Friday, November 22, 2024

దేశానికే ఆదర్శం

- Advertisement -
- Advertisement -

ఉద్యమనేతకే ప్రజలు అధికారం అప్పగించారు
అన్నివిధాల తెలంగాణ కోణంలో సాగుతున్న పాలన

వినూత్న పథకాలు, ప్రజోపయోగ కార్యక్రమాల అమలుతో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది
సరికొత్త ఆవిష్కరణలతో రికార్డులను నెలకొల్పుతున్నది

జాతీయస్థాయిలో కరోనా మరణాలు 1.4 శాతం అయితే తెలంగాణలో0.54 శాతమే

కోలుకున్నవారు దేశమంతటా 96.6% అయితే రాష్ట్రంలో అది 98.02%
పల్లె ప్రగతి అద్భుత ఫలితాలిస్తోంది, పట్టణ ప్రగతితో కాలుష్య నివారణ జరుగుతోంది, పాలన సంస్కరణలు అమోఘం కాళేశ్వరం మానవ నిర్మిత అద్భుతం – 72వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయజెండా ఎగురవేసి చేసిన ప్రసంగంలో గవర్నర్ తమిళిసై

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య, గణతంత్ర దేశం గా వర్ధిల్లుతున్న భారతదేశ చరిత్రలో అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రం తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్నదని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. మునుపెన్నడూ లేని విధంగా కనీవినీ ఎరుగని వినూత్న పథకాలను, ప్రజోపయోగ కార్యక్రమాలను అమలు చేసుకు ంటూ అనేక రంగాల్లో తెలంగాణ నేడు దేశంలోనే అగ్రగామిగా నిలవడం స్ఫూర్తి దాయకయమన్నారు. 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పబ్లిక్ గార్డెన్‌లో గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించా రు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖే ందర్‌రెడ్డి, శాసనసభాధిపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ము ఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులు మహమ్మూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సత్యవతి రాథోడ్, సబిత ఇంద్రారెడ్డి, పలువురు శాసనమండలి, శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అనంతరం గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పోరాటానికి నాయకత్వం వహించిన ఉద్యమ నా యకుడికే, ప్రజలు ఈ రాష్ట్రాన్ని నడిపించే బాధ్యతలు అ ప్పగించడం వల్ల తెలంగాణ దృష్టికోణంలో పాలన సాగుతున్నదని ప్రశంసించారు.గడిచిన ఆరున్నరేళ్లలో పద్ధతి ప్రకారం జరిగిన కృషి ఫలితంగా రాష్ట్రం ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకున్నదన్నారు. కొత్త పథకాలతో, సరికొత్త్త ఆవిష్కరణలతో నూతన రాష్ట్రమైన తెలంగాణ సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నదన్నారు. ఫలితంగా దేశంలోనే ఓ శక్తి వంతమైన రాష్ట్రంగా తెలంగాణ రూపుదిద్దుకుంటున్నదన్నారు. వివిధ రంగాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని ఈ సందర్భంగా ఆమె కూలంకషంగా వివరించారు.
కోవిడ్ – వ్యాక్సినేషన్
2020 ఏడాదంతా కరోనా వైరస్ సృష్టించిన కల్లోలంలో కష్టంగా గడిచిపోయిందన్నారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కావడంతో 2021 సంవత్సరాన్ని మనమంతా ఎంతో ఆశావహ దృక్పథంతో ప్రారంభించుకున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం, ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా నిర్దేశించిన ప్రాధాన్యతా క్రమంలో విజయవంతంగా సాగుతున్నదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడి హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌ను సందర్శించి, కోవాగ్జిన్‌ను అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని స్వయంగా సమీక్షించడం గొప్ప ప్రేరణను అందించిందన్నారు.
పల్లె ప్రగతి
పల్లె సీమల రూపురేఖలు మార్చాలనే మహదాశయంతో ప్రభుత్వం చేపట్టిన ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం నమ్మశక్యం కాని అద్భుత ఫలితాలు అందించిందని గవర్నర్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని పల్లెలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా రూపాంతరం చెందాయన్నారు. తెలంగాణ ఏర్పడిన నాడు రాష్ట్రంలో కేవలం 84 గ్రామ పంచాయతీలకు మాత్రమే సొంతంగా ట్రాక్టర్లు ఉండేవన్నారు. కానీ నేడు మొత్తం 12,765 గ్రామ పంచాయతీలకు ట్యాంకర్లు, ట్రాలీలతో కూడిన సొంత ట్రాక్టర్లు సమకూరాయి. పంచాయతీల ప్రగతి ప్రస్థానం ఎక్కడ నుండి ఎక్కడికి పోయిందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని 19,470 ఆవాస ప్రాంతాల్లో పల్లె ప్రకృతి వనాల పేరుతో పార్కులు అందుబాటులోకి వస్తున్నాయన్నారు.

