న్యూఢిల్లీ : స్కూలుకు వెళ్లే పిల్లలకు కరోనా స్వల్ప లక్షణాలున్నా వారు కుటుంబం లోని తల్లిదండ్రులకు, ఇతరులకు ఈ వైరస్‌ను సంక్రమింప చేస్తారని, అందువల్ల ముక్కు ద్వారా వారికి టీకా ఇవ్వడం చాలా సులువని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా బుధవారం సూచించారు. ఇప్పుడు వస్తున్న వ్యాక్సిన్లు పిల్లలకు అనుమతించడం లేదని, ఈమేరకు పిల్లలపై అధ్యయనం జరగడం లేదని ఆయన అన్నారు. పిల్లలకు వ్యాక్సిన్లు త్వరలో వస్తాయని, ముక్కు ద్వారా ఇచ్చే టీకా అనుమతి కోసం భారత్ బయోటెక్ ప్రయత్నిస్తోందని,తరగతి లోని పిల్లలందరికీ అరగంటలో ఈ టీకా ఇవ్వవచ్చని చెప్పారు. ముక్కు ద్వారా ఇచ్చే టీకా ఇంజెక్షన్ కాదని, స్ప్రే అని అందుకే పిల్లలకు ఇవ్వడం సులభమౌతుందని తెలిపారు.
నేషనల్ డైసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డిఆర్ఎఫ్) 16 వ వ్యస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన ఎన్డిఆర్ఎఫ్ అధికారులతో ఆయన మాట్లాడారు. ఎవరైతే కరోనా వైరస్ బాధితులో వారు కోలుకున్నప్పటికీ నాలుగు నుంచి ఆరు వారాల తరువాత వ్యాక్సినేషన్ పొందవలసి ఉంటుందని సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఛీఫ్ సైంటిస్ట్ సౌమ్యస్వామినాధన్ ఆన్లైన్ ద్వారా ఈ అధికార సిబ్బందిని ఉద్దేశిస్తూ ప్రజారోగ్య అత్యవసర సేవల కోసం మెరుగైన డిజిటల్ సర్వేలెన్స్ సిస్టమ్‌ను తప్పనిసరిగా ప్రవేశ పెట్టాలని సూచించారు.