సివిల్ సర్వీసెస్ అభ్యర్థులపై సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
న్యూఢిల్లీ: కరోనా కారణంగా యుపిఎస్‌సి గత ఏడాది నిర్వహించిన సివిల్ సర్వీస్ పరీక్షల్లో తమ చివరి ప్రయత్నంలో పరీక్ష రాయలేకపోయిన అభ్యర్థులకు మరో అవకాశం ఇవ్వడానికి తాను అనుకూలంగా లేనని కేంద్రం శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. సిబ్బంది వ్యవహారలు, శిక్షణ విభాగం( డిఒపిటి) తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వి రాజు చేసిన ఈ ప్రకటనను జస్టిస్ ఎఎం ఖన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం పరిగణనలోకి తీసుకొంది. ‘ మరో అవకాశం ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము. అఫిడవిట్ దాఖలు చేయడానికి నాకు సమయం ఇవ్వండి. మేము సుముఖంగా లేమంటూ గత రాత్రి నాకు ఆదేశం అందింది’ అని న్యాయమూర్తులు బిఆర్ గవాయి, కృష్ణ మురైలు కూడా ఉన్న బెంచ్‌కి తెలియజేశాయి. దీంతో బెంచ్ రచనా సింగ్ అనే అభ్యర్థిని దాఖలు చేసుకున్న పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేస్తూ, ఈ లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని, దాన్ని ప్రతివాదులకు అందజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.
కాగా చివరి సారిగా యుపిఎస్‌సి పరీక్ష రాయలేకపోయిన సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు మరో అవకాశం ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ఇంతకు ముందు సొటిసిటర్ జనరల్ తుషార్ మెహతా న్యాయస్థానానికి తెలియజేశారు. కరోనా మహమ్మారి, వివిధ రాష్ట్రాల్లో వరదల కారణంగా గత అక్టోబర్ 4న నిర్వహించిన యుపిఎస్‌సి సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేయడానికి సుప్రీంకోర్టు సెప్టెంబర్ 30న నిరాకరించింది. అయితే వయో పరిమితి పెంపు కారణంగా 2020లో తమ చివరి ప్రయత్నంగా పరీక్ష రాయబోతున్న అభ్యర్థులకు అదనపు అవకాశాన్ని ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, యుపిఎస్‌సిని ఆదేశించింది. దీనిపై డిఓపిటి అధికారికంగా ఒక నిర్ణయం తీసుకుంటుందని అప్పట్లో కోర్టుకు తెలియజేశారు.