Saturday, November 2, 2024

కొత్త సాగు చట్టాలు ప్రజల సమస్య

- Advertisement -
- Advertisement -

New Farm laws are Public issue

 

గత సంవత్సరం కేంద్రం మూడు కొత్త రైతుల చట్టాలను తీసుకు వచ్చింది. వాటిని రైతులు రద్దు చేయాలని కోరుతున్నారు. ఢిల్లీ పరిసరాల్లో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రైతులు 62 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. వేలాది మంది రైతులు ఇల్లు, కుటుంబాలు వదిలి, ఢిల్లీలో ప్రదర్శనల కోసం బయలుదేరారు. వారిని ఢిల్లీ సరిహద్దుల్లో కేంద్ర ప్రభుత్వం నిలిపి వేసింది. వారు అక్కడే వంటావార్పు, నిద్రతో ఆందోళన చేపట్టారు. వారికి క్రమక్రమంగా దేశ వ్యాప్తంగా మద్దతు పెరుగుతున్నది. వేలాది మంది వారికి మద్దతుగా తరలివస్తున్నారు. వారి ప్రధానమైన డిమాండ్లు ఇటీవల చేసిన మూడు కొత్త చట్టాలను రద్దు చేయడం, ఉపసంహరించుకోవడం, లేదా నాలుగో చట్టం చేసి రైతులకు కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయడం. రైతుల నుండి ప్రభుత్వం ధాన్య సేకరణను కూడా చట్టబద్ధం చేయడం. దాంతోపాటు మార్కెట్‌లో ప్రభుత్వం ధరలు పెరగకుండా చూడడం. రైతులకు భద్రత, రక్షణ పరపతి తదితర సదుపాయాలు కల్పించడం. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతుల మేలుకోరి ఈ మూడు చట్టాలను చేశామని చెప్తున్నది.

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రభుత్వం కనీస మద్దతు ధరతో ధాన్యం కొని నిల్వ చేస్తుంది. కరువు కాలాల్లో, సంక్షోభ సమయాల్లో ధరలు పెరగకుండా, ఆకలి చావులు జరగకుండా ఈ నిల్వలను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా విడుదల చేస్తుంది. ఆహార భద్రత చట్టం 2005 ద్వారా ప్రజలందరికీ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహారాన్ని అందించే బాధ్యతను కేంద్రం స్వీకరించింది. అలా ధరలు పెరగకుండా కూడా చూస్తుంది. ఇలా కొత్త చట్టాల్లో ఇంతదాకా ఉన్న ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించే బాధ్యత నుంచి తప్పుకున్నది. అలాగే ఫుడ్ కార్పొరేషన్ ద్వారా కనీస మద్దతు ధరకు ధాన్యం సేకరించే విధానం నుండి తప్పుకున్నది. మార్కెట్లు ధరల పెరుగుదలను అరికట్టడానికి చర్యలు తీసుకోవడాన్ని వదిలేస్తున్నది. వంద రూపాయల సరుకు వంద యాభై రూపాయలకు ధర పెరిగిన తర్వాతనే ప్రభుత్వం పట్టించుకుంటుంది అని చట్టం మార్చడం జరిగింది. ప్రభుత్వం రైతుల నుండి డైరెక్టుగా ధాన్య సేకరణను చేసే విధానాన్ని వదిలి వేసే చట్టం రూపొందించింది. పొలాల్లో గడ్డిని కాల్చి వేస్తే, కాలుష్యాన్ని సృష్టిస్తే జైలు శిక్షలు నిర్ణయించింది. ధాన్యం ఎవరైనా, ఎక్కడైనా అమ్ముకోవచ్చు. కొనుక్కోవచ్చు అనే స్వేచ్ఛా వ్యాపారాన్ని చట్టాలు ప్రవేశపెట్టాయి. దీనికి అప్పుడే మధ్యప్రదేశ్ ప్రభుత్వం మా రాష్ట్రంలోకి రావడానికి వీలు లేదని బలంగా కౌంటర్ ఇచ్చింది.

