Sunday, November 24, 2024

మనది పరిణత ప్రజాస్వామ్యమేనా?

- Advertisement -
- Advertisement -

72nd Republic Day celebrations in India

 

మనం నేడు 74 ఏండ్ల స్వతంత్ర దేశంలో 72 వ గణతంత్ర వేడుకలు సంతోషంగా ఘనంగా జరుపుకుంటున్నాం… దేశ జనాభా 135 కోట్లు దాటిపోతోంది.. ప్రపంచ దేశాల్లో రెండవ స్థానంలో ఉంది. దేశ సంస్కృతి మహోన్నతంగా ఉంది. గౌరవ మర్యాదలు ప్రపంచానికే ఆదర్శంగా ఉన్నాయి. మౌలిక వసతులు పుష్కలంగా ఉన్నాయి. ప్రపంచ దిగ్గజ స్థాయి కంపెనీలు మన దేశానికే స్వంతం. ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ఉద్యోగాలు కోకొల్లలుఉన్నాయి. అంతరిక్ష పరిశోధనలో ఉపగ్రహ ప్రయో గాలలో ప్రపంచ దేశాలతో పోటా పోటీగా ఉన్నాం. దాదాపు 20 లక్షల సైన్యంతో దైర్యంగా వున్నాం. మరెన్నో లక్షల కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలతో పటిష్ట ఆంతరంగిక భద్రతతో ఉన్నాం.దీనితో ఎంతో మంది విదేశీ విద్యార్థులు భారత్ లో విద్యను అభ్యసి స్తున్నారు. స్కిల్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టరప్ ఇండియా, స్వచ్చ భారత్, ఈజీ ఆప్ డూయింగ్ బిజినెస్, బేటీ బచావో బేటీ పడావో లాంటి అద్భుత పథకాలు. 107 కోట్ల మొబైల్ ఫోన్లు, 37 కోట్ల స్మార్ట్ ఫోన్లు, 75 కోట్ల డిజిటల్ కార్డులు, 147 కోట్ల బ్యాంకు ఖాతాలతో ఇండియా వెలిగి పోతుంది,అభివృద్దిలో అంటూ దూసుకొ పోతుంది ఇండియా అంటున్నాం.

ప్రజల కొరకు, ప్రజల చేత ప్రజలే ఎన్నుకోబడిన ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలే పాలకులు, ప్రభువులు…….అంటూ ఏర్పాటు చేసుకొన్న మన రాజ్యాంగం చెప్పుకోడానికి ఎంతో ఘనంగాఉంది. వాస్తవంలోకి తొంగిచూస్తే నిజం మనల్ని వెక్కిరిస్తున్నది. సామాన్య ప్రజలకోసం ప్రభుత్వ సేవల విభాగాల పనితనం యొక్క నిత్య సత్యాలు పరిశీలన చేస్తే ఎలా ఉన్నాయో.. ఒకసారి చూద్దాం చూడండి. మాకోసమే ప్రభుత్వ సేవలు అనే ధైర్యాన్ని, నమ్మకాన్ని సామాన్య ప్రజల మనస్సులో నింపలేకపోతున్నాయి.

అది పోలీసు విభాగమే కావచ్చు, రెవెన్యూ విభాగమే కావచ్చు, కార్పోరేషన్ ఆఫీసు కావచ్చు, స్థానిక పరిపాలనా విభాగాలు కావచ్చు, ప్రభుత్వ బ్యాంకులు కావచ్చు, మరే ఇతర ప్రభుత్వ సేవల విభాగమైనా కావచ్చు, ఏ ఒక్కటి కూడా మేమున్నది మీ కొరకే అన్న దృఢ విశ్వాసాన్ని ప్రజల్లో నేటికీ కల్పించలేకున్నాయన్నది అక్షర సత్యం. 74 సంవత్సరాల కిందట, స్వాతంత్య్రానికి పూర్వం ఏ భయం, ఏ అపోహ, ఏ బెరుకు ప్రజలను పోలీసు, రెవెన్యూ విభాగాల నుండి దూరం చేసిందో ఆ భయం ఇంకా ప్రజల మనుస్సుల్లోంచి తొలిగించ లేక పోతుంది. దశాబ్దాలుగా తరుముతూ వస్తున్న ఆ అపోహలు నేటికీ ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజల మనస్సుల్లో అలానే ఉన్నాయి. భానిసలుగా బతికిన నాటి తరాన్ని, పాలకులుగా చెప్పుకోబడుతున్న నేటి తరాన్ని ఒకే విధమైన భయం వెంటాడుతుండటం ఇంకా పరిణతి చెందని మన ప్రజాస్వామ్యానికి చిహ్నం.

