నాన్న వల్లే ఈ స్థాయికి
ఆయన లేని లోటు పూడ్చలేనిది, ఆస్ట్రేలియా ప్రదర్శన తండ్రికి అంకితం
టీమిండియా యువ క్రికెటర్ సిరాజ్
మన తెలంగాణ/హైదరాబాద్: నిరూపేద కుటుంబంలో పెరిగినా తాను అంతర్జాతీయ స్థాయి క్రికెటర్‌గా ఎదిగానంటే దానికి తన తండ్రే కారణమని, ఆయన లేని లోటు పూడ్చలేనిదని టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్, హైదరాబాది సంచలనం మహ్మద్ సిరాజ్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో చిరస్మరణీయ ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన సిరాజ్ గురువారం సొంత నగరం హైదరాబాద్ చేరుకున్నాడు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సిరాజ్‌కు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడిన సిరాజ్ తన తండ్రి మహ్మద్ గౌస్ సేవలను గుర్తు చేసుకుని కన్నీళ్ల పర్యంతరం అయ్యాడు. తాను నేడు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి తండ్రి అందించిన ప్రోత్సహమే కారణమన్నాడు. తన ఎదుగుదలలో తండ్రిట్చాలా కీలకమన్నాడు. పేదరికం వెంటాడుతున్నా తనలోని ప్రతిభను గుర్తించిన తండ్రి తనకు తగిన శిక్షణ ఇప్పించాడన్నాడు. ఆయన అందించిన ప్రోత్సహం, సహకారం వల్లే తాను మంచి క్రికెటర్‌గా ఎదిగానన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడే తండ్రి మరణ వార్త తెలియడంతో ఎంతో బాధకు గురయ్యానన్నాడు. ఈ సమయంలో తన తండ్రి ఆశయం గుర్తొచ్చి ఆస్ట్రేలియాలోనే ఉండిపోయానన్నాడు. తాను టెస్టు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తే చూడాలన్నది తన తండ్రి ఆశయంగా ఉండేదన్నాడు. ఆయన ఆశయ సాధన కోసమే తాను ఆస్ట్రేలియాలో ఉండిపోయానన్నాడు. ఇక తీవ్ర దుంఖఃలోనూ తన తల్లి తనకు ధైర్యం చెప్పిందని, ఆమె చెప్పిన మాటలు తనలో ధైర్యాన్ని నింపాయని సిరాజ్ పేర్కొన్నాడు. ఆక నాన్న కలను సాకారం చేయాలనే ఉద్దేశంతోనే ఆస్ట్రేలియా సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేశానన్నాడు. ఇదే సమయంలో ప్రతి క్షణం నాన్నను గుర్తు చేసుకుని చాలా సార్లు కన్నీళ్లు పెట్టుకున్నానని తెలిపాడు. తండ్రిని కోల్పోవడం తన జీవితంలోనే అత్యంత బాధకమరమని అంశమన్నాడు. ఆయన భౌతికంగా తమ మధ్య లేకున్నా ఆయన అందించిన ప్రోత్సహం, చేసిన త్యాగం ఎల్లప్పుడూ అలాగే ఉండిపోతుందన్నాడు.
ఆయనకే అంకితం
ఇక ఆస్ట్రేలియా సిరీస్‌లో నిలకడైన ప్రదర్శన చేయడం చాలా ఆనందం కలిగించిందన్నాడు. ఈ ప్రదర్శన తన తండ్రికి అంకితం చేస్తున్నట్టు ప్రకటించాడు. మరోవైపు ఆస్ట్రేలియాపై తన ప్రదర్శన ఎంతో సంతృప్తి ఇచ్చిందన్నాడు. తనపై నమ్మకం ఉంచి తుది జట్టులో స్థానం ఇచ్చిన కెప్టెన్ అజింక్య రహానెకు, ప్రధాన కోచ్ రవిశాస్త్రికి కృతజ్ఞతలు తెలిపాడు. ఇక సీనియర్లు అశ్విన్, బుమ్రా, ఉమేశ్‌లు ఇచ్చిన సలహాలు, సూచనలు మరువలేనివన్నాడు. తన కెరీర్ ఎదుగుదలలో హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిల పాత్ర కూడా ఉందన్నాడు. క్లిష్ట సమయాల్లో వారిద్దరూ తనను వెన్నుతట్టి ప్రోత్సహించారన్నాడు. ఇక చివరి టెస్టులో తాను తీసిన లబుషేన్ వికెట్ సిరీస్‌లోనే చాలా ప్రత్యేకమైందన్నాడు. కీలక సమయంలో అతన్ని ఔట్ చేయడంతో మ్యాచ్ తమ చేతుల్లోకి వచ్చిందన్నాడు. చివరి టెస్టులో ఒక్క సీనియర్ బౌలర్ కూడా లేకుండానే బరిలోకి దిగడంతో కాస్త ఒత్తిడికి లోనయ్యామన్నాడు. అయితే కెప్టెన్ రహానె తమలో ధైర్యం నింపాడన్నాడు. ఇక పుజారా, రోహిత్ వంటి సీనియర్లు ఇచ్చిన సలహాలు తమకు ఎంతో పనికొచ్చాయని సిరాజ్ వివరించాడు.
