ఉదయం 10గం.కు ప్రగతిభవన్ నుంచి బేగంపేటకు బయలుదేరి హెలీకాప్టర్‌లో 11గం.కు మేడిగడ్డ లక్ష్మిబ్యారేజీకి చేరుకోనున్న ముఖ్యమంత్రి కెసిఆర్
నీటి పారుదల అధికారులతో సమీక్ష నిర్వహించి మధ్యాహ్నం 3గం.కు హైదారాబాద్‌కు తిరుగు ప్రయాణం
మనతెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేడు కాళేశ్వరం పర్యటనకు వెళ్లనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు హెలీక్యాప్టర్‌లో సిఎం కెసిఆర్ నేరుగా మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తారు. అనంతరం ఏరియల్ సర్వే చేస్తారు. మేడిగడ్డ దగ్గర నీటి మట్టం వంద అడుగులకు చేరుకుంది. ఐదు నెలల విరామం అనంతరం ఈ బ్యారేజీ నుంచి ఎత్తిపోతల ట్రైల్ రన్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం లింక్ 1, లింక్ 2లో మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. ఈ పనులను క్షేత్రస్థాయిలో సిఎం కెసిఆర్ సమీక్షించనున్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న మేడిగడ్డబ్యారేజ్ను సమీక్షిస్తారు. కాళేశ్వరం దగ్గర గోదావరిలో ప్రాణహిత కలిసే ప్రాంతానికి ఎగువన మేడిగడ్డ బ్యారేజ్‌ను నిర్మించారు. రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు డిజైన్చేసి 1.67 కిలోమీటర్ల పొడవు బ్యారేజ్‌ను పూర్తి చేశారు.
దీనికి 85 గేట్లను అమర్చి కుడి, ఎడమ వైపున కరకట్టలు కట్టారు. ఈ కరకట్టల్లో కుడివైపు తెలంగాణనకు 6.30 కిలోమీటర్లు, ఎడమ వైపు ఉన్న మహారాష్ట్ర వైపు 11.7 కిలో మీటర్లు కరకట్టల నిర్మాణం పూర్తి అయింది. పూర్తి అయిన ఈ పనులను సిఎం కెఎసిఆర్ ఏరియల్ సర్వేద్వారా పర్యవేక్షిస్తారు. ఇదిలా ఉండగా బేగంపేట విమానాశ్రయం నుంచి హెలిక్యాప్టర్‌లో నీటిపారుదల శాఖ అధికారులు ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టుకు బయలు దేరుతారు. ఆనంతరం ఉదయం 10గంటలకు సిఎం కెసిఆర్ ఫాంహౌజ్ నుంచి నేరుగా హెలిక్యాప్టర్‌లో కాళేశ్వరం చేరుకుంటారు.
CM KCR to visit Kaleshwaram Project on Jan 19