ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు కూడా..
న్యూఢిల్లీ: కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా రెండవ దశలో ప్రధాని నరేంద్ర మోడీ టీకా వేయించుకుంటారు. ఆయనతోపాటు ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా రెండో దశలో టీకా వేయించుకుంటారని వర్గాలు తెలిపాయి. ఈ నెల 16న ప్రారంభమైన కరోనా వ్యాక్సినేషన్ తొలి దశలో కొవిడ్‌పై పోరులో ఫ్రంట్‌లైన్‌లో ఉన్న డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు మొదలైనవారికి టీకా వేసే ప్రక్రియ జరుగుతోంది. వీరికి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూపొందించిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ టీకాలు వేస్తున్నారు. కొన్ని చోట్ల వ్యాక్సిన్ తీసుకున్నవారు అస్వస్థతకు గురికావడంతో వాక్సిన్ తీసుకోవడానికి హెల్త్ వర్కర్లు వెనుకాడుతున్న కారణంగా అనేక రాష్ట్రాలు తమ లక్ష్యాలను చేరుకోలేకపోతున్నాయి.
కాగా.. రెండో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియలో 50 సంవత్సరాలు పైబడిన వారు, వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్న వారు టీకా వేయించుకోవలసి ఉంటుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందు ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ వ్యాక్సినేషన్ కోసం తొందరపడవద్దని, రెండో దశలో మీకు అవకాశం వస్తుందని స్పష్టం చేశారు. అయితే..ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులను ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌గా పరిగణించి వారికి కూడా మొదటి దశలోనే టీకా వేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని హర్యానా, బీహార్, తెలంగాణ తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానికి సూచించారు. అయితే..వరుస క్రమాన్ని తప్పవద్దని ప్రధాని వారికి కఠినంగా చెప్పినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా..ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియగా భావిస్తున్న భారత్‌లో కొన్ని చోట్ల దుష్ప్రభావాల కారణంగా టీకా వేయించుకోవడానికి నిరాసక్తత వ్యక్తమవుతుండడంతో ఆశించిన లక్ష్యాలను చేరుకోవడం కొన్ని రాష్ట్రాలు వెనుకపడుతున్నాయి. టీకా వేయించుకోవడానికి అయిష్టత కనబరుస్తున్న హెల్త్ వర్కర్లు తమ సామాజిక బాధ్యతను విస్మరించినట్లుగా భావించాల్సి ఉంటుందని వ్యాక్సిన్ ప్రక్రియ అమలుకు సంబంధించిన వ్యూహ రచనపై ప్రభుత్వం నియమించిన కమిటీకి సారథ్యం వహిస్తున్న నీతి ఆయోగ్ సభ్యుడు వికె పాల్ చేసిన వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ప్రపంచమంతా వ్యాక్సిన్ కోసం ఆరాటపడుతుంటే మన హెల్త్‌కేర్ వర్కర్లు, డాక్టర్లు, నర్సులు మాత్రం టీకా వేయించుకోవడానికి నిరాకరించడం విచారకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మహమ్మారి ఏ పరిస్థితికి దారితీస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదని, పరిస్థితిని అర్థం చేసుకుని హెల్త్ వర్కర్లు టీకా వేయించుకోవాలని ప్రభుత్వం తరఫున తాను అర్థిస్తున్నానని పాల్ అన్నట్లు రాయ్‌టర్స్ వార్తా సంస్థ పేర్కొంది.