Saturday, November 23, 2024

జోరు సాగించాలి..

- Advertisement -
- Advertisement -

సిడ్నీ : మెల్‌బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్‌డే టెస్టులో చారిత్రక విజయం సాధించిన టీమిండియా మిగిలిన మ్యాచుల్లో కూడా అదే జోరును కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో గురువారం నుంచి మూడో టెస్టు మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌కు భారత్ ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఇక నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఐదుగురు క్రికెటర్లు భోజనం కోసం ఓ హోటల్‌కు వెళ్లడంతో ఆ ఆటగాళ్లను ఐసోలేషన్‌లో ఉంచాల్సి వచ్చిం ది. అయితే తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆ క్రికెటర్లకు నెగెటివ్ వచ్చింది. దీంతో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మతో సహా జట్టు సభ్యులందరూ మెల్‌బోర్న్ నుంచి సిడ్నీకి చేరుకున్నారు. ఇక సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ చేరడంతో జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించిన రహానె సేన సిడ్నీలోనూ గెలుపే లక్షంగా పెట్టుకుంది.

బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ సమతూకంగా కనిపిస్తోంది. ఈసారి కూడా బౌలర్లపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. బుమ్రా, అశ్విన్, సిరాజ్, జడేజాల నుంచి మెరుగైన ప్రదర్శనను ఆశిస్తోంది. సీనియర్ బౌలర్లు షమి, ఉమేశ్‌లు గాయాల వల్ల సిరీస్‌కు దూరమయ్యారు. వీరు లేక పోవడం జట్టుకు కాస్త ప్రతికూలమనే చెప్పాలి. అయితే శార్దూల్ ఠాకూర్, నవ్‌దీప్ సైని, నటరాజన్‌ల రూపంలో మెరుగైన ప్రత్యామ్నాయం కనిపిస్తోంది. కానీ, బ్యాటింగ్‌లో నిలకడలేమి ఒక్కటే జట్టును కలవరానికి గురిచేస్తోంది. కాగా, రోహిత్ రాకతో బ్యాటింగ్ సమస్యలు చాలా వరకు తీరిపోయే అవకాశాలున్నాయి. శుభ్‌మన్‌గిల్‌తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం ఖాయం. వరుస వైఫల్యాలు చవిచూస్తున్న మయాంక్ అగర్వాల్‌కు మరో ఛాన్స ఇవ్వడం ప్రస్తుతం పరిస్థితుల్లో కష్టమే.

ఇక తెలుగుతేజం హనుమ విహారిని ఆడిస్తారా లేదా అనేది ఇంకా తేలలేదు. మరోవైపు సీనియర్ బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారా వరుస వైఫల్యాలు చవిచూస్తుండడం జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. రెండో టెస్టులో పుజారా ఘోరంగా విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ నిరాశ పరిచాడు. కనీసం ఈ మ్యాచ్‌లోనైన తన బ్యాట్‌కు పనిచెప్పాల్సిన అవసరం ఉంది. ఇక కెప్టెన్ అజింక్య రహానె ఈ మ్యాచ్‌లో కూడా జట్టుకు చాలా కీలకంగా మారాడు. కిందటి మ్యాచ్‌లో సెంచరీతో అలరించిన రహానె ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. మిగతా బ్యాట్స్‌మెన్ తమవంతు సహకారిం అందిస్తే భారత్ ఈ మ్యాచ్‌లో కూడా గెలవడం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News