ఎబినేజర్ సేవలకు దక్కిన గుర్తింపు
ఉత్తమ ల్యాబ్ టెక్నీషియన్‌గా అవార్డు
మన తెలంగాణ/ములకలపల్లి : గత కొద్ది నెలల క్రితం వరకు మంగపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్‌గా విధులు నిర్వహించి డిప్యుటీషన్‌పై జిల్లా కేంద్రంలోని వైరాలజీ ల్యాబ్(రీజనల్ ల్యాబ్)కు వెళ్ళి కోవిడ్ 19 సమయంలో ల్యాబ్ టెక్నీషియన్‌గా చేసిన కృషికి గణతంత్ర దినోత్సవం నాడు జిల్లా కలెక్టర్ డా.ఎం.వీ.రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ ల్యాబ్ టెక్నీషియన్‌గా అవార్డు ఎబినేజర్ అందుకున్నారు. 2002వ సంవత్సరంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ల్యాబ్ టెక్నీషియన్‌గా విధుల్లో చేరారు. ఆనాటి జిల్లా వైద్యశాఖ అధికారులు, ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి ఆదేశాల మేరకు వైద్యశాలలలోను, విద్యాలయాలలోను సికిల్ సెల్, ఎనిమియా స్క్రీనింగ్ ప్రోగ్రామ్‌లో 2016 వరకు ఏర్పాటు చేసిన టీమ్ తో పని చేశారు. ఉమ్మడి జిల్లాలలోని 32 మండలాలలో 48 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 112 వసతి గృహాలలో 25,122 మంది పిల్లలకు సికిల్ సెల్, ఎనిమియా స్క్రీనింగ్, తలసేమియా పరీక్షలను నిర్వహించారు.
రెండవ దశ 2017-2018 సంవత్సరంలో 13,361 మంది పిల్లలకు సికిల్ సెల్, ఎనిమియా స్క్రీనింగ్, తలసేమియా పరీక్షలను నిర్వహించారు. 2009 సంవత్సరం నుండి 2020 వరకు మంగపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహించి వైద్య సిబ్బంది మండల ప్రజల ఆదరాభిమానాలను పొందారు. కోవిడ్ 19 సమయంలో జిల్లా వైరాలజీ ల్యాబ్‌కు డిప్యుటీషన్‌పై వెళ్ళి ట్రూనాట్, ఆర్టీపిసిఆర్, సిబినాట్ పరీక్షలను నిర్వహించి జిల్లా ప్రజలు, జిల్లా అధికారుల మన్ననలను పొందారు. గతంలో రెండు పర్యాయాలు ఉత్తమ ల్యాబ్ టెక్నీషియన్‌గా ఎంపిక కావడమే కాక మరోమారు ఉత్తమ ల్యాబ్ టెక్నీషియన్‌గా అవార్డు పొందడం పట్ల పలువురు అభినందిస్తున్నారు.