న్యూఢిల్లీ: ఆధార్ బిల్లుకు అనుకూలంగా 2018లో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వేసిన సమీక్ష పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. జస్టిస్ ఎఎం ఖాన్‌విల్కర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం 4:1మెజారిటీతో రివ్యూ పిటిషన్లను తిరస్కరించింది. మెజారిటీ నిర్ణయంతో జస్టిస్ డివై చంద్రచూడ్ విభేదించారు. మనీ బిల్లుగా కేంద్ర ప్రభుత్వం దీనికి ఆమోదం పొందిన తీరుపై విచారణకు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తన అసమ్మతి తీర్పులో చంద్రచూడ్ పేర్కొన్నారు. 2018, సెప్టెంబర్ 26న అప్పటి చీఫ్ జస్టిస్ దీపక్‌మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆధార్ బిల్లుపై 4:1 మెజారిటీతో తీర్పు వెల్లడించింది.
ఆ ధర్మాసనంలోనూ ఉన్న జస్టిస్ చంద్రచూడ్ తన అసమ్మతిని అప్పుడూ పేర్కొన్నారు. ఆధార్ బిల్లుకు 2018లో ఆమోదం తెలిపిన సుప్రీంకోర్టు అందులోని కొన్ని నిబంధనలను తొలగించిందన్నది గమనార్హం. ఆధార్‌ను బ్యాంక్ ఖాతాలు, మొబైల్ ఫోన్లు, విద్యా సంస్థల్లో ప్రవేశానికి లింక్ పెట్టడాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆధార్‌ను మనీ బిల్లుగా లోక్‌సభ నుంచి ఆమోదం పొందిన మోడీ ప్రభుత్వం, రాజ్యసభ ఆమోదం తీసుకోకుండానే చట్టంగా తెచ్చింది.