*నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
*పనుల్లో వేగం పెంచాలి
*నూతన సచివాలయ నిర్మాణాన్ని పరిశీలించిన సిఎం కెసిఆర్
హైదరాబాద్: ఎక్కడా రాజీపడకుండా నిర్మాణ పనుల్లో అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పనుల్లో వేగం పెంచాలని అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు. నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ ప్రాంగణాన్ని సిఎం కెసిఆర్ మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. నిర్మాణ పనులకు సంబంధించిన వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు జరుగుతున్న తీరును ముఖ్యమంత్రి దగ్గరుండి పర్యవేక్షించారు. త్వరతిగతిన పనులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు. కాసేపు సచివాలయ భవన నిర్మాణ ప్రాంగణమంతా కెసిఆర్ కలియదిరిగారు. నిర్మాణ పనుల్లో భాగంగా ఇంజనీర్లు, గుత్తేదారుల ప్రతినిధులతో సిఎం మాట్లాడి వారికి పలు సూచనలు జారీ చేశారు.
సచివాలయ ప్రధాన గేట్‌లతో పాటు ఇతర గేట్లు అమర్చే ప్రాంతాలు, భవన సముదాయం నిర్మించే ప్రాంతం వాటి డిజైన్‌లను సిఎం పరిశీలించారు. వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్‌తేజ కూడా సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. పాత సెక్రటేరియట్ కూల్చిన తరువాత నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాక సిఎం కెసిఆర్ తొలిసారిగా సచివాలయ ప్రాంతానికి వచ్చారు. సిఎం కెసిఆర్ వెంట మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, ఈఎన్సీ గణపతి రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిలు ఉన్నారు.
రూ.617 కోట్లతో నిర్మాణం
అత్యాధునిక అన్ని సౌకర్యాలతో నూతన సచివాలయ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం 2019 జూన్ 26వ తేదీన శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అయితే కొన్ని సమస్యల కారణంగా కొత్త సచివాలయ నిర్మాణ పనులు 2020 నవంబర్ 06వ తేదీన ప్రారంభం అయ్యాయి. రూ.617 కోట్లతో చేపట్టిన ఈ సచివాలయాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ షాపూర్ జీ పల్లోంజి నిర్మిస్తోంది.
Telangana CM KCR Visit New Secretariat