బీడువారిన నేలను రెక్కలు ముక్కలు చేసుకొని సారవంతమైన క్షేత్రముగా తీర్చిదిద్దడమే కాకుండా కృషీవలుడు తీరుతీరుల పంటల్నిపండిస్తాడు. అట్లే సాహితీ క్షేత్రంలోప్రతిభావంతులైన వారు ఏక కాలంలో భిన్న ప్రక్రియల్లో రచనలు చేసి సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. కాలువ మల్లయ్య కవిగా, కథకునిగా, నవలాకారునిగా, సాహిత్య విమర్శకునిగా, సామాజిక, ఆర్థిక, రాజకీయాంశాల విశ్లేషణ వ్యాసకర్తగా వినుతికెక్కారు.ఏడు పదుల వయస్సుకు చేరుకున్నవీరు తన రచనలతో తెలుగు సాహిత్య మాగాణానికి కాలువలు పారిస్తున్నఅలుపెరుగని కృషీవలుడు.
ఇప్పటివరకు వీరు పద్నాలుగు నవలలు వెలువరించారు. భూమి పుత్రుడు,సాంబయ్య చదువు, మాట్లాడే బొమ్మలు, ఊరంటే?,బతుకు పుస్తకం,గువ్వలచెన్నా, (డబ్బు) -తృప్తి = దుఃఖం ,తెలంగాణ దేవదాసు, చీకట్లో చిరు దీపం, మెతుకు పుస్తకం, నీ బాంచెన్ కాల్మోక్త (నీల్ బనో గులాంగిరి చోడో), మంచియన్నది మాల అయితే, మాదిగ విజయం, అస్పృశ్య కోయిల మొదలగు నవలలు సామాజిక వాస్తవిక దృక్పథంతో రాయబడటం వల్ల సమకాలీన చరిత్రకు సాక్షాలుగా నిలువగలవు. ‘భూమి పుత్రుడు ‘ నవలలో కాపు కుల వృత్తి జీవన పరిణామాలను చిత్రించారు,తెలంగాణలో కాకతీయులకు పూర్వ మే వ్యవసాయం జీవనాధారంగా చేసుకున్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి .కాపు దాపు అన్న నానుడి విదితమే.కాపులు పంటను సంరక్షిస్తూ జనాలకు పట్టెడన్నం పంచుతూ వచ్చారు.అట్లాంటి కాపు రైతులు 1980దశకంలో సంక్షోభాన్ని ఎదుర్కోవడం,అప్పుల క్రింద తల్లి వంటి భూమిని అమ్ముకొని కూలీలుగా మారి జీవనోపాధికి వలస వెళ్లాల్సి రావడాన్నిఈ నవల సూచిస్తుంది.
‘సాంబయ్యచదువు’ నవల ప్రదానంగావెనుకబడిన కులానికి చెందిన గొల్లల జీవన పరిణామాలను చిత్రించింది.గొల్ల కులంలో పుట్టిన కాలువ మల్లయ్య గారు చదువుకొని ఎదిగి జీవితాన్ని గెలుచుకొని రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉద్యోగిగా స్థిరపడటం జరిగింది.ఈ ఇతివృత్తమే నవలలో కనిపిస్తుంది.1952నుండి 1986 మధ్య కాలంలో నవల ప్రవర్తిస్తుంది.ఒక విధంగా ఇది కాలువ మల్లయ్య గారి ఆత్మ కథలో భాగమని భావించవచ్చు.
ఈ నవలలో చిలుకయ్య ఆరేళ్లు నిండిన కొడుకును బడిలో చేర్పించడానికి దొర అనుమతి కోసం వెళ్తాడు. వెనుకబడిన బడుగు బలహీన కులాల వారు చదువుకొని ఎదగడం సహించలేని దొర ‘చాకలోడు ,,,మంగలోడు అందరు చదివితే డానికేం విలువుంటది?నా మాట విని నా కాడ ఎడ్ల కాయడానికుంచు మూడు గుంచాల మక్కలిత్త’ అని మభ్య పెద్తాడు.దొర సలహా నచ్చని చిలుకయ్య సాంబయ్యను చదివిస్తాడు.ఎన్నో అవాంతరాలు,ఉద్యమాలు అడ్డంకిగా మారిన సాంబయ్య శ్రద్ధగా చదువుకొని ప్రయోజకుడై ఉద్యోగంలో స్థిరపడ్తాడు.
