న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) ఎంఎల్ఎ, మాజీమంత్రి సోమ్‌నాథ్ భారతికి రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ స్థానిక కోర్టు తీర్పు ఇచ్చింది. 2016లో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో భద్రతా సిబ్బందిపై దాడికి పాల్పడి, హాస్పిటల్ ఆస్తులకు నష్టం కలిగించారని సోమ్నాథ్పై కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రవీంద్రకుమార్పాండే శనివారం తీర్పు వెల్లడించారు. సోమ్‌నాథ్‌కు రూ.లక్ష జరిమానా కూడా విధించారు. తీర్పుపై హైకోర్టుకు వెళ్లేందుకు సోమ్‌నాథ్‌కు అవకాశం కల్పిస్తూ బెయిల్ మంజూరు చేశారు. 2016, సెప్టెంబర్ 9న ఎయిమ్స్ ప్రహరీ గోడను జెసిబితో కూల్చిన ఘటన జరిగింది. ఎయిమ్స్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆర్ఎస్ రావత్ ఫిర్యాదు మేరకు సోమ్‌నాథ్ సమక్షంలోనే ఇది జరిగినట్టు కేసు నమోదైంది. అడ్డుపడ్డ భద్రతా సిబ్బందిపై సోమ్నాథ్తోపాటు ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. న్యాయ వ్యవస్థ పట్ల తమకు గౌరవం ఉన్నదని, అయితే సోమ్‌నాథ్ విషయంలో అన్యాయం జరిగినట్టు భావిస్తున్నామని, పై కోర్టులో ఆయనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉన్నదని ఆప్ వ్యాఖ్యానించింది.
Delhi Court sentenced Jail to AAP MLA for 2 years