న్యూఢిల్లీ: కేంద్రం భేషజాలకు పోకుండా మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, అప్పుడే రైతుల నిరసనలపై పరిష్కారం దక్కుతుందని కాంగ్రెస్ స్పష్టం చేసింది. జంతర్ మంతర్ వద్ద రైతులకు సంఘీభావంగా ధర్నా చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపిలను కలుసుకున్న తరువాత పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విలేకరులతో మాట్లాడారు. కేంద్రం దిగిరావాలని, అప్పుడు సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. రైతుల ఉద్యమానికి మద్దతును మరింతగా కూడగట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తాజాఆ ఆన్లైన్ ఉద్యమ కార్యక్రమం చేపట్టారు. తాము రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటామని, ఈ విషయంలో వెనకడుగు ప్రసక్తే లేదని ప్రియాంక తెలిపారు. అంతకు ముందు పంజాబ్ రైతు నేతలు కొందరు రాహుల్ నివాసానికి వెళ్లారు. తరువాత రాహుల్ ఓ ట్వీట్ వెలువరించారు. మోడీ ప్రభుత్వం అన్నదాతలకు ద్రోహం చేసిందని, పెట్టుబడిదారీ దోస్తులకు తోడిపెట్టేందుకు ఈ చట్టాలు తీసుకువచ్చారని విమర్శించారు. రైతుల నిరసనలకు పార్టీ మద్దతు బలోపేతం చేయాలని, సమాజంలోని అన్ని వర్గాల నుంచి కూడా బాసటగా నిలిచితీరాలని ట్వీట్లో కోరారు.
No solution except repealing farm laws says Congress