దీనికి పరిష్కారంగా రైతులు మద్దతు ధర నిర్ణయించాలని కోరుతున్నారు. మద్దతు ధర మార్కెట్‌లో లేకపోతే ప్రభుత్వమే ఎప్పటిలా కొనాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఇందుకు అంగీకరించడం లేదు. కనీసం మద్దతు ధర గురించి, రైతు సంక్షేమం గురించి స్వామినాథన్ కమిషన్ ఒక నివేదిక సమర్పించింది. భూమి, ఉత్పత్తి ఖర్చుపై శ్రమశక్తి, కూలీలు, నిర్వాహకుల కృషి 50 శాతం కలిపి మద్దతు ధర ఇవ్వాలని సూచించింది. ఇంకా అనేక సూచనలు చేసింది. వాటిని అమలు చేయడం లేదు. ఇప్పుడు మద్దతు ధరతో కొనడానికి కేంద్రం వదిలేస్తున్నది. అందువల్ల ధరలు పెరుగుతాయి. వ్యాపారవేత్తలు మాత్రమే లాభపడతారు. అటు రైతులు, ఇటు ప్రజలు పూర్తిగా నష్టపోతారు. 135 కోట్ల ప్రజలకు ఆహారం అందించడంలో ప్రభుత్వం వెనక్కి తగ్గుతున్నది. వారి ఆహార భద్రత వ్యాపారవేత్తల ఇష్టాయిష్టాలకు, లాభాలకు వదిలివేయబడుతున్నది. ఇది అత్యంత ప్రమాదకరమైన, బాధ్యతారహితమైన పరిస్థితి.

నేటి భారీ సూపర్ మార్కెట్‌లు, గొలుసుకట్టు మాల్స్, కార్పొరేట్ శక్తులు సరుకు సప్లయ్‌దారుల నుండి కనీసం 30 శాతం కమిషన్ తీసుకుంటారు. వంద రూపాయల రేటు వేసి వారి గోదాములకు చేర్చి 70 రూపాయలు యివ్వాల్సి ఉంటుంది. ఆ 70 రూపాయలు కూడా రెండు నెలలకు యిస్తారు. వాళ్ళు 95 100 రూపాయలకు అమ్ముకుంటారు. ఇక ఆ కార్పొరేట్ శక్తులే స్వయంగా హోల్‌సేల్ మార్కెట్‌లో కొన్నప్పుడు 50 శాతం మార్జిన్ వేసుకుంటారు. 50 రూపాయలు కిలో ఉండే బియ్యం 70 రూపాయలు అవుతాయి. ధాన్యాన్ని కొనుగోలు కాడ్నుంచి లెక్కేసుకుంటే పండించిన వారికి సగం, అమ్మిన వారికి సగం చొప్పున ముడతాయి.

అమ్మేవారు చేసే ఉత్పత్తి ఏమి లేకపోయినా సంపాదించడమే విచిత్రం. దీనికి కారణం. బ్యాంకులు వేల కోట్ల రూపాయలను గోదాముల మీద వడ్డీకి ఇవ్వడం. దేశంలో ధరలు పెరగడానికి ప్రధాన కారణం ఈ హోల్‌సేల్ వ్యాపారస్థు లాభాపేక్ష. అందుకు గోదాముల మీద వేల కోట్ల రూపాయలను వడ్డీకి ఇస్తున్న బ్యాంకులే. బ్యాంకులకు వడ్డీ కావాలి. అందుకని వారు వడ్డీలకు ఇస్తున్నారు. ధరలు అదుపులో ఉండాలంటే హోల్‌సేల్ వ్యాపారులకు బ్యాంకులు గోదాముల మీద, ధాన్యం మీద వడ్డీకి ఇవ్వడాన్ని రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం నిషేధించడం అవసరం. ఫ్యూచర్ ట్రేడింగ్‌ను, ఆహార ధాన్యాలపై, షేర్ మార్కెట్ వ్యవహారాలను నిషేధించడం తక్షణ కర్తవ్యం.