గొల్లలతో హేళనగా మాట్లాడడం, తక్కువచేసి అవమానిచడం ,అయినా గొల్లలు చదువుకొని ఎదిగి జీవితాలను గెలుచుకోవడం ఈ నవలలో కనిపిస్తుంది . తెలంగాణ పల్లెల్లో దొరల అధికార దర్పం, దళిత,బహుజన కులాలను ఎడగకుండా అణచివేచిన కుటిలత్వం చూడవచ్చు. నక్సలైట్ విప్లవోద్యమాల అనంతరందొరల అధికారానికి బీటలు పారడం,దళిత , బహుజనకులాలవాళ్లు ఊపిరి పీల్చుకోవడం గమనించగలం.
‘మాట్లాడే బొమ్మలు’ నవల సాంబయ్య చదువు నవలకు కొనసాగింపు. ఎమర్జెన్సీ కాలం నుండి 1999వరకు నవలేతివృత్తం వర్తిస్తుంది. స్వాతంత్య్రం వచ్చాక దళిత బహుజన కులాల వారికి చదువుకునే అవకాశాలు రావడంతో పల్లెలనుండి కొద్దిమందైనా చదువుకొని ఉద్యోగులైనారు. అట్లా ఎదిగిన వాళ్లు పట్టణాల్లో స్థిరపడి తమ పిల్లల్ని ఇంఘ్లిష్ మీడియం లో చదివించడం ఆరంభమైనట్లు, పిల్లల చదువే తమ చదువన్నట్లు శ్రద్ధ చూపుతున్నట్లు,పిల్లలని తమ సంస్కృతి,సంప్రదాయాలకు దూరం చేస్తున్నట్లు,విద్యలో పరాయీకరణ ధోరణులు పెరిగి మానవ సంబంధాల్లో మార్పులు వస్తున్నట్లు ఈ నవల స్పష్టం చేస్తుంది.
‘ఊరంటే?’ నవలలో కాలువ మల్లయ్య ఊరి సమగ్ర స్వరూపాన్ని దర్శింప చేశారు. ఊరంటే సబ్బండ వర్ణాలు,సమస్త వృత్తి చిహ్నాలు మనుగడ సాగించేదని, వరుసలు పెట్టుకుని పిలుచుకునే ఆప్యాయత,ప్రశాంత జీవనం,కల్లా కపటం తెలియని మనుష్యులతో సంస్కృతి సాంప్రదాయాలు,ఆచార వ్యవహారాలకు నిలువుటద్దంగా గోచరించాలని పేర్కొన్నారు, ఇందులో కనిపించే పాత్రలు కులాలన్నీఒకదానిపై ఒకటి పరస్పరం ఏ విధంగా ఆధారపడి ఉంటాయో తెలియ చెప్తాయి.
‘బతుకు పుస్తకం’ 376 పేజీలతో వెలువడిన పెద్ద నవల. కాలు వ మల్లయ్య గారి దృష్టిలో బాటుకునిచ్చేది ఊరు.అందుకే ఊ రికి బతుకు పుస్తకమని నామకరణం చేసుకున్నారు, ఈ నవల గత యాభై ఏళ్ల గ్రామీణ జీవిత పరిణామాలను చిత్రించింది. గ్రామాల్లోని అగ్ర వెనుకబడిన,దళిత కులాల జీవన ప్రమాణం కాలంతో పాటు పరిణామం చెందడాన్ని సూచించింది. ఊరిలో చదువు అందుబాటులోకి వచ్చాక చదువుకున్నవారిలో కాపు లసుమయ్య కొడుకు రాజయ్య డిగ్రీ చదివి ఉద్యోగిగా స్థిరపడితే,మాలాల కులానికి చెందిన దొంత సాంబయ్య కొడుకు భూమయ్య పి.జి పూర్తిచేసి కాలేజీలో లెక్చరర్ అవుతాడు. కొండల్రావు దొర కొడుకు డిగ్రీ అయ్యాక కరీంనగర్ లో స్వంత వ్యాపారం చేస్తాడు. చదువుల వల్ల అన్నీ కులాల వారి జీవన ప్రమాణాలు పెరిగినప్పటికి ప్రపంచీకరణవల్ల గ్రామాల్లో వ్యాపార సంస్కృతి పెరగడం,సరళీకృత ఆర్థిక విధానాలవల్ల పారిశ్రామీకరణ,యాంత్రీకరణ మూలనా కుటీర పరిశ్రమలు దెబ్బతిని కులవృత్తులు ఉనికిని కోల్పోవడం, విప్లవోద్యమాల వల్ల దొరల అధికారం సన్నగిల్లి ,దొరల గడీలు శిథిలమై ఆనవాళ్ళుగా మిగలడం మొత్తం మీద గత యాబై ఏళ్లలో పల్లెల స్వరూపం పూర్తిగా మారినట్లు రచయిత స్పస్టం చేయడం జరిగింది.