పట్టణ ప్రగతి
పట్టణాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ. 148 కోట్లు విడుదల చేస్తున్నదని గవర్నర్ అన్నారు. జిహెచ్‌ఎంసి, ఇతర కార్పొరేషన్లకు అదనంగా నిధులు కేటాయిస్తున్నదన్నారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో 2,802 సానిటేషన్ వెహికిల్స్ ఉన్నాయని, మరో 2,004 సానిటేషన్ వెహికిల్స్ ను సమకూరుస్తున్నదన్నారు. పట్టణ ప్రాంతాల్లో 1,018 నర్సరీలను, జిహెచ్‌ఎంసి లో 500 నర్సరీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.

పాలనా సంస్కరణలు
ప్రభుత్వ సేవలు పారదర్శకంగా అందడం కోసం, ప్రజలకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అవినీతికి- కాలయాపనకు అవకాశం లేకుండా చేయడం కోసం ప్రభుత్వం అనేక పాలనా సంస్కరణలను అమలు చేస్తున్నదన్నారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం, కొత్త మున్సిపల్ చట్టం, కొత్త రెవెన్యూ చట్టాలను తెచ్చిందన్నారు. పాలనా విభాగాలను పునర్వ్యవస్థీకరించిందని ఆమె పేర్కొన్నారు.

ధరణి పోర్టల్
వ్యవసాయ భూముల యాజమాన్య హక్కుల విషయంలో స్పష్టత ఇవ్వడం కోసం, క్రయ-విక్రయాలు పారదర్శకంగా జరగడం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మకమైన రెవెన్యూ సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయని సంతోషంగా ప్రకటిస్తున్నానని గవర్నర్ అన్నారు. వ్యవసాయ భూముల రికార్డుల నిర్వహణ కోసం తెచ్చిన ధరణి పోర్టల్ నూటికి నూరు శాతం విజయవంతమైందన్నారు. ఈ పోర్టల్ ద్వారా రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్రయ విక్రయాలను నిమిషాల్లో జరుపుకోగలుగుతున్నారు. రెవెన్యూకు సంబంధించిన అన్ని అంశాలను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించేందుకు జిల్లాల వారీగా కలెక్టర్ల నేతృత్వంలో ప్రత్యేక డ్రైవ్ నడుస్తున్నదన్నారు.

వ్యవసాయం
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ రంగ విధానాలు, పథకాలు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాయన్నారు. దశాబ్దాల తరబడి తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందన్నారు. మానవ నిర్మిత అద్భుతంగా, ప్రపంచంలోనే అతి పెద్ద బహుళ దశల ఎత్తిపోతల పథకంగా ప్రఖ్యాతి పొందిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పంట పొలాలకు నీరందడం ప్రారంభమయిందన్నారు. పాలమూరు-రంగారెడ్డి, సీతారామ, దేవాదుల తదితర ప్రాజెక్టుల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని గవర్నర్ తమిళిసై అన్నారు.

