రాణించిన వేడ్, స్మిత్, పైన్, ఆస్ట్రేలియా 274/5, భారత్‌తో చివరి టెస్టు
బ్రిస్బేన్: భారత్‌తో జరుగుతున్న నాలుగో చివరి టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసి పటిష్టస్థితిలో నిలిచింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. స్టార్ బ్యాట్స్‌మన్ మార్నొస్ లబుషేన్ (108) సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా భారత యువ ఫాస్ట్ బౌలర్ నటరాజన్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. గాయపడిన బుమ్రా స్థానంలో అతన్ని తుది జట్టులోకి తీసుకున్నారు. ఇక వాషింగ్టన్ సుందర్ రవీంద్ర జడేజా స్థానంలో జట్టులోకి వచ్చాడు. హనుమ విహారి బదులు మయాంక్ అగర్వాల్‌కు చోటు కల్పించారు.
తీరు మారని వార్నర్
సిరీస్‌లో పేలవమైన ఆటతో నిరాశ పరుస్తున్న స్టార్ ఓపెనర్ డేవిడ్ ఈసారి కూడా విఫలమయ్యాడు. స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ చివరి బంతికి వార్నర్‌ను వెనక్కి పంపాడు. వార్నర్ ఒక పరుగు మాత్రమే చేశాడు. దీంతో 4 పరుగుల వద్దే ఆస్ట్రేలియా తొలి వికెట్‌ను కోల్పోవాల్సి వచ్చింది. తర్వాత వచ్చిన లబుషేన్‌తో కలిసి మరో ఓపెనర్ హారిస్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచేందుకు ప్రయత్నించాడు. ఆత్మరక్షణతో బ్యాటింగ్ చేస్తున్న హారిస్‌ను శార్దూల్ ఠాకూర్ వెనక్కి పంపాడు. హారిస్ 23 బంతుల్లో ఐదు పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా 17 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది.
రాణించిన స్మిత్
ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే బాధ్యతను లబుషేన్, స్టీవ్ స్మిత్ తమపై వేసుకున్నారు. ఇద్దరు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఈ జోడీని విడగొట్టేందుకు భారత బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇటు స్మిత్, అటు లబుషేన్ కుదురుగా ఆడడంతో ఆస్ట్రేలియా మళ్లీ కోలుకుంది. ఇక ఈ జోడీని విడగొట్టేందుకు భారత బౌలర్లు చాలా సేపు ఎదురు చూడక తప్పలేదు. కీలక ఇన్నింగ్స్ ఆడిన స్మిత్ 77 బంతుల్లో 5 ఫోర్లతో 36 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ క్రమంలో లబుషేన్‌తో కలిసి మూడో వికెట్‌కు కీలకమైన 70 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
ఆదుకున్న వేడ్, లబుషేన్
తర్వాత వచ్చిన మాథ్యూ వేడ్‌తో కలిసి లబుషేన్ మరో కీలక పార్ట్‌నర్‌షిప్‌ను నమోదు చేశాడు. ఇద్దరు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను పటిష్ట పరిచారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను ఫోర్లుగా మలుస్తూ స్కోరును పరిగెత్తించారు. ఇద్దరు సమన్వయంతో ఆడుతూ ఆస్ట్రేలియాను పటిష్టస్థితికి చేర్చారు. ఈ జంటను ఔట్ చేసేందుకు భారత కెప్టెన్ తరచూ బౌలర్లను మార్చినా ఫలితం లేకుండా పోయింది. అద్భుత సమన్వయంతో ఆడిన లబుషేన్, వేడ్ ఐదో వికెట్‌కు 113 పరుగులు జోడించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన వేడ్ ఆరు ఫోర్లతో 45 పరుగులు చేసి నటరాజన్ చేతికి చిక్కాడు. టెస్టుల్లో నటరాజన్‌కు ఇదే తొలి వికెట్ కావడం విశేషం. మరోవైపు లబుషేన్ శతకంతో కదం తొక్కాడు.
భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న లబుషేన్ 204 బంతుల్లో 9 ఫోర్లతో 108 పరుగులు చేశాడు. ఈ వికెట్ కూడా నటరాజన్‌కే దక్కింది. ఇటు వేడ్, అటు లబుషేన్ ఒకరివెంట ఒకరూ పెవిలియన్ చేరడంతో భారత్ మళ్లీ పుంజుకుంటుందని అందరూ భావించారు. అయితే ఈ దశలో కామెరూన్ గ్రీన్, కెప్టెన్ టిమ్ పైన్ అద్భుత బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియాను మరింత పటిష్టస్థితికి చేర్చారు. సమన్వయంతో ఆడిన గ్రీన్ మూడు ఫోర్లతో 28 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన పైన్ ఐదు ఫోర్లతో 38 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఆస్ట్రేలియా స్కోరు 87 ఓవర్లలో ఐదు వికెట్లకు 274 పరుగులకు చేరింది. భారత బౌలర్లలో నటరాజన్‌కు రెండు, ఠాకూర్, సుందర్, సిరాజ్‌లకు ఒక్కొ వికెట్ దక్కింది.
క్యాచ్ వదిలేయడంతో..
టెస్టు సిరీస్‌లో నిలకడగా ఆడుతున్న లబుషేన్ ఇచ్చిన రెండు సులువైన క్యాచ్‌లను విడిచి పెట్టడం ద్వారా భారత్ భారీ మూల్యమే చెల్లించుకుంది. ఒకవేళ లబుషేన్ ఇచ్చిన క్యాచ్‌లు పట్టి ఉంటే మ్యాచ్‌లో టీమిండియా చాలా మెరుగ్గా ఉండేదనడంలో సందేహం లేదు. తనకు లైఫ్ ఇస్తే ఎలా ఉంటుందో లబుషేన్ ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లకు రుచి చూపించాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న లబుషేన్ అద్భుత సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. 37 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతనిచ్చిన సులువైన క్యాచ్‌ను భారత కెప్టెన్ రహానె నేలపాలు చేశాడు. దీన్ని లబుషేన్ తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమయ్యాడు. లైఫ్ లభించడంతో లబుషేన్ రెట్టించిన విశ్వాసంతో బ్యాటింగ్ చేశాడు. స్మిత్ ఔటైన వెంటనే లబుషేన్ ఇచ్చిన క్యాచ్‌ను పట్టి ఉంటే ఆస్ట్రేలియా కచ్చితంగా ప్రమాదంలో పడి ఉండేది. కానీ క్యాచ్ జారవిడవడంతో భారత్ మెరుగైన స్థితి నుంచి కష్టాల్లోకి జారింది.