న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలను ఏడాదిన్నర నిలిపివేస్తామనే ప్రభుత్వ ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి. చట్టాల పూర్తి స్థాయి రద్దే తమ ఏకైక ప్రధాన డిమాండ్ అని దీని విషయంలో తిరుగులేదని రైతులు కేంద్రానికి గురువారం తేల్చిచెప్పారు. బుధవారం రైతు సంఘాల నేతలు కేంద్ర మంత్రుల బృందం మధ్య 10వ దఫా చర్చలు జరిగాయి. ఇందులోనే చట్టాలను ఏడాది లేదా ఏడాదిన్నర పాటు నిలిపివేస్తామని, ఓ కమిటీ ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించుకుందామని రైతు సంఘాల ముందు కేంద్రం ప్రతిపాదన తీసుకువచ్చింది. అయితే దీని గురించి అంతర్గతంగా ఆలోచించుకుని చెపుతామని రైతు నేతలు తెలిపారు. గురువారం రైతు సంఘాల మధ్య సుదీర్ఘ స్థాయిలో ఈ అంశంపై సమాలోచనలు సాగాయి. సంయుక్త కిసాన్ మోర్చా పూర్తిస్థాయి సర్వసభ్య సమావేశం (40 రైతు సంఘాల ఏకీకృత సంస్థ) చట్టాల రద్దుకు మొగ్గుచూపింది. భేటీ తరువాత తమ నిర్ణయాన్ని తెలిపే ప్రకటన వెలువరించింది. చట్టాల వాయిదా పరిష్కారం కాదని, పూర్తిస్థాయిలో వీటిని రద్దు చేయడం కీలకం అని, అప్పుడే ఇన్ని రోజుల నిరసనలకు అర్థం ఉంటుందని రైతు సంఘాలు అభిప్రాయపడ్డాయి. నిరసనలలో ఉన్న తోటి రైతుల అభిప్రాయాలను సగటుస్థాయిలో తెలుసుకున్నాయి.
తరువాత చట్టాల పూర్తిస్థాయి రద్దు విషయాన్ని నిర్ణయించుకున్నాయి. ట్రాక్టరు ర్యాలీ ఇతర నిరసనలు సాగుతాయని రైతు నేతలు తెలిపారు. ట్రాక్టరు ర్యాలీని ఏదో విధంగా దెబ్బతీసేందుకే కేంద్రం ఆకస్మికంగా చట్టాల వాయిదా ప్రతిపాదన తీసుకువచ్చిందని, ఇది కేవలం ఉద్యమాన్ని నీరుగార్చే యత్నాల్లో భాగమని రైతు నేతలు కొందరు అభిప్రాయపడ్డారు. శుక్రవారం రైతులు కేంద్రం మధ్య 11వ దఫా చర్చల సందర్భంగా ప్రత్యక్షంగా రైతు నేతలు కేంద్రానికి తమ నిర్ణయాన్ని తెలియచేస్తారు. చట్టాల పూర్తి రద్దు నిర్ణయం తీసుకుంటేనే తాము శాంతిస్తామని, కేంద్రం ప్రతిపాదనలకు సమ్మతిస్తామని తేల్చిచెప్పాలని నిర్ణయించుకున్నారు. దీనితో 11వ దఫా చర్చల ఫలితం ఏ విధంగా ఉంటుందనేది కీలకంగా మారింది. చట్టాల రద్దు, మద్దతు ధరలకు చట్టబద్ధత ప్రధాన అంశాలని ఇందులో వెనకకు పొయ్యేది లేదని గురువారం నాటి తమ అంతర్గత చర్చలలో ఈ మేరకు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు రైతుల నేత జోగిందర్ ఎస్ ఉగ్రహన్ విలేకరులకు తెలిపారు. సుప్రీంకోర్టే చట్టాలను తదుపరి ఆదేశాల వరకూ నిలిపివేసిందని, ఇప్పుడు కేంద్రం చెపుతున్నదేమిటని ప్రశ్నించారు.
Farmer Unions reject Govt Proposal to put laws on hold