అధ్యక్ష పదవీకాలం ముగియడానికి కేవలం ఐదారు రోజుల వ్యవధి మాత్రమే ఉందనగా అభిశంసనకు గురైన డోనాల్డ్ ట్రంప్ ఆధునిక అమెరికా ప్రజాస్వామ్య చరిత్రలో ఒక అరాచక అధ్యాయ కర్తగా నిలిచిపోయాడు. జో బైడెన్‌ను ఇరకాటంలో పెట్టడానికి ఉక్రెయిన్ పై రహస్య ఒత్తిడి తెచ్చాడన్న ఆరోపణ మీద 2019 లో ఒకసారి ప్రతినిధుల సభ ఆయనను అభిశంసించింది. ఇలా ఒకే పదవీ కాలం లో రెండుసార్లు అభిశంసన ఘట్టానికి పాత్రుడైన అధ్యక్షుడుగా ట్రంప్ ప్రత్యేకతను మూటగట్టుకున్నాడు. నూతన అధ్యక్షుడుగా జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించడానికి అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు) ఉభయ సభలూ ప్రత్యేకంగా సమావేశమైన సమయంలో ఈ నెల 6వ తేదీన వేలాది మంది అనుయాయులను ఆ సమావేశం సాగుతున్న కేపిటల్ హిల్ భవనం మీదికి ఉసిగొల్పి శాసనకర్తలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకునే పరిస్థితిని సృష్టించి ఆ సందర్భంగా అక్కడ చెలరేగిన అశాంతిలో నలుగురు అమాయకుల దుర్మరణానికి దోహదపడ్డాడన్న కారణం మీద ప్రతినిధుల సభ ఈసారి ట్రంప్ పై అభిశంసన తీర్మానాన్ని ఆమోదించింది.
సాధారణంగా అధ్యక్షుడు ఆ పదవిలో కొనసాగడానికి అనర్హుడని తేలినప్పుడు ఉపాధ్యక్షుడు ఆ విషయాన్ని ప్రకటించి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి అమెరికా రాజ్యాంగం 25వ సవరణ అవకాశం కల్పిస్తుంది. గత ఆరవ తేదీన ట్రంప్ తన అనుచరులను రెచ్చగొట్టి పార్లమెంటు భవనం మీదికి పంపించినట్టు ఆ రోజు ఆయన చేసిన ప్రసంగం రూపంలో స్పష్టమైన దాఖలా ఉన్నందున ఈ అధికరణాన్ని అమల్లోకి తీసుకు రావాలని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌ను డెమొక్రాట్లు కోరారు. ఆ అధికరణ అధ్యక్ష స్థానంలోని వ్యక్తి అనారోగ్యం మూలంగా అనర్హతను ఆకర్షించే సందర్భాల్లో ప్రయోగించడానికి మాత్రమే ఉద్దేశించినది అని చెప్పి పెన్స్ దానిని ప్రయోగించడానికి నిరాకరించాడు. ఆది నుంచి ట్రంప్‌కు అత్యంత విధేయుడుగా నిరూపించుకున్న పెన్స్ మొన్న నూతన అధ్యక్షుడి ఎన్నిక ధ్రువీకరణ సందర్భంలో నిషాక్షికంగా వ్యవహరించి ప్రశంసలు పొందా డు. ఆనాటి ఉభయ సభల నిర్ణయం తనకు అనుకూలంగా వచ్చేటట్టు చూడాలని ట్రంప్ ఎంతగా ఒత్తిడి తెచ్చినా ఆయన లొంగలేదు.
