Friday, November 22, 2024

కొత్త పాలసీ నచ్చకపోతే వాట్సాప్‌లో చేరవద్దు: ఢిల్లీ హైకోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తీసుకొచ్చిన నూతన ప్రైవసీ పాలసీ ఐచ్ఛికమని, వాట్సాప్ కొత్త నియమ నిబంధనలను అంగీకరించని వారు అందులో చేరాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది. అదో ప్రైవేట్ యాప్. అందులో చేరకండి. చేరడం చేరకపోవడం ఐచ్ఛికం. కొత్త నియమనిబంధనలు ఆమోదయోగ్యం కాకపోతే ఆ యాప్‌లో చేరకండి. వేరే యాప్‌ను వాడుకోండి అంటూ జస్టిస్ సంజీవ్ సచ్‌దేవ పిటిషనరుకు సూచించారు. ప్రస్తుతం మే నెలకు వాయిదా పడిన వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ అమలును సవాలు చేస్తూ దాఖలైన ఒక పిటిషన్‌పై సోమవారం ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. చాలావరకు మొబైల్ యాప్‌లకు చెందిన నియమ నిబంధనలు చదివితే మీరు అంగీకరిస్తున్న షరతులు తెలుసుకుని ఆశ్చర్యపోతారని కూడా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

గూగుల్ మ్యాప్స్ కూడా మీ డాటా అంతటినీ బంధించి భద్రపరుచుకుంటుందని జస్టిస్ సంజీవ్ అభిప్రాయపడ్డారు. పిటిషనర్ చెబుతున్న ప్రకారం ఎటువంటి డాటా లీక్ అవుతుందో తమకు అర్థం కావడం లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని లోతుగా పరిశీలించవలసి ఉన్నందున కేసు తదుపరి విచారణను జనవరి 25వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. ఈ సమస్యను లోతుగా విశ్లేషించవలసి అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం కూడా కోర్టుతో ఏకీభవించింది. కాగా.. వాట్సాప్, ఫేస్‌బుక్ తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ముకుల్ రోహత్గి వాదిస్తూ పిటిషనర్ లేవనెత్తుతున్న అనేక అంశాలకు ఎటువంటి ఆధారాలు లేవని తెలిపారు. కుటుంబసభ్యులు, మిత్రులు పంపుకునే ప్రైవేట్ సందేశాలు గతంలో మాదిరిగానే గోప్యంగా ఉంటాయని, వాటిని వాట్సాప్ భద్రపరచదని వారు తెలిపారు. కొత్త విధానం కింద వీటిలో ఎటువంటి మార్పు ఉండబోదని కూడా వారు తెలిపారు. వాట్సాప్‌లో జరిగే బిజినెస్ చాట్స్(వ్యాపార సందేశాలు)పైనే కొత్త విధానం ప్రభావం ఉంటుందని వారు చెప్పారు.

Don’t Join WhatsAPP If not accepting New Policy: Delhi HC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News