విద్యుత్ రంగం
రాష్ట్రంలోని అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని సగర్వంగా చెబుతున్నానని గవర్నర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పడిన నాడు స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కేవలం 7,888 మెగావాట్లు కాగా, ప్రస్తుతం 16,245 మెగావాట్లకు చేరిందన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు తలసరి విద్యుత్ వినియోగం కేవలం 1,356 మెగావాట్లు ఉంటే, నేడు 2071కి చేరిందన్నారు. అలాగే జాతీయ తలసరి విద్యుత్ వినియోగం 1208 మెగావాట్లుంటే, తెలంగాణలో అంతకంటే 58 శాతం అధికంగా ఉండడం విద్యుత్ రంగంలో మనం దూసుకుపోతున్నామనడానికి ప్రబల నిదర్శనంగా గవర్నర్ పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా, పంపిణీలో నష్టాలను తెలంగాణ 2.41 శాతానికి తగ్గించుకుని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు.

మిషన్ భగీరథ
యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచే మిషన్ భగీరథ పథకం రాష్ట్రంలో మంచినీటి కష్టాలను శాశ్వతంగా దూరం చేసిందని గవర్నర్ అన్నారు. దీని ద్వారా రాష్ట్రంలోని 23,968 ఆవాస ప్రాంతాలకు నేడు సురక్షిత మంచినీరు ప్రతి రోజు అందుతున్నదన్నారు. వంద శాతం ఇండ్లకు నల్లా ద్వారా మంచినీళ్లు అందిస్తూ తెలంగాణ రాష్ట్రం గొప్ప విజయం సాధించిందని ఇటీవల కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ ప్రకటించడం మనం సాధించిన ఘనతకు దక్కిన గుర్తింపుగా పేర్కొన్నారు.

ప్రజారోగ్యం
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి మొదలుకుని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వరకు అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో కావాల్సిన వసతులు కల్పించిందన్నారు. అన్ని రకాల వైద్య పరికరాలను సమకూర్చింది. వైద్యశాల యూనిట్ గా బడ్జెట్ కేటాయించి, ఖర్చు చేస్తున్నదన్నారు. ప్రధానంగా కెసిఆర్ కిట్ పథకం గర్భిణీలకు ఆర్థిక సహకారం అందించడంతో పాటు, ప్రసవ సమయంలో జరిగే మరణాలు గణనీయంగా తగ్గించగలిగిందన్నారు. దీంతో గర్భిణీల మరణాలు రేటు 90 నుంచి 76 శాతానికి తగ్గాయని గవర్నర్ తెలిపారు. అలాగే శిశుమరణాలు 35 నుంచి 29 శాతానికి తగ్గాయన్నారు.
విద్యరంగం
ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థల విద్యార్థులకు దూరదర్శన్ ద్వారా, ఇతర సాధనాల ద్వారా ఆన్ లైన్ క్లాసులు నిర్వహించి విద్యాబోధన చేయడం జరిగిందని పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం కోసం జరిగే పోటీ పరీక్షలకు, ఎంట్రెన్స్ టెస్టులకు సిద్ధం చేసే విధంగా 9 నుంచి ఆపై క్లాసుల విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని స్కూళ్లను, హాస్టళ్లను, రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రభుత్వం శుభ్రపరిచి, సిద్ధం చేస్తున్నదన్నారు.

రాష్ట్రానికి హరితహారం
అడవులతో పాటు, ప్రశాంత జీవనాన్ని పునరుద్ధరించాలనే సమున్నత ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా 230 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యం పెట్టుకోగా, ఇప్పటికే 210.68 కోట్ల మొక్కలను నాటడం జరిగిందన్నారు. జంగిల్ బచావో – జంగిల్ బడావో’ నినాదంతో అటవీభూముల్లో పోయిన అడవిని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా రాష్ట్రంలో గడిచిన మూడేళ్లలో పచ్చదనం 3.67 శాతం పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించడం మన కృషి ఫలిస్తున్నదని చెప్పడానికి నిదర్శనమన్నారు.