‘గువ్వల చెన్నా’నవలలో మూడు తరాల పద్మశాలి కుల జీవన పరిణామాలను, వృత్తికి దూరమైన తప్పని వలసలను కాలువ మల్లయ్య గారు చిత్రించారు. ఈ నవలలో కాపు కొండయ్య కొడుకు రఘురాం వేణు గోపాల్ రెడ్డి దొర కూతురు రాజ్యలక్ష్మి హైస్కూల్ చదువుతున్నపుడే ఒకరంటే ఒకరు ఇష్టపడుతారు.ఇంజనీరింగ్ చదివిన రఘురాం ను తప్ప వేరొకరిని పెళ్లి చేసుకోనని అంటుంది,దొర పరువు కోసం రఘురాంను హత్య చేయడానికి పూనుకుంటాడు.రఘురాం బతికి ఉంటే చాలని విధిలేక తండ్రి తెచ్చిన సంబంధానికి తలొగ్గి తాళి కట్టించుకుంటుంది.రఘురాం కొన్నాళ్ళ వరకు స్తబ్ధతతో ఉండి పోతాడు. ఆతర్వాత ఇంజనీర్ గా స్థిరపడి ప్రజాసేవలో నిమగ్నుడవుతాడు.రాజ్యలక్ష్మిని కలిసాక వాస్తవం తెలుసుకొని ఆమె సూచన మేరకు పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడుతాడు.
‘చీకట్లో చిరుదీపం’నాలుగు తరాల గొల్లల జీననాన్నిప్రతిఫలిస్తుంది.ఈ నవలలో కాలువ మల్లయ్య మనోహర్ పాత్రలో కనిపిస్తే ,అతని తండ్రి పాత్రలో లసుమయ్య తాత ముత్తాతల కాలం నుండి గొర్రెలు కాస్తూ కొద్ది పాటి భూమిలో వ్యవసాయం చేస్తూ జీవిస్తారు. గొల్లేక్కిరి…ఇల్లెక్కిరి ,గొల్లని సాహి త్య విధ్య…అంటూ అవమానాలను ఎదుర్కొంటూ వచ్చిన లసుమయ్య కొడుకు ప్రయోజకుడిని చదివించి ప్రయోజకుడిని చేస్తాడు.మనోహర్ ఉద్యోగిగా స్థిరపడి ఆ తర్వాత రచయితగా ఎదిగి సామాజిక స్పృహ కలిగిన రచనలు చేస్తూ గుర్తింపు పొందుతాడు.తన పిల్లలను చదివిస్తే వారు విదేశాలలో ఉద్యోగాల్లో స్థిరపడటం జరుగుతుంది.అనాగరికులంటూఅవహేళనకు గురైన గొల్లలు చదువల్ల జీవితాల్నిగెలుచుకొంటున్నట్లు ఈ నవల స్పస్టం చేయగలిగింది.
‘నీ బాంచెన్ కాల్మోక్తా’ దళిత చైతన్యాన్ని ప్రతిఫలించే ఈ నవలను కాలువ మల్లయ్య గారు ‘నీల్ బనో గులామి చోడో ‘పేరుతో వెలువరిస్తున్నారు.నీ బాంచెన్ కాల్మోక్తా అంటూ అగ్ర వర్ణాల వద్ద చెప్పు కింది తేళ్ళాల అణగి ఉన్న వారు దళిత, విప్లవోద్యామాల చైతన్యంతో ఆత్మ విశ్వాసాన్ని ప్రోది చేసుకొని గౌరవమైన జీవితాన్ని గడపడం ఈ నవలలో చూడవచ్చు.
