ముంబై: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో 30 ఏళ్ల వ్యక్తి తన ప్రియురాలిని దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని తన ఫ్లాట్ గోడలో దాచిపెట్టాడు. తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో నిందితుడు ఆ మహిళను చంపాడని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. వివరాల్లోకి వెళితే… వాన్గాన్ గ్రామానికి చెందిన వ్యక్తికి స్థానికంగా ఉండే (32) ఏండ్ల మహిళతో పరిచయం ఏర్పడింది. దీంతో ఐదేళ్లుగా వారిద్దరు కలిసి ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో గతఏడాది అక్టోబర్లో ఆమెను చంపేశాడు. అనంతరం తన ఫ్లాట్ గోడలోపల ఆమె మృతదేహాన్ని ఉంచి సిమెంట్ తో ప్లాస్టింగ్ చేశాడు.
మృతురాలు చివరిసారిగా నిందితుడితో అక్టోబర్ 21న బంధువులు కనిపించింది. బాధితురాలి కుటుంబసభ్యులు ఆమె ఆచూకీ గురించి అతనిని అడిగినప్పుడు, ఆమె గుజరాత్ కి వెళ్లిందని చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆమెకు కొన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఇటీవల కాలంలో భర్త మృతి చెందడంతో నిందితుడు సూరజ్ కుమార్ మౌర్యతో కలిసి ఆమె సహజీవనం ప్రారంభించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని విచారించారు. దర్యాప్తులో బాధితురాలి అస్థిపంజరాన్ని వ్యక్తి ఇంటి గోడలోంచి బయటకు తీశారు. హత్య, ఇతర ఆరోపణలపై ఐపిసి లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.