాళీల సంఖ్యను అంచనా వేయాలన్నారు. ప్రతి సోమవారం ప్రమోషన్ల, కారుణ్య నియామాకాలపై సమావేశాలు నిర్వహించి ఈ నెల 24 వ తేదీ నాటికి పూర్తి చేయాలన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉపాధి హామీ ద్వారా ఈ సీజన్‌లో మూడు నెలల ముందుగానే 14.10 కోట్ల పని దినాలు దాటిన నేపథ్యంలో అధికారులను అభినందిస్తూ వచ్చే మూడు నెలల కోసం ప్రణాళికలు రూపొందించుకో వాలని సిఎస్ ఆదేశించారు. రైతు వేదికలు, పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డ్రైన్ ప్లాట్ ఫాం, సెగ్రిగేషన్ షెడ్స్, నర్సరీల్లో ప్లాంటేషన్ తదితర అంశాలకు ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేయాలని సిఎస్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణా రావు, జిఎడి ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి S.A.M. రిజ్వీ, CIG/సిఎం కార్యదర్శి శేషాద్రి, సీనియర్ కన్సల్టెంట్ శివశంకర్, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ కమిషనర్ రఘునందన్ రావు, ఎండి, టిఎస్‌టిఎస్, జి.టి.వెంకటేశ్వర్ రావు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Somesh Kumar holds video conference with district collectors