‘మంచియన్నది మాల అయితే ?’అనే నవలలో గ్రామాల్లో మాల మాదిగల్లో విభేధాలు సృష్టించి వాళ్ళు ఐక్యంగా ఉండకుండా దొరలు కుయుక్తులు పన్నడాన్నిఈ నవల తెలుపుతుంది.‘అస్పృశ్య కోయిల ‘నవల గత యాబై ఏళ్ళకు పైబడిన పరిణామాలతో దళిత స్త్రీ జీవితాన్ని కేంద్ర బిందువుగా చేసుకొని రాయబడింది, ఊరిలో మాల దానయ్య కూతురైన కోకిల అక్షరం ముక్క రాకపోయినా పాడితే కోకిలలా గొంతెత్తి పాడేది.వయస్సుతో వచ్చిన పొంగులతో నల్లగా కండలు తిరిగిన శరీర సౌష్టవంతో ఉండే కోకిల పట్ల ఆకర్షితులైన కుర్రకారు ఆమెను వెంటపడి వేధించే వారు .
కోకిల ఎవరిని లెక్క చేయక తనను వేధించే వారిని ‘బామ్మర్ది’అంటూ నిలదీసేది. ఊరిలో గుడి,మంచి నీళ్ళ బావి, బతుకమ్మల వద్ద అగ్రవర్ణులు పెట్టిన కట్టుబాట్లను ఎదిరించి దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెడుతుంది.లక్ష్మణ్ రావు దొర కొడుకు శ్యాంరావు కోకిలను లొంగదీసుకోవడానికి శత విధాలా ప్రయత్నం చేస్తాడు.పెళ్లి చేసుకుంటానని నమ్మించడమే కాకుండా గుడిలోకి తీసుకెళ్లి తాళి కడుతాడు.తల్లి తండ్రులను ఒప్పించి ఇంటికి తీసుకెళ్తానని చెప్పి సంబంధం పెట్టుకుంటాడు.కొద్ది రోజులకు మోజు తీరాక కోకిలను తప్పించుక తిరుగుతాడు.నక్సలైట్ విప్లవోద్యమాలు,ఆంబేద్కర్ భావ జాలం,పల్లెల్లో వ్యాప్తి చెంది దళిత, బహుజన కులాల యువకులు కోకిలకు న్యాయం జరగాలని పంచాయతీ పెట్టి దొర కోడలుగా గడిలోకి ఆమెను దగ్గరుండి పంపిస్తారు.
ఉద్యమాల తీవ్రత వల్ల లక్ష్మణ్ రావు కరీంనగర్ కు తన నివాసాన్ని మార్చగా శ్యాంరావు అక్కడ మరో యువతితో పెళ్లిచేసుకొని కోకిలను ఉంపుడుకత్తెగా జమకట్టి స్నేహితుల కామ దాహానికి బలిపశువును చేస్తాడు.మరో పదేళ్ళు గడిచాక శ్యాంరావు పెట్టే బాధలకు తట్టుకోలేక మానేర్ డ్యాంలో దూకి ఆత్మ హత్యకు పాల్పడబోయిన కోకిలను అభ్యుదయవాది గోపాలకృష్ణ కాపాడి చేరదిస్తాడు.కొద్ది రోజుల్లోనే అతని సాంగత్యంలో స్పూర్తిపొంది రాజకీయ, ఆర్థిక ,సామాజిక కార్యక్రమాల్లోచర్చలు,సెమినార్ లలో పాల్గొంటూ వేదికలపై పాడు తూ ,విశ్లేషణతో కూడిన ఉపన్యాసాలిస్తూ బడుగుల ఆశాజ్యోతిగా ఎదుగుతుంది.ఈ నవల అంతా మనోజ్ స్వగతం నుంచి ప్రవర్తిస్తుంది. రచయిత ఈ నవలలో మనోజ్ పాత్రలో కనిపిస్తాడు, తన కళ్లెదుటే జరిగిన అనుభవాలను,సన్నివేశాలను రూపుకట్టి నవలగా కూర్చివాస్తవికతను, విశ్వాసనీయతను చిత్రించగలిగాడు.
