మిగిలిన పోస్టులకు దశల వారిగా నోటిఫికేషన్లు- సంస్థ సిఎండి శ్రీధర్
హైదరాబాద్ : సింగరేణి సంస్థ భర్తీ చేయనున్న ఉద్యోగాలలో తొలివిడతగా 372 పోస్టులకు సంబంధించిన నోటీఫికేషన్‌ను గురువారం విడుదల చేసింది. మిగిలిన పోస్టులకు నోటీఫికేషన్లను దశల వారీగా విడుదల చేస్తామని ఆ సంస్థ సిఎండి ఎన్.శ్రీధర్ తెలియజేశారు. కేవలం రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా మాత్రమే అభ్యర్ధుల ఎంపిక ఉంటుందన్నారు.
మొదటి నోటిఫికేషన్‌లోని ఉద్యోగల వివరాలు
గురువారం విడుదల చేసిన తొలి ఉద్యోగ నోటిఫికేషన్‌లో 7 రకాల ఉద్యోగాలకు సంబంధించి 372 పోస్టుల భర్తీకి సింగరేణి ధరఖాస్తులను ఆహ్వానించింది. వీటిలో 305 పోస్టులను లోకల్ వారికి అనగా సింగరేణి విస్తరించి ఉన్న ఉమ్మడి జిల్లాలైన కరీంనగర్, అదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన అభ్యర్ధులకు కేటాయించారు. (ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 16 జిల్లాలుగా విభజించబడిన విషయం తెలిసినదే). ఇక అన్ రిజర్వుడ్ గా కేటాయించబడిన 67 పోస్టులకు యావత్ తెలంగాణా జిల్లాలకు చెందిన వారందరూ అర్హులేనని వెల్లడించింది. పై ఉద్యోగాలకు సంబంధించిన వయోపరిమితి, విద్యార్హతలు, జీతభత్యాలు, ఫీజు చెల్లింపు మొదలైన వివరాలను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వెబ్ సైట్ (www.scclmines.com)లోకి వెళ్లి అక్కడ హోం పేజీలో గల career లింక్‌ను ఓపెన్ చేసి తెలుసుకోవచ్చునని తెలిపింది.
ఆన్ లైన్ ద్వారానే ధరఖాస్తు చేయాలి
అర్హులైన అభ్యర్ధుందరూ ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నాం 3 గంటల నుండి ఫిబ్రవరి 4వతేదీ సాయంత్రం 5 గంటల వరకూ ఆన్ లైన్ ద్వారా సింగరేణి వెబ్ సైట్ లోని కేరీర్ లింకు నుండి తమ ధరఖాస్తులు సమర్పించవలసి ఉంటుంది. ఈ ధరఖాస్తులతో పాటు తమ అర్హత సర్టిఫికెట్లను ఆన్ లైన్ లో ఆప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. కనుక ఎవరూ తమ ధరఖాస్తు హార్డు కాపీలను సింగరేణి రిక్రూట్ మెంట్ విభాగానికి పంపవద్దని అధికారులు తెలియజేస్తున్నారు. ఆన్ లైనులో ధరఖాస్తు చేస్తున్న సమయంలోనే ఇవ్వబడిన ఎస్.బి.ఐ. లింకు ద్వారా 200 రూపాయల ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. అన్ని ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమతి 30 సంవత్సరాలు కాగా ఎస్‌సి, ఎస్‌టి, బిసి కులాల వారికి 5 సంవత్సరాల వరకూ సడలింపు ఉంటుందని రిక్రూట్ మెంట్ విభాగం వారు తెలియజేస్తున్నారు. అయితే ఇంటర్నల్ అభ్యర్ధులకు వయో పరిమితి నిబంధన వర్తించదు. అలాగే పరీక్ష ఫీజు కూడా చెల్లించవలసిన అవసరం లేదు.
ప్రతిభనే నమ్ముకోండి… పైరవీలకు తావులేదు
సింగరేణి నిర్వహిస్తున్న ఉద్యోగ నియామకాలు తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు, ముఖ్యంగా సింగరేణి విస్తరించి ఉన్న ఉమ్మడి అదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలోని తగిన అర్హతలు గల నిరుద్యోగులకు ఒక సువర్ణ అవకాశమనీ దీనిని సద్వినియోగం చేసుకోవాలని సింగరేణి సంస్థ ఛైర్మన్, ఎండి శ్రీధర్ తెలియజేశారు. నియామక ప్రక్రియలో కేవలం రాత పరీక్ష ద్వారానే ఎంపిక ఉంటుందని, ఇంటర్వ్యూలు అనేవి ఉండవనీ, పైరవీలు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎవరు చెప్పినా అది పచ్చి బూటకమని, కనుక నిరుద్యోగులెవరూ ఇటువంటి మోసకారు మాటలను నమ్మవద్దని ఆయన హెచ్చరించారు. ఈ విధంగా ఎవరైనా ప్రలోభపెడుతున్నట్లు దృష్టికి వస్తే సింగరేణి విజిలెన్సు శాఖకు తెలియజేయాలని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకొంటామని తెలిపారు.
r 372 jobs in first installment in Singareni