దుబాయ్: యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులతో ఏళ్ల తరబడి యుద్ధం సాగుతున్న నేపథ్యంలో తమ రాజధాని రియాధ్‌పై జరిగిన క్షిపణి లేదా డ్రోన్ దాడిని భగ్నం చేసినట్లు సౌదీ అరేబియా శనివారం ప్రకటించింది. రియాధ్ నగరం గగనతలంలో ఒక విస్ఫోటానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్ట్ చేశారు. కాగా.. తమ రాజధానిపై జరిగిన దాడిని భగ్నం చేసినట్లు సౌదీ అరేబియా పాలకులు ధ్రువీకరించినట్లు సౌదీ ప్రభుత్వ టివి తెలిపింది. అయితే..రియాధ్‌పై క్షిపణి లేదా డ్రోన్ దాడికి సంబంధించి హౌతీల నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. యెమెన్ రాజధాని సనాను హౌతీలు 2014 సెప్టెంబర్ నుంచి తమ అధీనంలో ఉంచుకున్నారు. అంతర్జాతీయంగా గుర్తించిన యెమెన్ ప్రభుత్వానికి మద్దతుగా సౌదీ అరేబియా తన మిత్రదేశాలతో కలసి 2015 మార్చిలో హౌతీలపై యుద్ధం ప్రారంభించింది. ఏళ్ల తరబడి ఈ వివాదం కొనసాగుతోంది.
Missile Intercepted over Riyadh: Saudi Govt