ఇప్పుడు ట్రంప్‌కు వ్యతిరేకంగా 25వ అధికరణను ప్రయోగించడానికి కూడా తొందరపడలేదు. ఈ నేపథ్యంలో ప్రతినిధుల సభ ట్రంప్‌పై అభిశంసన తీర్మానాన్ని ఓటింగ్‌కు పెట్టి నెగ్గించుకున్నది. 232197 తేడాతో నెగ్గిన ఈ తీర్మానానికి అనుకూలంగా పది మంది రిపబ్లికన్లు ఓటు వేయడం అసాధారణ పరిణామం. అత్యంత బాధ్యతాయుతమైన అధ్యక్ష పదవిలో ఉండి అమెరికా ప్రజాస్వామ్యానికి తలమానికము, దేశ దేశాలకు ఆదర్శం అనిపించుకున్న పార్లమెంటు భవనంలోకి, లోపల కీలక సమావేశం జరుగుతున్న సమయంలో తిరుగుబాటుదార్లను రెచ్చగొట్టి పంపించిన ట్రంప్ చర్యను స్వపక్ష సభ్యులే అసహ్యించుకుంటున్నారనడానికి ఇది నిదర్శనం. 2019లో ట్రంప్‌పై ప్రతినిధుల సభ ఆమోదించిన తొలి అభిశంసన తీర్మానానికి రిపబ్లికన్ల నుంచి ఈ రకమైన మద్దతు లభ్యం కాలేదు. అలాగే అప్పటి అభిశంసన తీర్మానానికి అంతిమ దశలో రిపబ్లికన్ల ఆధిక్యంలోని సెనెట్ అడ్డుచక్రం వేయడంతో దాని పూర్తి వ్యతిరేక ప్రభావం ట్రంప్‌పై పడలేదు. అందువల్ల ఆయన చివరి వరకూ అధికారంలో కొనసాగగలుగుతున్నాడు.
ప్రతినిధుల సభ ఇప్పటి అభిశంసన తీర్మానం కూడా సెనెట్‌లో ఆమోదం పొందితేనే అది పూర్ణ స్వరూపాన్ని పొందుతుంది. ట్రంప్ అధ్యక్ష స్థానం నుంచి దిగిపోవలసి ఉన్న ఈ నెల 20వ తేదీకి ఒక రోజు ముందు అనగా 19వ తేదీన సెనెట్ సమావేశాలు మొదలవుతాయి. సమావేశాలు మొదలు కావడంతోనే అభిశంసన తీర్మానాన్ని అది పరిశీలనకు తీసుకోవలసి ఉంటుంది. ఆ తీర్మానంపై సెనెట్ వైఖరి తేలడానికి చాలా కాలం పడుతుంది. అంతవరకు కొత్త అధ్యక్షుడి మంత్రు ల ప్రమాణ స్వీకారం జరగడానికి అవకాశ ముండదు. కొవిడ్ సంక్షోభ తరణానికి ఉద్దేశించిన ఉద్దీపన పథకం నిధులు విడుదల చేయడం వంటి కీలక నిర్ణయాలేవీ అమలుకు నోచుకోవు. అంతేకాదు ఈ తీర్మానాన్ని సెనెట్ త్వరితంగా తుది దశకు తీసుకువెళ్లి ఓటింగ్ జరిపినా మూడింట రెండొంతుల మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తేగాని అది నెగ్గదు.
అందుకు సెనెట్‌లోని 17 మంది రిపబ్లికన్ల మద్దతు అవసరమని భావిస్తున్నారు. ఇది బుట్టదాఖలా అయినా ట్రంప్ మరొకసారి అధ్యక్ష పదవికి పోటీ చేయకుండా అనర్హుడిని చేసే మరో తీర్మానాన్ని ప్రతినిధుల సభ ఆమోదించి సెనెట్‌కు పంపించే అవకాశాలున్నాయి. అది గెలుపొందడానికి సెనెట్‌లో సాధారణ మెజారిటీ లభిస్తే చాలు. ఇటీవలి రెండు జార్జియా స్థానాల గెలుపుతో అక్కడ డెమొక్రాట్లు బొటాబొటీ మెజారిటీని సంపాదించుకున్నారు. అందుచేత ట్రంప్ రెండోసారి ఎన్నికల్లో నిలబడే అవకాశాన్ని కోల్పోవచ్చు.