సామాజిక మాధ్యమాల చైతన్యం వెల్లివిరుస్తున్న ఈ ఇంటర్నెట్ యుగంలో కూడా, తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు చెప్పుకోవాలన్నా, తనకు తెలిసిన అన్యాయానికి సంబంధించి పోలీసులకు సమాచారమివ్వలన్నా, ఒకటికి నాలుగుసార్లు ఆలోచించుకున్న తరువాత కాని అడుగులు ముందుకు సాగడం లేదు. రక్షణ కవచాల్లా అగుపించాల్సిన పోలీసు తుపాకులు ఇంకా సామాన్యులకు కాలసర్పాల్లాగానే అగుపిస్తున్నాయి. తండ్రిలా సమాజానికి ధైర్యాన్ని ఇవ్వాల్సిన పోలీసులు, స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ఇంకా ఆ నమ్మకాన్ని ప్రజల్లో నేటికీ కల్పించలేక పోతున్నారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడే గురుతరమైన భాద్యతకు చిహ్నం పోలీసు తుపాకీ. దురదృష్టవశాత్తు అదే తుపాకీ నేడు అధికార దర్పానికి చిహ్నంగా మారింది. ఈనాటికీ నూటికి 70 శాతం ప్రజలు ఇతరుల తోడు లేకుండా, పరిచయస్తులతో సంప్రదించకుండా స్వచ్చందంగా పోలీసు స్టేషన్ లకు వెళ్లలేరన్నది నిత్యం మన కళ్లకు కనిపిస్తున్న నిజమైన వాస్తవం. ఈ భయం సామాన్యుని అపోహే కావచ్చు, కాని భయపడుతున్నారన్నది నిజం. బ్రిటిష్ కాలంలో నిజమైన అధికారాన్ని వెలగబెట్టి, నిన్నా మొన్నటి వరకు వెలుగులు వెలిగిన రెవెన్యూ విభాగానిది కూడా ఇంచు మించు ఇలాంటి కథే.

లాఠీ లు, తూటాలు లేకపోవడం వలన ఆయా కార్యాలయాల్లోకి ప్రజలు విరివిగా వస్తారేమో గాని, మానసికంగా ఇంకా రెవెన్యూ శాఖ ప్రజల చెంతకు చేరలేదన్నది నిజం. రెవెన్యూ చట్టాల చిట్టాలు వెతికి చూస్తే ప్రతి గ్రామానికి సంబందించిన భూవివరాలు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాయి.దస్తావేజుల్లో జరిగే ప్రతి సవరణ, యాజమాన్య మార్పిడి ప్రజల ముందే చట్టబద్దంగా జరుగుతుంది, నిర్ణీత రుసుము చెల్లిస్తే నకలు కాపీలు సకాలంలో అందించ బడతాయి, ప్రజల హక్కులు రక్షించబడతాయి, దుష్టులు శిక్షించబడతారంటూ అక్షరాలు ఎంతో ఘనంగా కనిపిస్తాయి, కాని వాస్తవం నేతి బీరకాయలోని నెయ్యిలాగా వెక్కిరిస్తూనే ఉన్నది.

తెలిసిన అధికారి ద్వారానో, రాజకీయ నాయకుల సహాయంతోనో లేక మరో రూపంలో నో ఎవరో ఒకరు తోడులేకుండా, ఎవరో ఒకరిని సంప్రదించ కుండా రెవెన్యూ కార్యాలయాల్లోకి వెళ్ళడానికి చాలామంది నేటికీ సంకోచిస్తూనే ఉన్నారు. తన ప్రమేయం లేకుండా, తనకు నోటీసుకు రాకుండా తన పేరు రికార్డుల్లోంచి తొలగిపోదన్న నమ్మకం ప్రజలకు లేదు. వ్యవసాయ రుణాలు తీసుకునే రైతులంటే, డ్వాక్రా మహిళలంటే బ్యాంకు అధికారులకు చులకన భావం, వృద్ధాప్య పింఛన్లు అందుకోవాలంటే పడిగాపులు కాయాల్సిందే, మనవడు/మనవరాలు వయసున్న ఉద్యోగులు కసురుకున్నా, చిరుబురులాడుతున్నా, మనస్సు చివుక్కుమన్నా నవ్వుతూ భరించాలి. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులంటే నర్సు మొదలు డాక్టర్ వరకు అందరికీ చులకనే… ఆదాయం గురించి చేసే చింతలో ఐదోవంతైనా ప్రయాణికుల సౌకర్యాల గురించి, వారిపట్ల ఉద్యోగుల తీరుతెన్నుల గురించి ఆలోచించరు రోడ్డు రవాణా సంస్థ అధికారులు.