భారతదేశంలో స్వాతంత్య్రానికి పూర్వం రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఆహార పంటలకు బదులు ఇతర పంటలు పండించాలని కొన్ని వ్యాపార సంస్థలు లాభాల ఆశ చూపాయి. దాంతో ఆహార ధాన్యాలు లేక దేశంలో లక్షలాది మంది కరువుతో, ఆకలితో చనిపోయారు. ఇలాంటి స్థితి మళ్ళీ రావద్దని, ఆహార పంటలను అందించాలని వాటిని గిట్టుబాటు ధరలతో సేకరించి, ప్రజలకు పంపిణీ చేయాలని, కేంద్రం భావించింది. అట్లా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ఏర్పడింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ధాన్యం సేకరించి, తాను తీసుకుంటుంది. కేంద్రం మద్దతు ధర ఇస్తుంది. అది చాలదనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు యాభై, వంద పెంచి ధాన్యం సేకరించేది. ధరలు పెరగకుండా, ధరలు పెరిగినప్పుడు వాటిని అదుపు చేయడానికి కేంద్రం ఫుడ్ కార్పొరేషన్ వద్ద గల ధాన్యం నిల్వలను విడుదల చేసి, ధరలను అదుపు చేస్తున్నది. ఈ విధానం ఇప్పుడు కొనసాగుతున్నది.

కొత్త చట్టం ఈ విధానానికి భంగం కలిగిస్తున్నది. 2005 ఆహార భద్రత చట్టం లక్ష్యం నీరుగారిపోతున్నది. బడా వ్యాపార సంస్థలు రైతులతో ఒప్పందం కుదుర్చుకొని ఫలానా పంటలు వేయండి అని కోరే సౌలభ్యం కొత్త చట్టం ఇస్తున్నది. దానివల్ల ఫలానా ఎరువులు, ఫలానా పంటలు వేయాలని ఒప్పందంలో పేర్కొంటుంది. దాని వల్ల ఐదేళ్ళల్లో మొత్తం భూసారం దెబ్బ తినవచ్చు. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే వ్యాపారవేత్తలపై చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు రైతులకు ఉండదు. దేశంలో ఇప్పుడు జరుగుతున్న కొన్ని హోల్‌సేల్ వ్యాపారాలను గమనిస్తే రేపు ఈ కొత్త చట్టాల ద్వారా ఏమి జరుగుతున్నదో తెలుస్తుంది. మిరపకాయలు, పసుపు అనే రెండు పంటలను, వాటి ధరలను మహారాష్ట్రలోని సాంఘ్లి జిల్లాలో ఉన్న మార్వాడీ, గుజరాతీ వ్యాపారవేత్తలు నిర్ణయిస్తుంటారు. ఆ సంవత్సరంలో ఎన్ని ఎకరాల్లో వీటిని పండిస్తున్నారో తెలుసుకుంటారు. ఎంత పండిందో లెక్కలు గమనిస్తారు.

మార్కెట్‌లోకి ప్రవేశించి వంద రూపాయలు కిలో చొప్పున ధర ఉండేట్టు కొంటారు. అంతకు మించి ధర పెరగకుండా ఆ ధరకే కొనాలని చూస్తారు. ఉత్పత్తి అయిన పంటలో 70 శాతం ఈ వ్యాపారవేత్తల గోదాముల్లోకి చేరిన తర్వాత ఇక వాటిని 250 రూపాయలకు కిలో చొప్పున అమ్ముతామని, పసుపు, మిర్చి, మిర్చిపొడి తయారీదార్లకు, హోటళ్ళకు, హోల్‌సేల్ వ్యాపారస్థులకు విడుదల చేస్తారు. ఇలా ధరలు పడగొట్టి సరుకు మొత్తం తమ దగ్గరికి చేరిన తర్వాత ధరలు పెంచుతారు. చింతపండు సీజన్‌లో 20 రూపాయలకు కిలో చేసి మార్కెట్‌లో ఉత్పత్తి వ్యాపారవేత్తల గోదాములోకి చేరాక 100 అంటారు. 150 అంటారు.