ఐటి, పారిశ్రామికాభివృద్ధి
టిఎస్ ఐపాస్ చట్టం వచ్చిన తర్వాత రాష్ట్రానికి కొత్తగా 14,338 పరిశ్రమలు వచ్చాయని గవర్నర్ వివరించారు. వీటి ద్వారా 14,59,639 మందికి ఉద్యోగ అవకాశం లభించిందన్నారు. ఐటి ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రోత్సాహక ఐటి విధానం వల్ల విశ్వ విఖ్యాత ఐటి కంపెనీలు తెలంగాణలో కార్యాలయాలు ప్రారంభించాయన్నారు. తమ కార్యకలాపాలకు, డాటా భద్రతకు అత్యంత సురక్షిత ప్రాంతంగా హైదరాబాద్ నగరాన్ని ఐటి కంపెనీలు ఎంచుకుంటున్నాయన్నారు. కేవలం ఒక్క ఆమెజాన్ వెబ్ సర్వీసెస్ సంస్థనే హైదరాబాద్ లో తమ కార్యకలాపాలు సాగించడానికి ఏకంగా రూ. 20,761 కోట్ల పెట్టుబడితో డాటా సెంటర్ రీజియన్ ఏర్పాటుకు ముందుకు వచ్చిందన్నారు. మైక్రో సాఫ్ట్, గూగుల్, ఐబీఎం, ఒరాకిల్ లాంటి బహుళజాతి సంస్థలు ఇప్పటికే హైదరాబాద్ లో తమ కార్యాలయ ప్రాంగణాలను ఏర్పాటు చేసుకున్నాయని వివరించారు.

హైదరాబాద్‌కు విశ్వనగరం సొగబుగులు
అభివృద్ధి దేశంలోని అతి ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. ఎస్‌ఆర్‌డిపి మొదటి దశలో భాగంగా 26 ప్రధాన రోడ్లను విస్తరించి ఆయా మార్గాల్లో మల్టీలెవల్ ఫ్లైఓవర్లు, ప్రధాన జంక్షన్ల అభివృద్ది చేసి సిగ్నల్ ఫ్రీ ట్రాఫిక్ కు ప్రభుత్వం బాటలు వేసిందన్నారు. దీనిలో భాగంగా 7 స్కై వే లు, 11 మేజర్ కారిడార్ లు, 68 మేజర్ రోడ్స్, 54 గ్రేడ్ సపరేటర్లను చేపట్టింద్నారు. దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించడంతో పాటు హైదరాబాద్ నగరానికి ప్రధాన పర్యాటక ఆకర్షణగా నిలిచిందన్నారు. నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న సంకల్పంతో సిఎం కెసిఆర్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 111 ప్రాంతాల్లో చేపట్టిన లక్ష డబుల్ బెడ్ రూంల నిర్మాణం ముమ్మరంగా సాగుతోందన్నారు.

శాంతి భద్రతలు
శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం రాజీలేని ధోరణి అవలంభిస్తున్నదన్నారు. సంఘ విద్రోహ శక్తులు, అరాచక వ్యక్తులు, మహిళలను వేధించే దుష్టుల విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నదన్నారు. ఇందులో భాగంగా గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసుశాఖను బలోపేతం చేయడానికి ప్రభుత్వం బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయిం చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిఘా పెంచడం కోసం పెద్ద సంఖ్యలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసిందని ఆమె ప్రశంసించారు. దేశ వ్యాప్తంగా ఉన్న సిసి కెమెరాల్లో 65 శాతం తెలంగాణలోనే ఉండడం గమనార్హమన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ నగరంలో నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ త్వరలోనే ప్రారంభం కానున్నదన్నారు.

ఉద్యోగుల సంక్షేమం
ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే ఉద్యోగులకు 42 శాతం ఫిట్మెంటుతో జీతాలు పెంచిందన్నారు. తక్కువ వేతనాలతో పనిచేసే వివిధ వర్గాల ఉద్యోగులందరికీ ప్రభుత్వం వేతనాలు పెంచిందన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితిని పెంచాలని నిర్ణయించిందన్నారు. కారుణ్య నియామకాలను పూర్తి చేసే ప్రక్రియ కొనసాగుతున్నదన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని ప్రభుత్వం ఆయా శాఖలకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. పదోన్నతులు పూర్తయిన వెంటనే అన్ని శాఖల్లో ఏర్పడిన ఖాళీలను ఒకే సారి భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని గవర్నర్ తెలిపారు.

Governor Tamilisai speech on Republic Day

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News