డ్రైవింగ్ లైసెన్స్ కోసం, వాహన రిజిస్ట్రేషన్ కొరకు రవాణా శాఖ కార్యాలయాల్లోకి అడుగు పెట్టిన వారికి మొదటి నుండి చివరి వరకూ అంతా అయోమయమే ఏ కౌంటర్లో నిలబడాలి, ఎంతకాలానికి కాగితాలు వస్తాయి, పరీక్ష తీరుతెన్నులు, అంతా అస్తవ్యస్తం. సమాధానం లేని అనేక ప్రశ్నలు సామాన్యునికి బ్రోకర్ ను కలువకుండా ఉండలేని పరిస్థితులను సృష్టిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో తాము కూర్చోడానికి కుర్చీలు, బల్లలు ఉంటాయన్న నమ్మకం, ఉన్నాయన్న సమాచారం ప్రజలకు లేదు. ఏ అధికారి ఎంత సమయానికి అందుబాటులోకి వస్తాడన్న సమాచారం ఉండదు. ఏ పనికి ఎంతసమయం పడుతుందో చెప్పగలిగే వ్యవస్థ ఇప్పుడిప్పుడే కాగితాల మీద రూపు దిద్దుకుంటుంది కాని వాస్తవంలో ఇంకా అమలులోకి రానేలేదు. సందర్శకులు వేచి ఉండడానికి సరైన సౌకర్యాలుండవు.

నీటిపారుదలా శాఖలో నైనా సరే తాగడానికి నీటి వసతుండదు. నూరు శాతం మరుగుదొడ్లు ఉన్నాయని ఘనంగా ప్రకటించుకున్న జిల్లాల్లో కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో మూత్రశాలలుండవు మగవాళ్ళు సరే ఏ రోడ్డు మీదనో కానిచ్చేస్తారు, మరి మన తల్లులు, చెల్లెండ్ల పరిస్తితి ఏంటి? వేచి ఉండే గదులు ఎక్కడా అగుపించవు, వానకు తడవాలి, ఎండకు ఎండాలి లేదా ఏ చెట్టో, పుట్టో వెతుక్కోవాలి. 100 డిగ్రీల దాటిన జ్వరంతో బాదపడుతున్న రోగి ఐనా సరే ప్రభుత్వ ఆసుపత్రుల్లో తమ వంతు వచ్చేవరకు క్యూ లో నిలబడే ఉండాలి, టోకెన్ లు, వేచిఉండే గదులు ఏ ఒక్క ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నట్లు దాఖలాలు లేవు.

ఏయే ప్రభుత్వకార్యాలయాలలు ఎక్కడెక్కడున్నాయో ప్రజలే వెతుక్కోవాలి, ఏ అధికారికి ఏయే భాద్యతలున్నాయో జాగ్రత్తగా తెలుసుకోవాలి, అధికారుల ఏకవచన సంబోదనలు, చిరాకులు తెప్పించినా ఓపికతో భరించాలి, తెలివిగా వారి తో పనిచేయించుకోవాలి, ఇదీ జవాబుదారీ వ్యవస్తలో నేటి ప్రభుత్వ కార్యాలయాల పరిస్థితి, పనితీరు.