‘(డబ్బు)_తృప్తి = దుఃఖం’ నవల గ్రామాల్లో నుండి చదువుకొని ఎదిగి ఉద్యోగాలు సంపాదించిన దళిత,భాహుజన కులాల వారు పట్టణ జీవితం గడుపుతూ అధిక సంపాదన మోజులో పడి ఫైనాన్స్ లలో పెట్టుబడి పెట్టి మోసపోయి సర్వస్వం కోల్పోయి దివాళా తీయడాన్నిఈ నవల విశ్లేషించింది.శివయ్య అనే ఉద్యోగి తన జీతంలోని అధిక భాగాన్ని పెద్ద మొత్తంలో వడ్డీ వస్తుందని నమ్మి ఫైనాన్స్ లలో ,షేర్లలో పెట్టుబడి పెట్టి కూతుర్ల పెళ్లిలు చేయలేక నానా ఇబ్బందులు పడటం కనిపిస్తుంది. ‘మెతుకు పుస్తకం’ నవల రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ నేపథ్యంగా కాలువ మల్లయ్య ఈ నవల రాశారు.1970 దశకంలో ప్రారంబించబడి 80వ దశకంలో ఉత్పత్తి నిచ్చి 2002 నాటికి మూత పడే స్థితికి చేరుకోవడం వెనుకాల సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రభుత్వ నిర్ణయాలు వెరసి కార్మిక జీవితాలు సంక్షోభంలోకి నెట్టబడటం ఈ నవలలో చిత్రించడం జరిగింది.
ఈ ఎరువుల ఫ్యాక్టరీ లోనే పని చేసిన కాలువ మల్లయ్య గారు ఈ నవలలో అరుణ్ పాత్రలో కనిపిస్తారు.ఊర్లనుండి పొట్ట చేత పట్టుకొని వచ్చిన దళిత,బహుజన కులాల వారు ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ మెరుగ్గానే బతుకుతున్నామని అనుకున్నంతలో ఫ్యాక్టరీ మూత పడటం కార్మికులకు అశనిపాతమైంది.పుట్ట కొకరు చెట్టు కొకరు అన్నట్లుగా బతుకాల్సిన పరిస్థులు ఏర్పడినవి .మరో పదిహేనేళ్లు గడిచాక ఫ్యాక్టరీ మళ్ళీ ప్రారంభించనున్నారని తెలిసి తమ పిల్లలకి తిండి పెట్టగలదన్న ఆశాభావంతో కార్మికులు ఉండిపోతారు.
ఇట్లా కాలువ మల్లయ్య దళిత,బహుజన కులాల గురుంచి ఏ రచయిత రాయనంతగా రాయడం జరిగింది.వీరి అముద్రిత నవలల్లో ‘విధి వ్రాలా?’అనే నవల ఓ వైష్ణవ పూజారి జీవితంలో నెలకొన్న ఒడిదొడుకులను చిత్రించింది. ‘తపస్సు’ అనే మరో అముద్రిత నవలలో రచయిత తన సాహిత్య తపస్సును చైతన్య స్రవంతిలో చిత్రించారు.’చదువుకుంటే…?చదువుకుంటే …?’అనే అముద్రిత నవల మాతృభాషలో విద్యాబోధన ఆవశ్యకతను తెలిపేది.’అతడు మనిషిని జయించాడు’ అనే నవల ఓ దళితుడు నాయకుడిగా ఎదిగి లక్షలాది మనుషుల హృదయాలను గెలిచిన తీరు కనిపిస్తుంది. ఇంకా మరిన్ని నవలలు రాసేందుకు వేల పేజీల నోట్స్ సిద్దంగా ఉంచుకున్నారు.
కాలువ మల్లయ్య గారు ఎంచుకున్న ఇతివృత్తాలు వారి అనుభవ పరిధిలోనివి కాబట్టే వాస్తవికతతో శోభిల్లుతూ తెలంగాణ సామాజిక చరిత్రకు అద్దం పట్టేవిగా ఉంటాయి.వీరి పాత్రలన్నీ మన కు బాగా తెలిసిన వ్యక్తులు గా కనిపిస్తారు.ముఖ్యంగా వీరి ఆశు శిల్ప ధోరణి కట్టి పడేస్తుంది. ఒక ఆర్తితో ప్రాంతీయ ముద్రతో ,తెలంగాణ మాండలికానికి వన్నె తెచ్చిన ఘనత కూడా వీరిదే.