హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. భోగి వేడుకల్లో సామాన్యుల నుంచి సెలబ్రెటీల దాకా పాల్గొన్నారు. చార్మినార్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన భోగి సంబురాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. కవిత భోగి మంటలు వెలిగించి భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం కవిత మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రజలు భోగభాగ్యాలతో సుఖ:సంపాదనలతో అనందంగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. భోగి అంటేనే మన జీవితాల్లో ఉన్న చెడు మంటల్లో కాలి పోవాలని దీనిని జరుపుకుంటామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. రాష్ట్రంతో పాటు దేశ ప్రజలందరూ కరోనా వైరస్ నుంచి విముక్తి పొందాలని కోరుకుంటున్నానన్నారు. సంక్రాంతి అంటేనే సిరిసంపదలు ఇచ్చే పండగ అని అందరి జీవితాల్లో సిరిసంపదలు సమృద్ధిగా రావాలని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంప్రదాయ కార్యక్రమాలు స్థానికులను ఆకట్టుకున్నాయి. భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలతో చార్మినార్ ప్రాంతం సందడిగా మారింది.
మహిళలు, పిల్లల సందడి…
భోగిని పురస్కరించుకొని ప్రజలు ముగ్గులు వేసి తెల్లవారుజామునే భోగి మంటలను వెలిగించారు. కాలనీలు, అపార్ట్మెంట్లలో పాత సామాన్లు ఆ భోగి మంటల్లో వేస్తూ సరికొత్త సంక్రాంతికి స్వాగతం పలికారు. మంటల చుట్టూ నృత్యాలు చేస్తూ సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ పండుగను జరుపుకున్నారు. మరోవైపు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలపడంతో పాటు ఈ సంక్రాంతి అందరి ఇళ్లలో సంతోషాన్ని నింపాలని వారు కోరుకున్నారు. తెలుగు వారి పండుగలో మొదటిదైన భోగి పర్వదినాన్ని పురస్కరించు కొని తెల్లవారుజాము నుంచే అంతా భోగి వేడుకల్లో పాల్గొన్నారు. గంగిరెద్దులు, హరిదాసులు, మేలాల నడుమ రంగవళ్లులపై గొబ్బెమ్మలు ఉంచి భోగి మంటలు వేశారు. వాటి చుట్టూ ప్రదక్షిణలు చేసి మహిళలు, పిల్లలు సందడి చేశారు.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) January 13, 2021