పన్నుల రూపంలో ప్రజల కష్టార్జితాన్ని జీతాలుగా తీసుకుంటున్న ప్రజా సేవకులను, ప్రజాస్వామ్య ప్రభువులును సారూ, గారూ, అయ్యా, అమ్మా అంటూ దీర్ఘాలు తీస్తూ మర్యాదలు చేయాలి, లేదంటే ఈ సేవకులకు కోపం వస్తుంది, అలుగుతారు, కసురుతారు, కొన్ని విభాగాల్లో విరుచుకు పడతారు, ఎవరైనా ఎదురు తిరిగి ప్రశ్నిస్తే పబ్లిక్ సర్వెంట్ నే ప్రశ్నిస్తారా? అంటూ చట్టాల్లో సెక్షన్లు వెతుకుతారు.ప్రభుత్వ ఉద్యోగాలు అధికార దర్పానికి చిహ్నాలుగా మారిపోయాయి. ఈ మధ్యకాలంలో వివిధ ఉన్నతాదికారులు తమ గదులలోకి వచ్చే సందర్శకుల సెల్ ఫోన్ లను బయట వారి సహాయకుల దగ్గర డిపాజిట్ చేస్తేనే లోనికిరానిస్తున్నారు, అదేమంటే మాటలు రికార్డు చేస్తున్నారు, సామాజిక మాధ్యమాలలో పెట్టేస్తున్నారు అంటూ దీర్ఘాలు తీస్తారు.

ఇక్కడ అర్థం కాని విషయం ఒక్కటే వీరు నిర్వహించేది ప్రజావిధులు కదా, అంతా చట్టబద్దమైన వ్యవహారమే కదా, గోప్యత ఏమీ ఉండదు కదా, అలాంటప్పుడు ఈ అనుమానాలు, భయాలు దేనికి? జవాబులేని ప్రశ్నలు, తలనొప్పులు తెచ్చే సమాదానాలు ఉన్నప్పుడే కదా? భయపడాలి. మీ నిర్ణయంలో స్పష్టత ఉంటే, మీ పనితీరులో నిజాయితీ ఉంటే భయం దేనికి?
మన దేశంలో రోజుకు 100 రూపాయలు సంపాదించలేని బీదలు 36 కోట్లు ఉన్నారు. భారత్ సాధిస్తున్న అభివృద్దిలో న్యాయమైన, కనీసమైన వాటా దక్కని సంచార,అర్ద సంచార, విముక్త జాతులు నేటికి కూడు, గుడ్డ, గూడు లేక బిక్షాటన చేస్తూ బ్రతుకుతున్నారు. ఇలా ఈరకం ప్రజలు దేశంలో 10 నుండి 12 శాతం జనాభా ఉన్నారు. స్విట్జర్లాండ్ దావోస్ లో ప్రపంచ ఆర్థిక వేదిక తన నివేదికలో ‘ దేశ ప్రజల ఆదాయంలో వ్యత్యాసాలు, సంపద పంపిణీలో తేడాల వలన బీదరికం పెరుగుతుందని ‘తెలపటం జరిగింది.

79 అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ 69వ స్థానం. ఆక్సాపామ్ సంస్థ అధ్యయనం ప్రకారం భారత్ లో సంపద పంపిణీలో తీవ్ర అసమానతలు ఉన్నందున 50 శాతం సంపద కేవలం ఒక శాతం సంపన్నుల వద్దనే నిల్వ ఉందని తెల్పటం గమనించాలి. ఆ సంపదని దేశంలో ఒక్కొక్కరికీ 15 లక్షల చొప్పున ఇవ్వవచ్చు. ఇవ్వకున్నా పర్వాలేదు కనీసం అందరికీ ఉపయోగపడే విద్య, వైద్యం, నీరు,ఆహారం,నివాసం,ఉపాది సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుంది.

పాలనా వ్యవస్థలోని అధికారుల, నిర్లక్ష్యంతో పాటు అధికారంలో ఉన్న పాలకుల అశ్రద్ద వల్లనే ఈ సామాన్య ప్రజల పరిస్థితులు ఇలా నెలకొన్నాయి అన్న నిపుణులు వాదనలు నిజం అని నమ్మవలసివస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, పాలకులు సామాన్య ప్రజల అభివృద్ధి కోసం మానవత్వ కోణంలో అలోచించి పేద, నిరుపేద, సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు అన్ని రంగాలో మెరుగు పరుచుటలో కృషి చేసి వారి జీవితాల్లో వెలుగు నింపుతారని ఆశిద్దాం.

                                                                                శ్రీనివాస్ తిపిరిశెట్టి, సీనియర్ జర్నలిస్ట్

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News