ఇటీవలి కాలం దాకా సంత్రాలు, మోసంబీలు, కోడిగుడ్ల హోల్‌సేల్ వ్యాపారాన్ని దేశం మొత్తం మీద ధరలను నాగపూర్ వ్యాపారవేత్తలు నిర్దేశించేవారు. 35 పైసలకు ఒక మోసంబి హోల్‌సేల్ ధరలతో రైతుకు గిట్టుబాటు ఇచ్చేవారు. వాటిని గ్రేడియేషన్ చేసి 3.50 పైసల దాకా అమ్మేవారు. 35 పైసల్లోనే ఉత్పత్తి ఖర్చంతా వెళ్ళాలి. ఏ ఉత్పత్తి లేకుండానే దాని మీద మూడు రూపాయలకు పైగా లాభం సంపాయించేవారు. పసుపు, మిర్చి, చింతపండు వంటి సరుకులపై కూడా ఏ ఉత్పత్తి లేకుండానే కేవలం కొని దాచిపెట్టి అమ్మినందుకు రెట్టింపు ధరతో లాభం గుంజేవారు. ఇదే విధానం ఈ కొత్త చట్టాలతో బియ్యం, గోధుమలు, పప్పులు, నూనెలు వంటి వాటికి విస్తరింపజేస్తున్నది. దీనివల్ల మార్కెట్లోకి ధాన్యం వచ్చినపుడు ధరలు తగ్గించి విధిలేని స్థితిలో అమ్ముకునేట్టు చేస్తారు. ఆ తర్వాత ధరలు పెంచి అమ్ముతారు.

కొత్త చట్టాలను అమలు జరిపేదైతే రైతులకు కార్పొరేట్ శక్తులకు మధ్య ఒప్పందాల్లో రైతు కార్పొరేట్లు సంస్థల భాగస్వామ్యం ఉండాలి. అనగా ఆ కార్పొరేట్ సంస్థకు సబ్సిడీగా ఉద్యోగులుగా, సప్లయ్‌దారులుగా గుర్తింపు పొందాలి. వారికి ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్ మద్దతు ధర సౌకర్యాలు కల్పించబడాలి. యేటా లాభాల్లో 50 శాతం తిరిగి రైతులకు చెల్లించే విధంగా మరో కొత్త చట్టం తీసుకురావాలి. అలా రైతులకు మద్దతు ధర ప్రకటించడం ధాన్య సేకరణ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బఫర్ నిల్వల విధానం, బ్యాంకుల కట్టడి చట్టాలు ఒక నాలుగో చట్టంగా తీసుకువచ్చినపుడు రైతులకు, వినియోగదారులకు, ప్రజలకు మేలు జరుగుతుంది.

ఇది చాలా సులభం కూడా. అప్పుడు వ్యవసాయం కూడా ఒక పరిశ్రమగా గుర్తింపు పొందుతుంది. వ్యవసాయం ఒక వృత్తిగా, ఉపాధి కల్పనగా కూడా గుర్తింపునివ్వవలసి ఉంటుంది. దానివల్ల ఉపాధి కల్పన లెక్కల్లో యేడాదికి 280 రోజుల పని కల్పనకు అనువుగా ఉపాధి కల్పన గురించి పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వాలు, ప్రణాళికలు ఇతర రంగాల్లో వారి శ్రమశక్తి సేవలు వినియోగించుకునే విధానాలు రూపొందుతాయి. అలా అభివృద్ధి, సంక్షేమం, అందరికీ ఆహారం, అందరికీ ఇండ్లు, అందరికీ ఉన్నత విద్య, అందరికీ ఉపాధి రక్షణ విధానం రూపుదిద్దుకుంటుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News