వైదొలగాలని అంపైర్ సూచించినా
మరోవైపు సిడ్నీ టెస్టు మ్యాచ్ సందర్భంగా కొంత మంది ఆస్ట్రేలియా అభిమానులు తనపై జాత్యంహకార వ్యాఖ్యలు చేయడం చాలా బాధకు గురి చేసిందన్నాడు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న తనపై కొంత మంది అభిమానులు వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేశారన్నాడు. ఈ విషయాన్ని అంపైర్లు, కెప్టెన్ రహానె దృష్టికి తీసుకెళ్లానన్నాడు. ఇక ఇదే సమయంలో క్రికెట్ ఆస్ట్రేలియాకు చెందిన కొంత మంది అధికారులు వచ్చి అభిమానులను వారించారన్నాడు. అయినా కొంతమంది తమ పద్ధతి మార్చుకోలేదన్నాడు. ఇక వారి ప్రవర్తనతో విసిగి పోయిన అంపైర్లు కూడా తమను మైదానం విడిచి వెళ్లిపోవాలని సలహా ఇచ్చారన్నాడు. అయితే కెప్టెన్ రహానె మాత్రం ఆటను కొనసాగించేందుకే మొగ్గు చూపాడన్నాడు. ఇక ఆస్ట్రేలియా అభిమానుల తీరు తనతో పాటు జట్టు ఆటగాళ్లను చాలా వేదనకు గురి చేసిందని సిరాజ్ వాపోయాడు.
ఘన స్వాగతం
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సిరాజ్‌కు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది. వందలాది మంది అభిమానులు స్టేడియం వద్దకు చేరుకుని సిరాజ్‌కు స్వాగతం పలికారు. ఇదే సమయంలో సిరాజ్‌తో ఫొటోలు దిగేందుకు, అతని ఆటోగ్రాఫ్ తీసుకునేందుకు ఉత్సాహం చూపించారు. హైదరాబాద్ క్రికెట్ సంఘానికి చెందిన అధికారులు స్వాగత ఏర్పాట్లు చేశారు.
నేరుగా తండ్రి సమాధి వద్దకు
ఇక ఎయిర్‌పోర్ట్ నుంచి సిరాజ్ నేరుగా తన తండ్రి సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించాడు. ఈ సందర్భంగా సిరాజ్ ప్రత్యేక ప్రార్థనలు చేశాడు. తండ్రి సమాధిపై పుష్పగుచ్చం ఉంచి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్తించాడు. ఇక తండ్రి సమాధి వద్దకు చేరుకున్న సిరాజ్ భావోద్వేగానికి గురయ్యాడు. తండ్రిని గుర్తు చేసుకుని బోరున విలపించాడు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో భేటి
ఇదిలావుండగా సిరాజ్ గురువారం రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నాడు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించిన విషయాలను సిరాజ్ మంత్రితో పంచుకున్నాడు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆస్ట్రేలియా పర్యటనలో సిరాజ్ చేసిన ప్రదర్శనపై ప్రసంశలు గుప్పించారు. అంతేగాక సిరాజ్‌ను ఘనంగా సత్కరించారు. రానున్న రోజుల్లో ఇలాగే మెరుగైన ప్రదర్శన చేయాలని ఆకాంక్షించారు.
Cricketer Mohammed Siraj Press Meet