తొలిసారి పెరేడ్‌లో రఫేల్ యుద్ధ విమానాలు
కొవిడ్ నిబంధనల మేరకు శకటాల ప్రదర్శన
సందర్శకుల సంఖ్య 25 వేలకే పరిమితం
న్యూఢిల్లీ: భారతదేశ 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మంగళవారం నాడిక్కడ రాజ్‌పథ్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరే్రంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర ప్రముఖుల సమక్షంలో త్రివర్ణ పతాకావిష్కరణ జరిగింది. దేశ రక్షణశాఖ అమ్ముల పొదిలో ఇటీవలే చేరిన రఫేల్ యుద్ధ విమానాలు మొట్టమొదటిసారి గణతంత్ర దినోత్సవ పెరేడ్‌లో పాల్గొన్నాయి. దేశ సాయుధ దళాలకు చెందిన టి-90 ట్యాంకులు, సంవిజయ్ ఎలెక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్, సుఖోయ్-30 ఎంకెఐ యుద్ధ విమానాలు సైతం రాజ్‌పథ్ పెరేడ్‌లో పాల్గొన్నాయి. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 17 శకటాలతోపాటు వివిధ మంత్రిత్వశాఖలకు చెందిన 9 శకటాలు, రక్షణ శాఖకు చెందిన ఆరు శకటాలు పెరేడ్‌లో పాల్గొన్నాయి. 2019లో జమ్మూ కశ్మీరు నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడిన లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతం నుంచి మొదటిసారి ఒక శకటం రాజ్‌పథ్‌లో కదిలింది.
కొవిడ్-19 నియమనిబంధనలు అమలులో ఉండడం, దేశ రాజధాని శివార్లలో ఆందోళన చేస్తున్న రైతులు ట్రాక్టర్ల ర్యాలీకి పిలుపునివ్వడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలు కొంత విభిన్నంగా జరిగాయి. ఏటా నిర్వహించే మోటారుసైకిళ్లపై స్టంట్ల ప్రదర్శన ఈసారి జరగలేదు. గత ఏడాది లక్షా 25వేల మంది సందర్శకులు పాల్గొన్న గణతంత్ర వేడుకలు ఈ ఏడాది కేవలం 25 వేల మందికే పరిమితమయ్యాయి. సాహస పురస్కారాలు పొందిన బాలబాలికలు నిర్వహించే పెరేడ్ కూడా ఈసారి కనపడలేదు. భౌతిక దూరం నిబంధనలకు అనుగుణంగా కవాతు చేసే వివిధ సాయుధ దళాల సంఖ్యను 144 నుంచి 96కు కుదించడం జరిగింది. అంతేగాక, పెరేడ్‌లో పాల్గొన్న సాయుధ దళాలకు చెందిన సిబ్బందితోపాటు వివిధ రాష్ట్రాలు, మంత్రిత్వశాఖలు, ప్రభుత్వ విభాగాలకు చెందిన శకటాల ప్రదర్శకులు సైతం కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు.
కాగా.. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలలో అతిథిగా పాల్గొనవలసిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన ప్రయాణం రద్దుపై విచారం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా భారత్‌ను తీర్చదిద్దిన అసాధారణ రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసిన ఆయన రానున్న రోజుల్లో భారతదేశ సందర్శన తప్పక ఉంటుందని పునరుద్ఘాటించారు. తన మిత్రుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానాన్ని పురస్కరించుకుని ఈ ముఖ్యమైన ఘట్టంలో పాల్గొనాలని భావించానని, అయితే కొవిడ్‌పై సాగిస్తున్న పోరు కారణంగా తాను లండన్‌కే పరిమితం కావలసి వచ్చిందని ఆయన తెలిపారు.