ఐదు రోజులుగా 7,561 ధృవీకరణ పత్రాల జారీ
హైదరాబాద్: జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీలో కొత్త విధానం అమల్లోకి వచ్చింది. బర్త్, డెత్ దరఖాస్తుల స్వీకరణ, సర్టిఫికెట్ల జారీని జిహెచ్‌ఎంసి సిటీజన్ సర్వీస్ సెంటర్లతో పాటు ఇకపై మీ-సేవా కేంద్రాల్లో కూడా సేవలను అందించేలా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. పునర్ వ్యవస్థీకరించిన ఈ కొత్త విధానంలో సర్కిళ్లలోని అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లను (ఏఎంసీ)లను సబ్ రిజిస్ట్రార్లుగా గుర్తిస్తూ ప్రభుత్వం బాధ్యతలను కేటాయించింది. పుట్టిన, మరణించిన 30 రోజుల్లోపు చేసుకునే దరఖాస్తుల పరిశీలన, జారీచేసే అధికారాన్ని ఏఎంసిలకు అప్పగించింది. నెల తరువాత నుంచి ఏడాది వరకు సమయంలో వచ్చిన దరఖాస్తులను రిజిస్ట్రార్లుగా ఉండే ఏఎంహెచ్‌ఓలు పరిశీలించి సర్టిఫికెట్‌లను జారీచేస్తారు. ప్రస్తుతం వార్డు యూనిట్ గా ఉన్న జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ ఇక సర్కిల్ యూనిట్ గా మారుతూ జనవరి 1వ తేదీ నుంచి నూతన విధానం అమల్లోకి వచ్చింది.
అయితే జనన, మరణ దరఖాస్తులను జిహెచ్‌ఎంసితో పాటు మీ-సేవా కేంద్రాలకు బదలాయింపుకుగాను జరిపిన సమాచార మార్పిడి క్రమంలో సర్వర్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యల వల్ల 2020 డిసెంబర్ 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీ ఆగిపోయింది. ఈ సమాచార మార్పడి ప్రక్రియ పూర్తి కావడంతో డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం నుంచి పూర్తిస్థాయిలో జనన, మరణ సర్టిఫికెట్ల జారీ అమల్లోకి వచ్చింది. డిసెంబర్ 20వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ వరకు 13,026 జనన, మరణ ధృవీకరణ పత్రాలు జారీచేయగా వీటిలో జనవరి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మీ-సేవా కేంద్రాల ద్వారా 7,561 సర్టిఫికేట్లు జారీ అయ్యాయని అధికారులు తెలిపారు.